ఉచిత గ్యాస్ కి గట్టిగానే కండిషన్లు!?

అందుకే ఈ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పధకాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తూనే దానిని అందుకోవాలంటే ఉండాల్సిన అర్హతలు ఇవీ అని కండిషన్లు పెడుతోంది.

Update: 2024-10-11 06:30 GMT

ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్లను ఏడాదికి మూడేసి ఇవ్వడానికి నిర్ణయించింది. అయితే దానికి గట్టిగానే కండిషన్లు పెడుతోంది. ఎందుకంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటే ఒక్కోటి 800 ఉంది. మూడు కింద లెక్క కడితే ఏడాదికి ఉచితంగా 2400 రూపాయలు ఆ కుటుంబానికి అందినట్లే.

మరి ఈ విధంగా చూస్తే సరైన అర్హతలు కండిషన్లు పెట్టకపోతే ఏపీలో కోటీ ముప్పయి లక్షల మంది ఉన్న తెలుపు రేషన్ కార్డు దారులందరికీ ఇవ్వడం సాధ్యం కాదని అంటున్నారు. వీరందరికీ ఇస్తే ఆర్ధిక భారం తడిసి మోపెడు అయ్యేలా ఉందని అంటున్నారు.

అందుకే ఈ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పధకాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తూనే దానిని అందుకోవాలంటే ఉండాల్సిన అర్హతలు ఇవీ అని కండిషన్లు పెడుతోంది. కచ్చితంగా తెలుపు కార్డు దారులు అయి ఉండాలి. వారు ఏపీలోనే నివసిస్తూ ఉండాలి. వారు అల్పాదాయ వర్గాలకు చెందిన వారు అయి ఉండాలి. ఆ ఇంటిలో ఒక్కటే గ్యాస్ కనెక్షన్ ఉండాలి. అది కూడా వంట గ్యాస్ కనెక్షన్ అయి ఉండి తీరాలి. కమర్షియల్ గ్యాస్ కనెక్షన్ అయితే వారు అనర్హులు అవుతారు.

ఇలా అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలోనే ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆన్ లైన్ లో దరఖాస్తు తో పాటు లబ్దిదారులు తమ మొబైల్ నంబర్ ని ఇవ్వాలి. అలాగే విద్యుత్ బిల్లులను కూడా అందులో పొందు పరచాలి. ఇక ఆధార్ కార్డు నంబర్, రేషన్ కార్డు నంబర్ తో పాటు అడ్రస్ ప్రూవ్ కూడా ఇవ్వాలి.

ఆ మీదట వారిలో అర్హులను వడపోత పోసి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారు అని అంటున్నారు. ఆధార్ కార్డు ఇవ్వడం వల్ల వారి ఆదాయాలు తెలుస్తాయని అంటున్నారు. అలాగే విద్యుత్ బిల్లులను కూడా చూస్తారని, దాని వల్ల వాడకం ఎక్కువగా ఉంటే వారు పేదల జాబితాలోకి రారు అని అంటున్నారు

ఈ రకంగా ముందు గ్యాస్ సిలిండర్ల విషయంలో దరకాస్తులు తీసుకుని పూర్తి వివరాలు తెల్ల రేషన్ కార్డు దారుల నుంచి సేకరించే పనిలో ప్రభుత్వం ఉంది. ఈ వివరాలు రేపటి రోజుల తెల్లకార్డు దారుల అర్హతను కూడా నిర్ణయిస్తాయని అంటున్నారు.

అంటే ఉచిత పధకాలకు అయినా మరేదానికి అయినా ప్రమాణికంగా తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. దాంతో వాటిలో ఎన్నో అనర్హత కలిగినవి ఉన్నాయని గత వైసీపీ ప్రభుత్వం చాలా మందికి ఇచ్చేసిందని ఆరోపణలు ఉన్నాయి. దాంతో వాటిని వడపోత పోసి బాగా తగ్గించాలని చూస్తున్నారు. ఉదాహరణకు కోటీ ముప్పయి లక్షల తెల్ల రేషన్ కార్డులలో కనీసంగా యాభై వేల దాకా అనర్హుల జాబితాయే ఉంటుందని లెక్క వేస్తున్నారు.

వాటిని తీసేస్తే ఎనభై వేల మంది మాత్రమే మిగులుతారు. అపుడు వారికే ఉచిత గ్యాస్ సిలిండర్ అయినా తల్లికి వందనం పధకం అయినా మరోటి అయినా ఇస్తారు అని అంటున్నారు. మొత్తానికి ఉచిత గ్యాస్ సిలిండర్ల దర్కాస్తు ప్రక్రియతోనే మొత్తం తెల్ల రేషన్ కార్డు దారుల డేటా అంతా వారి నుంచే సేకరించే పనిలో ప్రభుత్వం ఉందని అంటున్నారు. సో మూడు గ్యాస్ సిలిండర్లు కాదు కానీ తెల్ల కార్డులకే మంగళం పాడతాయా అన్న కొత్త చర్చకు తెర లేస్తోంది.

Tags:    

Similar News