పురందేశ్వరికి ఢిల్లీ పిలుపు.. రాష్ట్ర బీజేపీలో అనూహ్య పరిణామాలు

ఏపీలో సొంతంగా ఎదగాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. పొత్తు లేకపోతే రాష్ట్రంలో ఖాతా తెరవడం కూడా ఆ పార్టీకి సాధ్యం కావడం లేదు.

Update: 2025-02-16 16:42 GMT

కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న బీజేపీ.. రాష్ట్రంలో స్వంత్రంగా బలపడేందుకు ఇదే తగిన సమయంగా భావిస్తోందా? ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ ఏపీలో బీజేపీ క్యాడర్ పెరగడం లేదని ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు అభిప్రాయపడుతున్నారని అంటున్నారు. ఇతర పార్టీల నుంచి నేతలు వస్తామని బీజేపీని సంప్రదిస్తున్నప్పటికీ.. కూటమిలోని ప్రధాన పార్టీ టీడీపీ అభ్యంతరాలతో ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదని రాష్ట్ర పార్టీలో కొందరు ప్రముఖులు పార్టీ అధిష్టానానికి సమాచారమిచ్చినట్లు చెబుతున్నారు. దీంతో ఏపీలో బీజేపీ ఎదుగుదలకు ఏం చేయాలన్న విషయమై చర్చించేందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరిని ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది.

ఏపీలో సొంతంగా ఎదగాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. పొత్తు లేకపోతే రాష్ట్రంలో ఖాతా తెరవడం కూడా ఆ పార్టీకి సాధ్యం కావడం లేదు. అంతేకాదు అత్తెసరు ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఇదే సరైన సమయంగా ఢిల్లీ పెద్దలు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు 4.0 ప్రభుత్వంలో వివిధ అభివృద్ధి పనులకు కేంద్రం విరివిగా నిధులు సమకూర్చుతోంది. ముఖ్యంగా చంద్రబాబు ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించుకున్న పోలవరం, అమరావతికి కేంద్ర సహకారంపై పెద్దగా ప్రచారం ఉండటం లేదని ఆ పార్టీ అగ్ర నేతలు భావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వందశాతం కేంద్రమే నిధులిస్తోంది. మరోవైపు రాజధాని అమరావతి పనుల కోసం అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వడంతోపాటు దాదాపు 26 వేల కోట్ల రూపాయలు నిధులు సమకూర్చేందుకు సహకరించిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ, క్షేత్ర స్థాయిలో బీజేపీకి అనుకున్న మైలేజ్ రావడం లేదనే ఆవేదన ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.

ఇదే సమయంలో ప్రతిపక్ష వైసీపీలో ఇమడలేని నేతలు.. టీడీపీ, జనసేనపై ఆసక్తిలేని చాలా మంది బీజేపీలో చేరేందుకు సంప్రదిస్తున్నారు. అయితే అలాంటి వారిని పార్టీలో చేర్చుకునే విషయంలో రాష్ట్ర పార్టీ విఫలమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా వైసీపీ నుంచి బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపే నేతల విషయంలో టీడీపీ కొర్రీలు వేస్తోందని అంటున్నారు. విశాఖ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ బీజేపీలో చేరినప్పుడు టీడీపీ నేతలు నానా రాద్ధాంతం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితులను రాష్ట్ర బీజేపీ నేతలు సరిగా అడ్డుకోలేకపోయారని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితికి కారణాలు తెలుసుకోవడంతోపాటు పార్టీలో సమూల మార్పులు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరిని ఢిల్లీకి పిలిపించినట్లు చెబుతున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి పదవీ కాలం పూర్తవుతోంది. ఆమె స్థానంలో కొత్తవారిని నియమించాలని పార్టీ భావిస్తోంది. ఈ నెలాఖరులోగా పార్టీని పునర్వవ్యస్థీకరించాలని కమలం పెద్దల ఆలోచనగా ఉందంటున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుల నియామకం తర్వాతే జాతీయ పార్టీ అధ్యక్షుడిని నియమించుకునే అవకాశం ఉంది. అయితే పురందేశ్వరిని మరోసారి కొనసాగించాలా? లేక ఆమె సేవలను జాతీయ స్థాయిలో వాడుకోవాలా? అనేది ఆ పార్టీ పెద్దల్లో పెద్ద చర్చకు దారితీస్తోందని చెబుతున్నారు. పురందేశ్వరి వల్లే మోదీ 3.0 సాధ్యమైందనే అభిప్రాయం కూడా ఉంది. ఏపీలో కూటమిలో ఏర్పాటులో జనసేనాని పవన్ తోపాటు, పురందేశ్వరి కూడా టీడీపీతో స్నేహానికి శ్రేణులను సిద్ధం చేయడం వల్ల ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయని, జాతీయ స్థాయిలో మెజార్టీ తగ్గినా, ఏపీలో ఎంపీల బలంతో ప్రభుత్వం నిలదొక్కుకుందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెను జాతీయ రాజకీయాల్లోకి తీసుకోవాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పురందేశ్వరి.. మోదీ 3.0 ప్రభుత్వంలోనూ కీలక పదవి దక్కించుకుంటారని ప్రచారం జరిగింది. కానీ, ఆమె బదులుగా నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు అవకాశం దక్కింది. అయితే ఇప్పుడు పురందేశ్వరిని అధ్యక్షురాలిగా తప్పిస్తే.. పార్టీకి కొత్త అధ్యక్ష్యుడిగా ఎవరిని నియమించాలనే విషయమే చర్చించే అవకాశం ఉందంటున్నారు. ఇక పార్టీ బలోపేతంపైనా చర్చలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఏదిఏమైనా బీజేపీలో అనూహ్య మార్పులు ఉంటాయనే ప్రచారం ఎక్కువగా సాగుతోంది.

Tags:    

Similar News