తిరుమల చరిత్రలోనే తొలిసారి? తాడోపేడో తేల్చుకోవడమే..
దీంతో తిరుమల చరిత్రలో తొలసారిగా ఇలాంటి ఆందోళనలు జరుగుతున్నాయని అంటున్నారు.
తిరుమల తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేనట్లు ఉద్యోగులు నిరసనకు దిగుతున్నారు. ఉద్యోగి పట్ల అనుచితంగా ప్రవర్తించిన బోర్డు సభ్యుడిని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు రెండో రోజూ కొనసాగాయి. గురువారం తిరుపతి పరిపాలనా భవనం వద్ద అనూహ్యంగా బైఠాయించి ధర్నా చేసిన ఉద్యోగులు, శుక్ర, శనివారాల్లో కూడా తమ నిరసనలు కొనసాగించాలని నిర్ణయించారు. అదేసమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని తీర్మానించారు. దీంతో తిరుమల చరిత్రలో తొలసారిగా ఇలాంటి ఆందోళనలు జరుగుతున్నాయని అంటున్నారు.
నిబంధనల ప్రకారం నడుచుకోవడమే తప్పా? అంటూ ప్రశ్నిస్తున్న ఉద్యోగులు పాలకమండలి నుంచి సభ్యుడు నరేశ్ కుమార్ ను తప్పించాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఉద్యోగులు మూకుమ్మడిగా ఒకటే నినాదం చేస్తుండటంతో ప్రభుత్వం ఇరుకన పడిందని అంటున్నారు. ఉద్యోగులకు మద్దతు పలుకుతున్న అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరితో సహా కీలక అధికారులు ఉద్యోగులతో చర్చలు జరుపుతున్నారు.
మరోవైపు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి సైతం ఉద్యోగులతో చర్చలు జరుపుతున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేస్తానని భానుప్రకాశ్ రెడ్డి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతోనూ భానుప్రకాశ్ రెడ్డి చర్చించారని అంటున్నారు. కాగా, టీటీడీ బోర్డు సభ్యుడు నరేశ్ కుమార్ అనుచితంగా ప్రవర్తించడంపై తాము బాధపడుతున్నట్లు అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నట్లు తెలుస్తోంది. అయితే వివాదం పెద్దది చేయొద్దని, తాము చూసుకుంటామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, వీజీవో రాంకుమార్ చెప్పినట్లు ఉద్యోగ నేతలు చెబుతున్నారు.
అయితే అడిషనల్ ఈవో ఇతర ఉన్నతాధికారుల సూచన మేరకు తమ ఆందోళనలను గాంధేయమార్గంలో నిర్వహిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. 21, 22 తేదీల్లో శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే 24న ఉద్యమ కార్యాచరణ తెలియజేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ రెండు రోజులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనల్లో పాల్గొనాలని ఉద్యోగ సంఘాల నేతలకు పిలుపునిచ్చారు.