ఏపీ కాంగ్రెస్ పక్షాళన కమిటీలు రద్దు.. కానీ, షర్మిలే ముప్పంటున్న నేతలు!
పార్టీని ప్రక్షాళన చేయడం కాదు.. నాయకత్వాన్ని ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నారు. సీనియర్ నాయకురాలు సుంకర పద్మశ్రీ, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌వంటివారి అభిప్రాయం ఇదే.
ఏపీలో కనీసం గౌరవప్రదమైన ఓటు బ్యాంకును సొంతం చేసుకుంటామని.. ఏడాది ఫిబ్రవరిలో చెప్పుకొన్న కాంగ్రెస్ పార్టీ.. అప్పట్లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ.. వైఎస్ షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించింది. ఏపీసీసీ చీఫ్‌గా ఆమెను నియమించింది. ఇక, ఆమె రావడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు కొత్త కమిటీ లను ఏర్పాటు చేసుకున్నారు. యువ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఇంకేముంది.. అసెంబ్లీ 10 - 15 మంది.. పార్లమెంటులో 2 - ముగ్గురు గెలుస్తామని చెప్పుకొచ్చారు.
కానీ, విఫలమయ్యారు. గౌరవ ప్రదమైన ఓటు బ్యాంకును కూడా తెచ్చుకోలేక పోయారు. అయితే.. దీనికి తగిన కారణాలు వెతకాల్సిన పార్టీ అధిష్టానం.. ఇప్పుడు మరోసారి కమిటీలను గుండుగుత్తగా రద్దు చేస్తూ.. నిర్ణయం ప్రకటించింది. దీనికి ప్రక్షాళన అని పేరు పెట్టింది. సరే.. ఈ విషయంలో ఆ పార్టీ నిర్ణయం అదే కావొచ్చు. కానీ.. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నేతల వేదన మరోలా ఉంది. పార్టీని ప్రక్షాళన చేయడం కాదు.. నాయకత్వాన్ని ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నారు. సీనియర్ నాయకురాలు సుంకర పద్మశ్రీ, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌వంటివారి అభిప్రాయం ఇదే.
ఏం కోరుతున్నారు?
+ షర్మిల నాయకత్వాన్ని మెజారిటీ నాయకులు అంగీకరించలేదు. ఇది నిజం. ఎన్నికల ఫలితాల తర్వాత.. సుంకర పద్మశ్రీ బయటకు వచ్చి.. మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. షర్మిలపై నిప్పులు చెరిగారు.
+ అనంతపురంలోనూ కీలక రెడ్డి నాయకులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. షర్మిలతో తాము బద్నాం అయ్యామని చెప్పారు.
+ మాట్లాడే స్వేచ్ఛ ఉన్న కాంగ్రెస్‌లో షర్మిల వచ్చిన తర్వాత.. మాట్లాడేందుకు అనుమతి తీసుకునే దౌర్భాగ్యం ఏర్పడిందని.. కర్నూలుకు చెందిన సీనియర్ నేతల కుటుంబం వాపోయింది.
+ కనీసం సలహాలు.. సూచనలు చేసేందుకు కూడా షర్మిల అంగీకరించలేదని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నాయకులు వాపోతున్నారు.
+ వ్యక్తిగత అజెండాను.. ప్రజలపై రుద్ది పార్టీకి మేలు చేయలేకపోయారని షర్మిలపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు.
+ కుటుంబ తగాదాలను.. రాజకీయం చేసి.. ఇతర పార్టీలకు మేలు చేశారని మెజారిటీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిలకు సహకరించేది లేదని చెబుతున్న నాయకులు కూడా ఉన్నారు. ఇవన్నీ పరిశీలిస్తే.. పార్టీకి నిజాలు తెలుస్తాయి. కానీ, ఇప్పుడు కమిటీలను రద్దు చేయడం ద్వారా పార్టీకి ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండబోదని అంటున్నారు.