పీఏసీ చైర్మన్ పోస్ట్ కూటమి ఎవరికి ఇస్తుంది ?

తెలంగాణలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పొస్టు ఎంత రచ్చ సృష్టిస్తోందో అంతా చూస్తున్నారు.

Update: 2024-09-13 04:11 GMT

తెలంగాణలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పొస్టు ఎంత రచ్చ సృష్టిస్తోందో అంతా చూస్తున్నారు. ఆ పదవిని బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ వైపు మళ్ళిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. నిజానికి ఈ పదవి ప్రతిపక్షాలకు ఇస్తారు. అదే ఆనవాయితీ కూడా. ఆ విధంగా చూస్తే బీఆర్ఎస్ కే దక్కాలి.

కానీ గాంధీకి ఈ పదవి ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ భగ్గుమంటోంది. దాని మీదనే ఇపుడు గాంధీ బీఆర్ఎస్ ల మధ్య అతి పెద్ద రాజకీయ రగడ సాగుతోంది. బీఆర్ఎస్ తెలంగాణా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో ఉంది. అలాంటి పార్టీకే పీఏసీ పోస్టుని కాంగ్రెస్ ఇవ్వకుండా టెక్నికల్ గా ఆ పార్టీ ఎమ్మెల్యే అన్న కారణం చూపిస్తూ గాంధీని సెలెక్ట్ చేసింది.

మరి ఏపీలో చూస్తే వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ 17 మంది ఉండాలి. ఆరు మంది ఎమ్మెల్యేలు ఆ విధంగా తగ్గారు. ఇక జగన్ జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే అని టీడీపీ కూటమి నేతలు ర్యాగింగ్ మామూలుగా చేయడం లేదు.

మరో వైపు బీఏసీలో కూడా వైసీపీకి మెంబర్ షిప్ ఇచ్చారో లేదో తెలియదు. ఆ సంగతి అలా ఉంచితే కేబినెట్ ర్యాంక్ పోస్ట్ అయిన పీఏసీ చైర్మన్ పదవిని విపక్షానికే ఇస్తారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయితే అధికారికంగా ప్రతిపక్షాన్ని గుర్తించలేదు. దాంతో ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ పక్షం లేదా వ్యతిరేక పక్షం అన్న డివిజన్ ఉంది తప్ప ప్రతిపక్షం అనేది అధికారికంగా లేదు.

ఈ నేపథ్యంలో ప్రతిపక్షానికి దక్కాల్సిన ప్రివిలేజేస్ అన్నీ కూడా పోతున్నాయి. వైసీపీకి పీఏసీ పోస్ట్ కూడా ఇవ్వరు అని ముందే అనుకున్నారు. ఇపుడు తెలంగాణాలో బీఆర్ఎస్ కి తగిలిన షాక్ తో అది మరింతగా రూఢీ అవుతోంది. వైసీపీ కూడా ఆ పదవి మీద పట్టు పట్టే చాన్స్ ఏ మాత్రం లేదు.

ఇక కూటమి ప్రభుత్వంలో టీడీపీతో పాటు జనసేన బీజేపీ ఉన్నాయి. ఈ మూడు పార్టీల నుంచి మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి వారు ప్రభుత్వ పక్షమే అవుతారు. కానీ పీఏసీ చైర్మన్ పోస్ట్ ఇవ్వాలనుకుంటే జనసేనకు లేదా బీజేపీకి ఇవ్వవచ్చు. వారి నుంచే ఒకరికి ఆ పదవి ఇవ్వడం ద్వారా నామినేటెడ్ పోస్టులలో పోటీని తగ్గించుకోవచ్చు.

మరో కేబినెట్ పోస్టుని ఇచ్చామని చూపించుకోవచ్చు. కానీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే వివిధ రంగాలకు ప్రభుత్వం పెట్టే ఖర్చుని చూసి రివ్యూ చేసేది. బాధ్యతతో కూడుకున్నది. ప్రభుత్వంలో ఉన్న వారికి ఆ పదవి ఇస్తే అంతా బాగానే ఉంది అని అంటారు కాబట్టి విపక్షానికి ఇస్తారు. అందులో అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలను మెంబర్స్ గా చేరుస్తారు. ఈ కమిటీ రాష్ట్రమంతా తిరుగుతుంది.

వివిధ విభాగాలలో సమీక్ష చేస్తుంది. ప్రభుత్వం రిలీజ్ చేసిన నిధులు ఖర్చు అయినవి అన్నీ కూడా మధింపు చేస్తుంది. అలా ప్రభుత్వానికి చెక్ అండ్ బాలెన్స్ గా ఉండేందుకు ఈ పదవిని ఏర్పాటు చేశారు. అందువల్ల ప్రతిపక్షానికే ఈ పదవి ఇస్తేనే వన్నె చేకూరుతుంది అని అంటారు.

కానీ రాజకీయాలు శృతి మించాక ఇలాంటి ఆనవాయితీలను పక్కన పెట్టేస్తున్నారు. నిజానికి అసెంబ్లీ స్పీకర్ పోస్ట్ ప్రతిపక్షానికి ఇవ్వాలి. కనీసం డిప్యూటీ స్పీకర్ పదవిని అయినా ఇవ్వాలి. కానీ ఆ విధానం మార్చేసి చాలా కాలం అయింది. రెండు పదవులూ అధికార పక్షమే తీసుకుంటోంది.

ఇపుడు తెలుగు నాట పీఏసీ పదవులకు కూడా పాత విధానంలో స్వస్తి పలికి కొత్త విధానం తెస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. రాజకీయాలకు అతీతంగా ఆలోచించగలిగేలా అన్ని పార్టీలు ఉన్నపుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది అని మేధావులు అంటూంటారు. మరి తెలుగు రాజకీయాలే కాదు దేశంలోనూ అలా ఎక్కడా కనిపించడం లేదు. దాంతో జరిగినంతవరకే సంప్రదాయాలూ పద్ధతులూ అని సరిపుచ్చు కోవాల్సి వస్తోంది.

Tags:    

Similar News