లిక్కర్ ప్రకంపనలు...ఏపీలో రాజకీయ భూకంపం
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నెలల తరబడి జైలులో ఉన్నారు.;

లిక్కర్ స్కామ్ ఏపీని కట్టి కుదపనుందా అంటే జవాబు అవును అనే వస్తోంది. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ రాజకీయంగా ఎంతలా సంచనలం రేపిందో అందరికీ తెలిసిందే. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నెలల తరబడి జైలులో ఉన్నారు. చివరికి ఆయన మాజీ సీఎం అయిపోయారు.
ఇపుడు చూస్తే ఏపీలో కూడా లిక్కర్ స్కామ్ ప్రకంపనలు కనిపిస్తున్నారు. ఆ మేరకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. మొన్నటికి మొన్న టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్ లో ఇదే అంశం ప్రస్తావించారు. ఏపీలో లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువని ఆయన అన్నారు.
అంతే కాదు లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ కి కూడా పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఇక లిక్కర్ స్కామ్ విషయంలో పరిణామాలు చకచకా సాగుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను టీడీపీకి చెందిన ఎంపీలు కలవడం జరిగింది. ఈ కేసులో ఈడీ ద్వారా విచారణకు ఆదేశించాలని కూడా కోరారని చెబుతున్నారు.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉండవల్లిలోని ఆయన నివాసంలో బుధవారం ఎంపీ లావు కలసి ఇదే విషయం చర్చించారు అని అంటున్నారు. ఏపీలో 18 వేల కోట్లకు పై చిలుకు లిక్కర్ స్కామ్ జరిగింది అని అంటున్నారు. ఇందులో నాలుగు వేల కోట్ల రూపాయలు విదేశాలకు నగదు రూపంలో తరలివెళ్లి చేతులు మారిందని ఆరోపిస్తున్నారు.
అంతే కాదు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 నుంచి 2024 మధ్యలో లిక్కర్ షాపులను ప్రభుత్వమే నిర్వహించింది. నాసి రకం బ్రాండ్లతో మద్యం అమ్మకాలు సాగాయని అంటున్నారు. అదే విధంగా డిస్టిలరీ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు వైసీపీ పెద్దలు స్వీకరించారు అన్నది మరో ఆరోపణగా ఉంది.
ఇక ఈ విషయంలో కేంద్రం వద్ద ఉన్న సీబీఐ లేదా ఈడీ దర్యాప్తును కోరుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దర్యాప్తు సంస్థను వేసి మరీ లిక్కర్ స్కామ్ విషయంలో నిగ్గు తేల్చాలని చూస్తున్నారు. ఇక చూడబోతే ఈ వ్యవహారం మొత్తం జగన్ వైపుగా వస్తోంది అని అంటున్నారు.
దీని మీద మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ జగన్ ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ విషయంలో నాడు వైసీపీలోని పెద్దలు వారి సన్నిహితులు ఉన్నారని దీని మీద లోతైన దర్యాప్తు అవసరం అని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
మొత్తం మీద చూస్తే కనుక మరి కొద్ది రోజులలో ఏపీలో రాజకీయ భూకంపం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వైసీపీ బిగ్ షాట్స్ ని టార్గెట్ గా చేసుకుని లిక్కర్ స్కామ్ లో పావులు కదుపుతారని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాలు ఇపుడు ఏపీలో రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి.
ఏపీలో ఇప్పటిదాకా అరెస్టు అయిన వారు అంతా ఒక ఎత్తు అయితే ఏకంగా కుంభస్థలాన్ని బద్ధలు కొట్టేలా అగ్ర నేతలనే అరెస్ట్ చేయాలన్నది ఆలోచనగా ఉందని అంటున్నారు. మరి సీబీఐ కానీ ఈడీ కానీ ఈ విషయంలో రంగంలోకి దిగుతుందా అన్నది చర్చగా ఉంది. అదే కనుక జరిగితే ఏపీలో రాజకీయం పీక్స్ కి చేరుకుంటుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.