నాగబాబుకు లైన్ క్లియర్.. వర్మకూ చాన్స్..? ఇంకో 3 స్థానాలపై సస్పెన్స్!

ఏపీలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలపై ఉత్కంఠ కొనసాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.;

Update: 2025-03-05 10:36 GMT

ఏపీలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలపై ఉత్కంఠ కొనసాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మొత్తం ఐదు ఖాళీలకు జనసేన నుంచి ఒకరికి చాన్స్ దక్కుతోంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుకు ఎమ్మెల్సీగా ఖరారు చేస్తూ అధిష్టానం ప్రకటన చేసింది. ఇక మిగిలిన నాలుగు స్థానాలకు ఎవరిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ ను త్యాగం చేసిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ భవితవ్యంపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఆయనకు ఈ సారి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారా? లేదా? అన్నదే సస్పెన్సుగా మారింది.

కూటమిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు తీవ్ర పోటీ కనిపిస్తోంది. రిటైర్ అవుతున్న ఎమ్మెల్సీలు మళ్లీ అవకాశమివ్వాలని కోరుతుండటంతోపాటు గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న త్యాగరాజులు కూడా ఎమ్మెల్సీ చాన్స్ అడుగుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ వర్మ, మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమాలకు అవకాశం వస్తుందా? లేదా? అనేది రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మ పేరు దాదాపు ఖాయమేనని ప్రచారం జరుగుతున్నా, అందులో ఎంత వాస్తవం అనేదే ఉత్కంఠ రేపుతోంది.

మొత్తం ఐదు ఖాళీల్లో ఒకటి జనసేనకు ఖరారైంది. మిగిలిన నాలుగింట్లో వర్మను ఒకటి కేటాయిస్తే మిగిలిన మూడు ఎవరికి అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. నాగబాబు, వర్మ ఇద్దరూ అగ్రవర్ణాలకే చెందిన వారు కావడంతో మిగిలిన మూడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు ఆశిస్తున్నారు. దీంతో మాజీ మంత్రి ఉమాకు చాన్స్ కష్టమే అన్న వాదన వినిపిస్తోంది. ఉమ్మడి క్రిష్ణా జిల్లా నుంచి ఉమా స్థానంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన బుద్దా వెంకన్న పేరు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో మైనార్టీ నేతలు కేఎం సైఫుల్లా, మహ్మద్ నజీర్ పేర్లు తెరపైకి వచ్చాయి.

ఇక తాజాగా రిటైర్ అవుతున్న ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, పర్చూరి అశోక్ బాబు సైతం మరో చాన్స్ కోరుతున్నారని చెబుతున్నారు. ఈ ముగ్గురు కాకుండా బీసీ కోటాలో బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ ఏరాసు ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి తదితరులు తమ పేర్లు పరిశీలించాలని ఒత్తిడి చేస్తున్నారు. అయితే బీద రవిచంద్ర సోదరుడు మస్తాన్ రావుకు రాజ్యసభ అవకాశం ఇవ్వడంతో ఆయనకు చాన్స్ కష్టమేనంటున్నారు. ఇక నాగబాబు, వర్మ ఒకేజిల్లా వారు కావడంతో రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా ఆశలు వదులుకోవాల్సివస్తుందని అంటున్నారు. అదేసమయంలో అగ్రవర్ణాలకు ఇప్పటికే కేటాయించడంతో లింగారెడ్డి, ప్రతాపరెడ్డి, కొమ్మాలపాటి కూడా వెనక్కి తగ్గాలని అంటున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ కేటగిరిల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.

Tags:    

Similar News