బోలెడంత డబ్బు భారత్ వద్ద ఉందట.. ఈర్ష్య పడుతూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అమెరికా ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించేందుకు రూపొందించిన డోజ్‌ విభాగం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.

Update: 2025-02-19 16:30 GMT

ఒక దేశం సంపాదించిన డబ్బును ఇతర దేశాల్లో ఓటర్లను పెంచేందుకు ఖర్చు చేయడం ఏంటి? ఎంత పెద్దన్న దేశం అయితే మాత్రం దీన్ని ఎవరూ ఒప్పుకోరు.. ట్రంప్ కూడా అంతే.. అమెరికన్ల సంపదను ఇండియాకు దోచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఇండియా వద్ద చాలా డబ్బు ఉందని.. మనమెందుకు ఇవ్వాలంటూ ప్రశ్నించాడు. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అమెరికా ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించేందుకు రూపొందించిన డోజ్‌ విభాగం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఇటీవల భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు కేటాయించిన 21 మిలియన్‌ డాలర్ల నిధిని ఈ విభాగం రద్దు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నిర్ణయాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమర్థించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫ్లోరిడాలో తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో, ఈ నిధుల రద్దు గురించి ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ "భారత్‌కు మేం ఎందుకు 21 మిలియన్‌ డాలర్లు ఇవ్వాలి? వారివద్ద చాలా డబ్బు ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. వారు విధించే సుంకాలు కూడా ఎక్కువ. ఈ విషయంలో అమెరికా భారత్‌ను చేరుకోలేదు. నాకు భారత ప్రజలు, ఆ దేశ ప్రధాని పట్ల గౌరవం ఉంది. కానీ వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు మన పన్ను చెల్లింపుదారుల డబ్బును ఎందుకు ఇవ్వాలి?" అంటూ ప్రశ్నలు సంధించారు.

ఫిబ్రవరి 16న ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని డోజ్‌ విభాగం ఇతర దేశాలకు అందించే నిధుల్లో కోత విధిస్తూ ఓ జాబితాను విడుదల చేసింది. ఇందులో భారత్‌ ఎన్నికల ప్రక్రియకు కేటాయించిన నిధులతో పాటు, బంగ్లాదేశ్, నేపాల్‌ కు కేటాయించిన నిధులను కూడా రద్దు చేసినట్లు ప్రకటించింది.

-భారత రాజకీయాల్లో వివాదం

ఈ పరిణామం భారత రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. "ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్‌ డాలర్లా? ఇది భారత్‌ ఎన్నికల వ్యవస్థలో జోక్యం చేసుకోవడమే" అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అమిత్‌ మాలవీయ స్పందిస్తూ "ఈ నిధులతో లాభపడింది ఎవరు? కచ్చితంగా అధికార పార్టీ కాదు" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.

అంతేగాక, విదేశీ సంస్థలు భారత రాజకీయ వ్యవస్థలో చొరబాటుకు యత్నిస్తున్నాయంటూ ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీపై విదేశీ సంబంధాల ఆరోపణలు చేస్తూ విమర్శలు గుప్పించారు. అయితే, కాంగ్రెస్‌ నేతలు ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. ఇప్పుడు ట్రంప్ చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. భారత్ ను సంపన్న దేశంగానే అమెరికా అధ్యక్షుడు చూస్తున్నట్టు కనిపిస్తోంది.

Tags:    

Similar News