ఏపీలో ఎక్కడైనా పింఛన్లు తీసుకునే వెసులుబాటు
ఇక తాజాగా రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా తీసుకునే సౌకర్యం కల్పించడంతో పింఛనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక భద్రతా పింఛన్లను రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ చేసుకునే వీలు కల్పించింది. గతంలో ఏ నెల పింఛన్ ఆ నెలలోనే తీసుకోవాలనే నిబంధన ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు నెలలకు ఒకసారి తీసుకునే అవకాశమిచ్చింది. ఇక తాజాగా రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా తీసుకునే సౌకర్యం కల్పించడంతో పింఛనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ తాజా నిర్ణయం సామాజిక పింఛన్లు తీసుకుంటున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వరంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్కడివారు అక్కడే పెన్షన్లు తీసుకోవాలనే నిబంధన ఉండటం వల్ల.. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నవారు.. ఇతర కారణాల వల్ల దూర ప్రాంతాలకు వెళ్లిన వారు ఠంచనుగా పింఛను ఇచ్చే సమయానికి రావాల్సివస్తోంది. దీంతో ఎన్నో వ్యయ ప్రయాలకు లోనవుతున్నారు.
నెలనెలా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ సమస్య వెళ్లడంతో వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పింఛను ఒక చోట నుంచి మరోచోటకి బదిలీ చేసుకునే ఆప్షన్ ఇవ్వాలని సూచించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. సీఎం ఆదేశాలతో ఈ నెల నుంచి పింఛను బదిలీ చేసుకునే ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పెన్షన్లను సులువుగా బదిలీ చేసుకునే సౌకర్యం కల్పించారు. లఅయితే తమ పింఛన్లను ఎక్కడ తీసుకోవాలని అనుకుంటున్నారో.. ఆ ప్రాంతం సచివాలయం పేరు, కోడ్, మండలం, జిల్లాలను ప్రస్తుత సచివాలయంలో అందజేయాల్సివుంటుంది.