డెత్ నెం 5... అమెరికాలో మరో భారత సంతతి విద్యార్థి మృతి!
రోజు రోజుకీ అమెరికాలో ఉంటున్న భారత సంతతి విద్యార్థులకు జరుగుతున్న ప్రమాదాలు, సంభవిస్తున్న మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి
రోజు రోజుకీ అమెరికాలో ఉంటున్న భారత సంతతి విద్యార్థులకు జరుగుతున్న ప్రమాదాలు, సంభవిస్తున్న మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి! ఈ తరహా సంఘటనలు రెగ్యులర్ గా సంభవిస్తుండటంతో అమెరికాలో ఏమి జరుగుతుంది.. భారతీయ విద్యార్థులే లక్ష్యంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా మరో భారత సంతతి విద్యార్థి మృతి చెందాడు.
అవును... అమెరికాలో చదువుకుంటున్న భారతీయ, భారత సంతతి విద్యార్థులు వరుసగా ప్రమాదాల బారిన పడుతుండటం, ప్రాణాలు కోల్పోతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. ఇందులో భాగంగా యూఎస్ లోని ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్శిటీలో పీ.హెచ్.డీ చదువుతున్న వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. దీంతో ఈ ఏడాది భారత మూలాలున్న విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం ఇది ఐదోసారి!!
వివరాళ్లోకి వెళ్తే... భారత సంతతి విద్యార్థి 23 ఏళ్ల సమీర్ కామత్ ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో పీ.హెచ్.డీ చదువుతున్నాడు. గతేడాది ఆగస్టులో మాస్టర్స్ పూర్తి చేసిన అతడికి అమెరికా పౌరసత్వం ఉంది. ఈ సమయంలో సోమవారం సాయంత్రం స్థానిక నేచర్ రిజర్వ్ వద్ద అతడు విగతజీవిగా కన్పించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే అతడి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఈ విషయాలపై స్పందించిన అధికారులు... సమీర్ కామత్ మరణానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు. ఈ క్రమంలో... ఫోరెన్సిక్ పోస్టుమార్టం నిర్వహించిన తర్వాతే ఈ విషయంపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
కాగా... ఇటీవల పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న మరో భారత సంతతి విద్యార్థి నీల్ ఆచార్య ఇదేవిధంగా అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. తన కుమారుడు కనిపించడం లేదంటూ అతడి తల్లి సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తూ.. నీల్ ను క్యాంపస్ లో డ్రాప్ చేసిన ఉబెర్ డ్రైవర్ చివరిగా చూశాడని వెల్లడించింది. ఈ సమయంలో... కొన్ని గంటల తర్వాత.. అతని మృతదేహం క్యాంపస్ లోనే లభ్యమైంది.
ఇదే సమయంలో గతవారం ఒహాయోలో భారత-అమెరికన్ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి (19) మరణించిన సంగతీ తెలిసిందే. ఇదే క్రమంలో... జార్జియా రాష్ట్రంలోని లిథోనియాలో భారతీయ విద్యార్థి వివేక్ సైనీ (25) ఓ నిరాశ్రయుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఇదే క్రమంలో గత నెలలో కూడా మరో భారతీయ విద్యార్థి అకుల్ ధవన్.. ఇల్లినాయ్ యూనివర్సిటీ వెలుపల శవమై కనిపించాడు. ఇలా వరుసగా వెలుగుచూస్తున్న మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అంటున్నారు!