నేడే ఏపీ కేబినెట్‌ భేటీ.. సంచలన నిర్ణయాలకు చాన్స్‌!

స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేశాక ఏపీ రాజకీయాలు అనూహ్యంగా మారిపోయిన సంగతి తెలిసిందే

Update: 2023-09-20 05:51 GMT

స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేశాక ఏపీ రాజకీయాలు అనూహ్యంగా మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ పొత్తును ప్రకటించి ఏపీ రాజకీయాలను కీలక మలుపుతిప్పారు. మరోవైపు తమతో కలసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకుపోతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వెల్లడించారు.

ఈ హీట్‌ కొనసాగుతుండగా సెప్టెంబర్‌ 21 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు హాజరు కావాలని ప్రతిపక్ష తెలుగుదేశం నిర్ణయించింది. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా సమావేశాలు జరిగే వీలుందని అంటున్నారు. ముఖ్యంగా సీఎం వైఎస్‌ జగన్‌.. చంద్రబాబు అవినీతిని ఈ సమావేశాల్లో వివరిస్తారని చెబుతున్నారు. ఆయనను కక్షతో అరెస్టు చేయలేదని.. అవినీతి జరిగిందని సాక్ష్యాధారాలతో నిరూపిస్తారని పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 20న ఏపీ కేబినెట్‌ భేటీ కానుంది. ఇందులో కీలక నిర్ణయాలకు ఆస్కారం ఉంటుందని పేర్కొంటున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడు నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. ఇప్పటికే చంద్రబాబును అరెస్టు చేయగా, ఆయన తనయుడు లోకేశ్‌ ను ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో అరెస్టు చేస్తారని చెబుతున్నారు. గత రెండు మూడు రోజులుగా దీనిపై తీవ్ర స్థాయిలో వార్తలు వచ్చాయి.

అలాగే వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఒకటి రెండు కొత్త పథకాలను కూడా సీఎం జగన్‌ ప్రవేశపెట్టవచ్చని టాక్‌ నడుస్తోంది. దీంతో ఏపీ కేబినెట్‌ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అందులోనూ టీడీపీ -జనసేన కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో సీఎం జగన్‌ కూడా పార్టీ పరంగా, పాలనా పరంగా మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. అందుకు తాజా కేబినెట్‌ సమావేశం ఆస్కారమివ్వనుందని అంటున్నారు.

మరోవైపు కేంద్రం.. మహిళా రిజర్వేషన్‌ బిల్లు, జమిలి ఎన్నికలు, దేశం పేరు మార్పు తదితర అంశాలపై బిల్లులు ప్రవేశపెట్టనుందని చర్చ జరుగుతోంది. ఇప్పటికే మహిళా రిజర్వేషన్‌ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో వీటిపై తాజా కేబినెట్‌ భేటీలో జగన్‌ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం చర్చించనుందని సమాచారం.

అలాగే ఎన్నికలు దగ్గరకొచ్చిన నేపథ్యంలో మంత్రులు మరింత దూకుడుగా వ్యవహరించాలని జగన్‌ దిశానిర్దేశం చేస్తారని అంటున్నారు. పాలనా పరంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని ఉద్భోధ చేయనున్నారని చెబుతున్నారు. దీంతో ఏపీ కేబినెట్‌ భేటీపై ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News