షర్మిళ ఫైర్... మోడీకి తాలింపు.. బాబుకు లాలింపు.. జగన్ కు వాయింపు!

ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి జగన్ పై విరుచుకుపడ్డారు.

Update: 2024-10-21 11:36 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి జగన్ పై విరుచుకుపడ్డారు. మోడీని జగన్ ని ఓ గాటిన కడుతూ, బాబుకు సూచనలు చేస్తూ, తాజాగా ఆన్ లైన్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు! ఈ సందర్భంగా వైఎస్సార్ ను గుర్తు చేసుకున్న షర్మిళ.. మోడీ వారసుడు జగన్ అంటూ ఫైరయ్యారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

అవును... ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, తన సోదరుడు జగన్ పై నిప్పులు చెరిగిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా దాదాపు అదే స్థాయి డోస్ తో మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం టాపిక్ ఎత్తుకున్న ఆమె... జగన్ పై ఫైరయ్యారు.

ఈ సందర్భంగా ఎక్స్ లో పోస్ట్ పెట్టిన షర్మిళ... మహానేత హయాంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ప్రతిష్ఠాత్మక పథకం, వైఎస్సార్ మానస పుత్రిక ‘ఫీజు రీయింబర్స్ మెంట్’ పథకం అని అన్నారు. ఈ సందర్భంగా... పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి.. ఎంతోమంది ఇంజినీర్లను, డాక్టర్ లను తయారు చేసిన గొప్ప పథకం అని తెలిపారు.

ఇంతటి పథకాన్ని నాడు వైఎస్సార్ అద్భుతంగా అమలు చేస్తే.. సొంత కొడుకై ఉండి కూడా జగన్ తన హయాంలో పథకాన్ని నీరు గార్చారని.. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు రూ.3,500 కోట్లు పెండింగ్ పెట్టడం సిగ్గుచేటని షర్మిళ నిప్పులు కక్కారు. అలా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని.. వారి తల్లితండ్రులను మనోవేదనకు గురి చేశారని విమర్శించారు.

ఈ సందర్భంగా దోచుకొని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ, విద్యార్థుల సంక్షేమం మీద పెట్టలేదంటూ షర్మిల సెటైర్లు వేశారు. ఇక.. వైఎస్సార్ తన జీవితం మొత్తం మత పిచ్చి బీజేపీని వ్యతిరేకించారని.. అయితే, జగన్ మాత్రం అదే బీజేపీకి దత్తపుత్రుడిగా మారారని.. మోడీ వారసుడిగా జగన్ తయారయ్యారని దుయ్యబట్టారు.

అలా.. నాడు వైసీపీ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని నీరుగార్చి నిర్వీర్యం చేయాలని చూస్తే.. నేడు కూటమి ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. ఈ విషయంలో వైసీపీ చేసింది పాపం అయితే.. కూటమి సర్కార్ విద్యార్థులకు పెడుతుంది శాపమని.. చెబుతూ.. ఈ విషయంలో చంద్రబాబును డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా... ఈ పథకం విషయంలో బకాయిలు ఎవరు పెట్టినా.. అవి రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు చంద్రబాబుపై ఉందని.. వీటికి సంబంధించిన నిధులు వెంటనే విడుదల చేయాలని.. ఈ పథకానికి ఎలాంటి ఆటంకాలూ లేకుండా చూడాలై కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నట్లు రాసుకొచ్చారు షర్మిల.

Tags:    

Similar News