డిప్యూటీ స్పీకర్ కోసం జనసేన పట్టు ?
టీడీపీ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన కొన్ని కీలకమైన పోస్టుల విషయంలో పట్టుదలగా ఉంది.
టీడీపీ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన కొన్ని కీలకమైన పోస్టుల విషయంలో పట్టుదలగా ఉంది. వాటిని తమకు ఇవ్వాలని కోరుతోంది. ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవి కూడా అందులో ఒకటి అని అంటున్నారు. శాసనసభ స్పీకర్ గా నర్సీపట్నానికి చెందిన టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు నియమితులయ్యారు. దానికి జనసేన కూడా మనస్ఫూర్తిగా మద్దతు ప్రకటించింది.
ఆ సమయంలోనే డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు ఇస్తారని ప్రచారం సాగింది. అయితే ఆ తరువాత బడ్జెట్ సెషన్ పేరుతో మరో అయిదు రోజుల పాటు సభ జరిగినా కూడా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రస్తావన లేకుండానే ముగిసింది. అయితే ఈసారి శీతాకాల సమావేశాలలోగా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుందని అంటున్నారు
ఈ కీలక పదవి తమకే దక్కాలని జనసేన కోరుతోంది అన్నది పెద్ద ఎత్తున సాగుతున్న ప్రచారం. టీడీపీలో ఉంటూ సరిగ్గా ఎన్నికల ముందు జనసేనలోకి వెళ్ళి టికెట్ సంపాదించి అవనిగడ్డ నుంది గెలిచిన సీనియర్ నేత మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ కి ఈ పదవిని ఇప్పించాలని జనసేన అధినాయకత్వం భావిస్తోంది అని చెబుతున్నారు.
ఇప్పటికి నాలుగు సార్లు బుద్ధ ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మంత్రిగా చేసింది మాత్రం వైఎస్సార్ మంత్రివర్గంలోనే. ఆ తరువాత అమాత్య యోగం అయితే పట్టలేదు. విభజన తరువాత ఆయన టీడీపీలో చేరారు. ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా అవనిగడ్డ నుంచి గెలిచినా మంత్రి పదవి మాత్రం అందని పండు అయింది. ఆయనను డిప్యూటీ స్పీకర్ గానే చంద్రబాబు నియమించారు. ఇక 2019లో ఆయన ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు.
ఈ నేపధ్యంలో 2024 ఎన్నికల మీద ఆశ పెట్టుకుంటే అవనిగడ్డ సీటు జనసేనకు ఖరారు చేశారు. దాంతో ఆ పార్టీలోకి వెళ్ళి గెలిచి వచ్చినా మండలికి మంత్రి పదవి దక్కలేదు. ఈ పరిణామాల నేపధ్యంలో మండలికి కేబినేట్ ర్యాంక్ కలిగిన డిప్యూటీ స్పీకర్ పదవి ఇప్పించడానికి జనసేన అధినాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది అని అంటున్నారు.
అయితే టీడీపీ నుంచి కూడా ఈ పదవికి గట్టి పోటీ ఉంది అని అంటున్నారు. రాయలసీమ జిల్లాలకు చెందిన కాల్వ శ్రీనివాసులు పేరు ప్రస్తావనకు వస్తోంది. అలాగే దక్షిణ కోస్తా జిల్లాలకు చెందిన నేతలు కూడా ఈ పదవి కోసం చూస్తున్నారు. గోదావరి నుంచి కూడా ఈ పదవిని ఆశించే వారు ఉన్నారు.
టీడీపీ డిప్యూటీ స్పీకర్ పదవిని తమకే ఉంచుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. కానీ మిత్ర పక్షం అయిన జనసేన పట్టుబట్టడంతో ఈ పదవి ఏ పార్టీని వరిస్తుంది అన్నది ఉత్కంఠను రేపుతోంది. జనసేనకు ఈ పదవి కేటాయిస్తే మండలికే చాన్స్ అని అంటున్నారు. మండలి ఈ పదవితో అయినా సంతృప్తి పడాల్సి ఉంటుంది. మరి మండలి లక్ ఎలా ఉందో అన్నది కూడా చూదాల్సి ఉంది.