ఉపగ్రహ విధ్వంసక ఆయుధాలు... రష్యాపై సంచలన ఆరోపణలు!

ఇప్పటివరకూ రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. రెండో ప్రపంచ యుద్ధం పేరు చెబితే ప్రధానంగా హిరోషిమా, నాగసాకీలే గుర్తుకువస్తుంటాయి

Update: 2024-02-16 14:30 GMT

ఇప్పటివరకూ రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. రెండో ప్రపంచ యుద్ధం పేరు చెబితే ప్రధానంగా హిరోషిమా, నాగసాకీలే గుర్తుకువస్తుంటాయి. ఆ దేశం తర్వాత అద్భుతంగా తేరుకుంది. ఆ సంగతి అలా ఉంటే... ఈసారి మరో ప్రపంచ యుద్ధం గనుక సంభవిస్తే ఈ ప్రపంచం అంతమైపోతుందనేది పరిశీలకులు చెప్పేమాట. అందుకు కారణం... ప్రపంచంలోని ప్రధాన దేశాలన్నీ అణ్వస్త్ర సామర్థ్యాన్ని కలిగి ఉండటమే! ఈ క్రమంలో మరో సంచలన విషయాన్ని ప్రస్థావించింది అమెరికా. ఈ మేరకు రష్యాపై ఆరోపణలు చేసింది.

అవును... ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా శాంతిని కోరుకునే దేశాలతో పాటు నియంతృత్వ పోకడలు పుష్కలంగా ఉన్న దేశాలు కూడా అణ్వస్త్ర సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ సమయంలో అంతకు మించి అన్నట్లుగా... ఉపగ్రహ విధ్వంసక ఆయుధాన్ని రష్యా అభివృద్ధి చేస్తున్నట్లుగా తమకు సమాచారం ఉందంటూ అగ్రరాజ్యం అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఇదే సమయంలో దీన్ని అత్యంత ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంది. అయితే... ఆ ఆయుద్ధాన్ని ఇప్పటివరకూ ప్రయోగించలేదని తెలిపింది.

వాస్తవానికి గతంలోనే... రష్యా ఓ కీలక ఆయుధాన్ని రహస్యంగా అభివృద్ధి చేస్తున్నట్లు పక్కా సమాచారం యూఎస్ ఇంటెలిజెన్స్‌ వద్ద ఉందని వార్తలొచ్చాయి. దీంతో ఈ విషయంపై వాస్తవాస్తవాలను బయట పెట్టాలంటూ అధ్యక్షుడు బైడెన్ టీం ని ప్రతినిధుల సభ ఇంటెలిజెన్స్‌ కమిటీ ఛైర్మన్‌ మైక్‌ టర్నర్‌ డిమాండ్‌ చేశారు. దీంతో ఆ వార్తల్ని వైట్ హౌస్ ధృవీకరించింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రతినిధి జాన్‌ కిర్బీ స్పందిస్తూ... ఆ వార్తలు నిజమే కానీ... ప్రస్తుతానికి ఇంతకు మించిన సమాచారన్ని వెళ్లడించలేమని తెలిపారు.

ఇదే విషయానికి సంబంధించి రష్యా తయారు చేస్తున్న ఉపగ్రహ విధ్వంసక ఆయుధానికి అణ్వస్త్ర సామర్థ్యం ఉందంటూ కూడా వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై మాత్రం కిర్బీ స్పష్టతనివ్వలేదు. ఇదే సమయంలో... ఆ ఆయుధం వల్ల ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ.. భూ కక్ష్యలోని ఉపగ్రహాలతోపాటు.. దిగువ కక్ష్యలో ఉండే వ్యోమగాములకు ముప్పు పొంచి ఉంటుందని అన్నారు. ప్రధానంగా... అంతరిక్షం నుంచి భూమిపై దాడి చేసే సామర్థ్యాన్ని ఆ ఆయుధం కలిగి ఉందని మాత్రం చెప్పట్లేదని తెలిపారు.

ఇదే సమయంలో... అమెరికన్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ స్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ బడ్జెట్‌ నిపుణుడు టాడ్‌ హారిసన్‌ ఇదే విషయంపై స్పందించారు. ఇందులో భాగంగా అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న ఆయుధాన్ని రష్యా అంతరిక్షంలోకి పంపితే అది చాలా ప్రమాదకరమని వెల్లడించారు. ఇదే క్రమంలో... దీనివల్ల భూదిగువ కక్ష్యలో ఉపగ్రహాలన్నీ దెబ్బతింటాయని.. ఇంటర్నేషనల్ అంతరిక్ష కేంద్రం సైతం ప్రభావితమవుతుందని.. అందులోని వ్యోమగాములకూ ముప్పు తప్పదని వివరించారు.

Tags:    

Similar News