ఏపీలో కొత్త రేషన్ కార్డులు..డిజైన్ ఇదేనా?
జగన్ హయాంలో వైసీపీ నేతలకున్న రంగుల పిచ్చి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.
జగన్ హయాంలో వైసీపీ నేతలకున్న రంగుల పిచ్చి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. కాదేదీ కవితకనర్హం అన్నరీతిలో కాదేదీ రంగులకనర్హం అంటూ కనిపించిన చెట్టూ పుట్ట మొదలు రేషన్ కార్డుల వరకు వైసీపీ రంగులు నింపేశారు. ఆఖరికి కోర్టులు స్వయంగా జోక్యం చేసుకొని ఈ రంగుల వ్యవహారంపై జగన్ సర్కార్ కు మొట్టికాయలు వేసినా వినలేదు. ఇక, పట్టాదారు పాసుపుస్తకాలపై భారత రాజముద్రతోపాటు జగన్ బొమ్మ వేసుకోవడం ఆ రంగుల, జగన్ బొమ్మల పిచ్చకు పరాకాష్ట అని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా జగన్ రంగుల పిచ్చి తగ్గించడానికి చంద్రబాబు సర్కార్ చర్యలు మొదలుబెట్టింది. ఆ కార్యక్రమానికి రేషన్ కార్డులపై వైసీపీ రంగులు, జగన్ బొమ్మ తొలగించడంతో శ్రీకారం చుట్టనుంది.
గత ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులపై రంగులను, జగన్ బొమ్మను తొలగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వడానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అడుగులు వేస్తోంది. లేత పసుపు రంగులో కార్డుపై రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నాన్ని ముద్రించిన డిజైన్ దాదాపుగా ఫైనల్ అయ్యే చాన్స్ ఉంది. ఆ రంగుతోపాటు మరికొన్ని నమూనాలను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు, కొత్త రేషన్ కార్డుల జారీ, రేషన్ కార్డులలో పేర్ల తొలగింపు, జోడింపు, మార్పులు చేర్పులపై కూడా అధికారులు కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది. నిన్న కేబినెట్ భేటీ ఎజెండాలో ఇది కూడా ఒక అంశమని, రతన్ టాటా పార్థివ దేహాన్ని సందర్శించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ముంబై వెళ్లడంతో ఆ ఎజెండా వాయిదా పడిందని తెలుస్తోంది.
మరోవైపు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుండడం, దసరా పండుగ నేపథ్యంలో ప్రజలకు భారీ ఉపశమనం కలిగేలా ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే ధరపై వంట నూనెలు విక్రయించాలని వ్యాపారులకు మంత్రి మనోహర్ సూచించారు. అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 31 వరకూ పామోలిన్ లీటర్ రూ110లు, సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124 చొప్పున విక్రయించనున్నామని మనోహర్ తెలిపారు. ఒక్కో రేషన్ కార్డుపై మూడు లీటర్ల పామోలిన్, ఒక లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ ను నిర్ణయించిన ధరలపై అందించనున్నామన్నారు. రేషన్ కార్డుదారులకు ఏపీ సర్కార్ దసరా మామూలు కింద నూనె తక్కువ ధరకే అందిస్తోందని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.