ఫాల్గుణ మాసం బడ్జెట్ పాలపొంగులా మారుతుందా ?
ఈ నేపథ్యంలో బడ్జెట్ అంటే రెండింటీని సమతూకం చేసుకోవాల్సి ఉంది. అంతే కాదు రెండు బలమైన వర్గాలనూ తమ విశ్వాసంలోకి తీసుకోవాల్సి ఉంది.
ఏపీలో టీడీపీ కూటమి తొలిసారి పూర్తి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతోంది. ఈ బడ్జెట్ లో చాలా విషయాలు ఉంటాయని అంటున్నారు. రెవెన్యూ విషయంలో అలాగే ఖర్చుల విషయంలో బ్యాలెన్స్ చేసేందుకు ఇప్పటికీ అధికారులు చాలా కసరత్తు చేస్తున్నారు అని అంటున్నారు. ఇక చూస్తే బడ్జెట్ లో సంక్షేమ పధకాలకు ఎంత కేటాయింపు ఉంటుంది అలాగే అభివృద్ధి కార్యకర్మాల కోసం వివిధ రంగాలకు ఎంత కేటాయింపులు చేస్తారు అన్నది చర్చనీయాంశంగా ఉంది.
ఇదిలా ఉండగా బడ్జెట్ సెషన్ ఈ నెల 24 నుంచి ప్రారంభం అవుతుంది. 25న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం చేయనున్నారు. మరో వైపు చూస్తే ఈ నెల 28న బడ్జెట్ ని ప్రవేశపెడతారని అంటున్నారు. ఆ రోజు ఫాల్గుణ మాసం, పాఢ్యమి తిధిగా ఉంది. ఫాల్గుణ మాసం కూడా మంచి రోజుగానే ఉంది.
దాంతో బడ్జెట్ ని ఆ శుభమైన రోజున ప్రవేశపెడుతున్నారు అని అంటున్నారు. అయితే బడ్జెట్ ఈసారి ఏపీని పాల పొంగుగా మారుస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏపీలో అభివృద్ధి అవసరం అనుకున్న వర్గాలు అన్నీ కూటమికే పట్టం కట్టాయి.
వారంతా ఏపీని ప్రగతి బాటను నడిపించమని కోరుతున్నారు. అభివృద్ధితోనే సంపద దక్కుతుందని దాంతోనే సంక్షేమ పధకాలు అయినా మరేమి అయినా చేపట్టవచ్చు అన్నది మేధావులు అభ్యుదయగాముల వాదనగా ఉంది.
అదే సమయంలో సంక్షేమం కోరుతూ కూడా అంతే స్థాయిలో కూటమికి పట్టం కట్టిన వర్గాలు ఉన్నాయి. రెట్టింపు సంక్షేమం అంటూ సూపర్ సిక్స్ పేరుతో కూటమి పెద్దలు ఇచ్చిన హామీలు జనంలోకి బలంగా వెళ్ళాయి. దాంతో ఆయా వర్గాలు కూడా వేయి కళ్ళతో బడ్జెట్ గురించి ఆలోచిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బడ్జెట్ అంటే రెండింటీని సమతూకం చేసుకోవాల్సి ఉంది. అంతే కాదు రెండు బలమైన వర్గాలనూ తమ విశ్వాసంలోకి తీసుకోవాల్సి ఉంది. అందుకే ఈసారి బడ్జెట్ కూటమికి కత్తిమీద సాము లాంటిది అని అంటున్నారు
ఇక కాస్తా పదేళ్ళ వెనక్కి వెళ్తే 2014 నుంచి 2019 మధ్యలో అయిదు సార్లు టీడీపీ బడ్జెట్ ని సమర్పించింది. అయితే అప్పట్లో అభివృద్ధికి పెద్ద పీట వేసినా సరిపోయింది. ఎవరూ పెద్దగా ప్రశ్నించే పరిస్థితి లేదు కానీ ఈసారి దానిక్జి పూర్తిగా భిన్నమైన వాతావరణం ఉంది అని అంటున్నారు. అందుకే బడ్జెట్ విషయంలో ఏ మాత్రం ఒక వైపు మొగ్గు చూపినా రెండవ వర్గం గుస్సా అవుతుంది. అంతే కాదు కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతల మీద హాట్ డిస్కషన్ జరుగుతుంది.
విపక్ష వైసీపీ అయితే సంక్షేమం విషయంలో గట్టిగా నిలదీస్తోంది. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతోంది. సూపర్ సిక్స్ హామీలు కనుక అమలు చేయకపోతే రాజకీయంగా దానిని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని చూస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే అనుభవశాలి అయిన చంద్రబాబు నాయకత్వంలో ప్రవేశపెడుతున్న కూటమి తొలి బడ్జెట్ ఏపీకి పాల పొంగు కావాలని అన్ని వర్గాలు అన్ని రంగాలు పూర్తిగా ఆనందంతో ఉండాలని అంతా ఆకాంక్షిస్తున్నారు.