కూటమిలో ఫ్యామిలీ పాక్...బాబూ ఎందుకిలా ?
ఇక చంద్రబాబు విషయమే తీసుకుంటే ఆయన యమా స్ట్రిక్ట్ గా రాజకీయాల్లో ముద్ర పడ్డారు.
టీడీపీ కూటమిలో ఫ్యామిలీ పాక్ అమలు అవుతోంది అన్న విమర్శలు ఉన్నాయి. కొందరు కీలక నేతల కుటుంబాలకు కావాల్సినన్ని పదవులు ఇస్తూ పోతున్నారు అని అంటున్నారు. ఏ పార్టీకైనా కష్టపడిన నాయకులు ఉంటారు. వారిని తెచ్చి సమాదరిస్తేనే పార్టీ మరింతగా పుంజుకునేది. అంతే తప్ప అధికారం దక్కింది కదా అని తమకు చిత్తం వచ్చినట్లుగా పదవులు ఇచ్చేసుకుంటూ పోతే జనాల మనోభావాలతో పాటు పార్టీ క్యాడర్ ఆలోచనలు కూడా ఏ విధంగా ఉంటాయో ఆలోచించుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.
ఇక చంద్రబాబు విషయమే తీసుకుంటే ఆయన యమా స్ట్రిక్ట్ గా రాజకీయాల్లో ముద్ర పడ్డారు. తన సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడు ని సైతం ఆయన కోరి అయితే తీసుకుని రాలేదు. ఎందుకంటే ఇంట్లో వారిని తెస్తే బంధుప్రీతి అంటారని ఆలోచించారు. ఉమ్మడి ఏపీకి 45 ఏళ్ల వయసులో సీఎం అయిన చంద్రబాబు 2004 వరకూ ఇదే విధంగా వ్యవహరించారు.
అధికారానికి తన వారిని ఆమడదూరంలో ఉంచారు. ఇక 2014లో టీడీపీ గెలిచినా మూడేళ్ళ పాటు లోకేష్ కి మంత్రి పదవి దక్కలేదు. ఇక 2017లోనే ఆయనకు మంత్రి హోదా ఇచ్చారు. ఇక 2024లో చూస్తే నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేసి పార్టీకి తన వంతుగా ప్రాణం పోశారని భావించి మంత్రి పదవిని ఇచ్చారు.
ఇక బాబుతో పాటు లోకేష్ బెర్త్ దక్కించుకున్నారు. వియ్యంకుడు అయిన బాలకృష్ణ మాత్రం జస్ట్ ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. కానీ బాలయ్య చిన్నల్లుడికి విశాఖ ఎంపీ సీటు దక్కింది. ఇక ఫ్యామిలీ ప్యాక్ లో చూస్తే ఇపుడు జనసేన వంతు వచ్చిందా అన్న చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు బాబు. ఇపుడు ఆయన సోదరుడు నాగబాబుని ఎమ్మెల్సీ చేసి మరీ మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నారు.
దీంతో జగన్ ని ఆయన రాజకీయాన్ని విమర్శిచిన చంద్రాబు పవన్ చేస్తున్నది ఏమిటి అన్న చర్చ సాగుతోంది. కుటుంబ రాజకీయాలు చేయకూడదని చెబుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఇపుడు తన సోదరుడికి మంత్రి పదవి ఇప్పించుకుంటున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజారాజ్యం మీద నాడు కుటుంబ పార్టీ అన్న ముద్ర ఉండేది.
ఇపుడు జనసేనలోనూ అంతేనా అన్న చర్చ అయితే సాగుతోంది. అన్నా తమ్ముడూ ఒకే మంత్రివర్గంలో పనిచేయడం ఖాయమైన వేళ బంధు ప్రీతి ఆశ్రిత పక్ష పాతం అంటూ చెప్పే కబుర్లు చేసే విమర్శలకు కాలం చెల్లిందా అన్న చర్చ ఉంది.
కేవలం ఇవే కాదు కింజరాపు కుటుంబానికి మంత్రి పదవులు బాబు కట్టబెట్టారు. అబ్బాయి రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి దక్కితే బాబాయ్ అచ్చెన్నాయుడుకు రాష్ట్ర మంత్రి పదవి దక్కింది. అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు అని గుర్తు చేస్తున్నారు.
యనమల రామక్రిష్ణుడు ఇంట్లో చూస్తే నాలుగు పదవులు ఉన్నాయి. ఆయనకు ఎమ్మెల్సీ కుమార్తెకు ఎమ్మెల్యే పదవి, వియ్యంకుడికి ఎమ్మెల్యే పదవి, అల్లుడికి ఎంపీ పదవిని ఇచ్చారు. జగన్ నాడు పార్టీలో చాలా మంది కుటుంబాలకు పదవులు ఇచ్చారని ఆడిపోసుకున్న టీడీపీ జనసేన నేతలు ఇపుడు తాము కూడా అదే దారిలో వెళ్తే ఎలా అన్న చర్చ సాగుతోంది.
రాజ్యసభ పదవుల విషయంలో జనసేనకు సీటు దక్కలేదు. ఈ కారణంతో నాగబాబుకు మంత్రి పదవిని ఆఫర్ చేశారు అన్న మాట ఉంది. మొత్తానికి పదవులు ఉన్నది ఎందుకు అంటే ఫ్యామిలీ ప్యాక్ కోసమే అన్న జవాబేనా రాజకీయ పార్టీల అధినేతలు ఇస్తోంది అని అంటున్నారు. ఇదే వైఖరితో ఉంటే జనాలు కూడా అన్నీ గమనిస్తారు అన్నది గుర్తుంచుకోవాలని అంటున్నారు.