సభ్యులు దొంగల్లా మారారు: ఏపీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు
గురువారం అసెంబ్లీ ప్రారంభం కాగానే స్పీకర్.. స్పందించారు.;
ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ``కొందరు ప్రజా ప్రతినిధులు దొంగల్లా మారారు. గుట్టు చప్పుడు కాకుండా.. ఎవరికీ కనిపించకుండా అసెంబ్లీ సెక్రటేరియె ట్‌కు వచ్చి అటెండెన్స్‌లో సంతకాలు చేస్తున్నారు. ఆ తర్వాత.. సభకు రాకుండా సొంత వ్యవహారాలు చూసుకుంటున్నారు.`` అని వ్యాఖ్యానించారు. గురువారం అసెంబ్లీ ప్రారంభం కాగానే స్పీకర్.. స్పందించారు.
సభలో సభ్యులు పలచగా ఉండడంతో విస్మయం వ్యక్తం చేశారు. ఆ వెంటనే అసెంబ్లీ సెక్రటేరియెట్ అదికారులను ఆయన రిజిస్టర్ తీసుకురావాలని ఆదేశించారు. దీంతో బుధవారం నాటి అటెండెన్సు రిజిస్టర్‌ను అధికారులు స్పీకర్ అయ్యన్న ముందు పెట్టారు. దీనిని చూసిన ఆయన.. అటెండెన్సు 80 శాతం ఉందని.. కానీ సభ్యులు మాత్రం 50 శాతానికి మించి సభలో లేరని అన్నారు. దీనిని చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నట్టు చెప్పారు.
సభకు వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోవడం కాదన్న అయ్యన్న.. ప్రజలు ఎన్నుకున్న సభ్యులు సభకు వచ్చి ప్రజల సమస్యలపై స్పందించాలని, చర్చల్లో పాల్గొనాలని సూచించారు. ఇకపై ఇలాంటి ఘటనలు ఎదురైతే.. తీవ్రంగా స్పందించాల్సి ఉంఉందన్నారు. కాగా.. ఈ వ్యాఖ్యలు.. వైసీపీ సభ్యులను ఉద్దేశించి స్పీకర్ చేశారంటూ.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. అసెంబ్లీ సెక్రటేరియెట్ వెంటనే దీనిపై వివరణ ఇచ్చింది.
వైసీపీకి చెందిన 11 మంది సభ్యుల గురించే కాదని.. మొత్తం సభ గురించి స్పీకర్ వ్యాఖ్యానించారని తెలిపింది. సభ్యుల హాజరు శాతం.. అటెండెన్సు శాతానికి సంబంధం లేకపోవడంతోనే స్పీకర్ ఇలా స్పందించారని సెక్రటేరియెట్ వ్యాఖ్యానించింది. ఇదిలావుంటే.. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడం లేదన్న విషయం తెలిసిందే. అయితే.. వారు సభకు రావాలని ఉన్నా.. వైసీపీ కార్యాలయం నుంచి అధినేత ఆదేశాల పేరుతో నోట్లు వెళ్తున్నాయని తెలిసింది.