ఏపీ మద్యం పాలసీ.. కొత్త విధివిధానాలు ఇవే!!

ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకురావడంపై దృష్టి సారించింది.

Update: 2024-09-18 07:05 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి దారితీసిన కారణాల్లో మద్యపానం కూడా ఒకటనేది విశ్లేషకుల మాట. ఎన్నికల ముందు ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని, మంచి బ్రాండ్లను ప్రవేశపెడతామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకురావడంపై దృష్టి సారించింది. నూతన మద్యం పాలసీ కోసం మంత్రులు.. కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్‌ యాదవ్, గొట్టిపాటి రవికుమార్‌ లతో కేబినెట్‌ సబ్‌ కమిటీని సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ కమిటీ సచివాలయంలో సమావేశమై పలు ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ప్రతిపాదనలతో మంత్రులు సీఎం చంద్రబాబును కలిశారు. ఆయన మరికొన్ని మార్పులుచేర్పులు సూచించారు. వీటిని కూడా ప్రతిపాదనల్లో చేర్చి తాజాగా జరగబోయే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకుంటారని చెబుతున్నారు.

కాగా గత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు చేపట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మద్యం విక్రయాలను ప్రైవేటు వ్యక్తులను అప్పగించనుంది. తద్వారా మద్యం విక్రయాల నుంచి ప్రభుత్వం తప్పుకోనుంది. మద్యం రిటైల్‌ వ్యాపారం మొత్తాన్ని ప్రైవేటుకే అప్పగించనున్నారు.

త్వరలో తీసుకురాబోయే కొత్త మద్యం విధానంలో భాగంగా 3,396 దుకాణాల్ని నోటిఫై చేయనున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పది శాతం అంటే.. 396 దుకాణాలను గీత కార్మికులకు కేటాయించనున్నారు. దరఖాస్తులు సేకరించి వారికి కేటాయించనున్నారు.

ఈ 396 దుకాణాలు 3,396 దుకాణాలకు అదనంగా ఉంటాయి. 396 దుకాణాలను ఎవరైనా దక్కించుకోవచ్చు. దేశంలో ఎవరైనా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం వచ్చిన దరఖాస్తుల్లో లాటరీ ఆధారంగా మద్యం దుకాణాలను కేటాయిస్తారు.

మొత్తం మీద అక్టోబర్‌ 4, 5 తేదీల నాటికి ఆంధ్రప్రదేశ్‌ లో కొత్త మద్యం విధానం వస్తుందని తెలుస్తోంది. మద్యం రిటైల్‌ దుకాణాలను ప్రైవేటుకే ఇవ్వాలని నిర్ణయించడంతో ఈ మేరకు చట్ట సవరణ చేయాల్సి ఉంటుందంటున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేకపోవడంతో ఆర్డినెన్స్‌ జారీ చేసి గవర్నర్‌ ఆమోద ముద్ర తీసుకుంటారని సమాచారం.

ఆర్డినెన్సు జారీ, గవర్నర్‌ సంతకం ఇలా ఈ ప్రక్రియంతా పూర్తయ్యేందుకు కనీసం 3, 4 రోజులు సమయం పడుతుందని అంటున్నారు. సెప్టెంబరు 22, 23 తేదీల్లో నూతన మద్యం విధానాన్ని ఖరారు చేస్తూ ఉత్తర్వులు వెలువడతాయని అంటున్నారు.

ఆ తర్వాత మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో మద్యం విక్రయాలను అనుమతులు మంజూరు చేస్తారు.

కాగా గత ప్రభుత్వంతో పోలిస్తే సరసమైన ధరలకే నాణ్యమైన మద్యం అందిస్తారని తెలుస్తోంది. అలాగే కూలీలు, పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాల వారికోసం తక్కువ ధరతో ఒక ప్రత్యేక బ్రాండ్‌ ను కూడా అందిస్తారని టాక్‌ నడుస్తోంది.

Tags:    

Similar News