ఆంధ్రా అక్షర క్రమంలో మొదటి స్థానంలో కాదు విద్యా రంగంలో కూడా అన్ని విధాలుగా ఫస్ట్ ది బెస్ట్ అని నెదర్లాండ్ అంతర్జాతీయ సదస్సు ప్రశంసలు కురిపించింది. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో విద్యారంగంలో ఏపీ అద్భుత ప్రగతిని సాధిస్తూ ముందుకు వెళ్తోందని కూడా కితాబు ఇచ్చింది.
నిజంగా ఇది ఏపీ ప్రభుత్వ పని తీరుకు మెచ్చుతునక అని అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే విద్యా రంగం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అరకొర బడ్జెట్ లతో బండి లాగిస్తున్న సర్కారీ బడులకు మోక్షం కల్పించారు. ఒక్కసారిగా అయిదారు రెట్లు బడ్జెట్ ని పెంచేసారు.
నాడు నేడు అంటూ విద్యాలయాలను బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు కార్పొరేట్ స్థాయిలో సదుపాయాలతో పాటు బోధన పరంగా కూడా ప్రభుత్వ పాఠశాలలకు తిరుగే లేదని చాటి చెప్పారు. అందుకే ఇపుడు ఏపీ గడప దాటి దేశం కూడా దాటి నెదర్లాండ్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆంధ్రా గౌరవం గర్వంగా నిలిచింది.
నెదర్లాండ్స్ లోని యుట్రెచ్ట్ జరుగుతున్న గ్లోబల్ సోషల్ అండ్ ఫైనాన్షియల్ స్కిల్స్ కాన్ఫరెన్స్-2023లో భారత ప్రతినిధిగా ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సదస్సులో జరిగిన ప్యానెల్ చర్చలో ఈజిప్ట్, బుర్కినాఫాసో, ఫిలిప్పీన్స్, కిర్గిజిస్తాన్తో పాటు భారత్ తరఫున పాల్గొన్న సురేష్ కుమార్ మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, ఆవిష్కరణలు, సాధించిన ఫలితాలను ఆయా దేశాల ప్రతినిధులతో పంచుకున్నారు.
అదే విధంగా విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ఎలా విజయం సాధించగలిగింది అని ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అద్భుతమైన ఎస్సీఈఆర్టీ, జిల్లా విద్యా శాఖాధికారులు, డీఎస్వోలతో పాటు భాగస్వామ్య సంస్థలైన అటౌన్ ఇంటర్నేషనల్, ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్, రీప్ బెనిఫిట్ సహకారంతో సాధ్యమైందని చెప్పారు. అనంతరం అయన యునిసెఫ్, ది గ్లోబల్ ఫైనాన్షి యల్ లిట్రసీ ఎక్సలెన్స్ సెంటర్ చర్చల్లో పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే ఏపీకి చెందిన ప్రభుత్వ పాఠశాలలకు చెందిన బాలలు ఏకంగా ఐక్య రాజ్య సమితిలోనే మెరిశారు. ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చిన వారు ఎపుడూ కనీసం హైదరాబాద్ కూడా పోలేని వారు ఏకంగా అమెరికా దాకా వెళ్లారు. ఖండాంతరాలో తన ప్రతిభను అలా వారు చాటుకున్నారంటే దానికి ఏపీ ప్రభుత్వం అందించిన విద్య సంస్కరణలే కారణం అని అంతా అంటున్నారు.
ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో విద్య వ్యవస్థలో మొదలైన సంస్కరణలు అవి సాధిస్తున్న ఫలితాలకు అభినందనలు, ప్రశంసలు దక్కడం ఇదే తొలిసారి కాదు. గత సెప్టెంబర్ లో అమెరికాలో సుస్థిర అభివృద్ధి అనే అంశం మీద జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి సదస్సుల్లో పాల్గొని ఆయా దేశాల ప్రతినిధులతో కలిసి అక్కడి పాలనా విధానాలు, విద్య, ఆరోగ్యం వంటి కీలక అంశాలమీద ఆయా ప్రభుత్వాలు పెడుతున్న శ్రద్ధ, సమాజాభివృద్ధిలో ఆయా రంగాలు ఎలాంటి కీలకపాత్ర పోషిస్తాయి అనే అంశాలమీద చర్చలు విద్యావేత్తలు, ఆర్థిక, సామాజిక వేత్తలతో భేటీలు నిర్వహించారు.
ఇందులో ఏపీకి చెందిన పదిమంది విద్యార్థులు పదిహేను రోజులపాటు కొలంబియా , స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలతో పాటు న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం, ప్రపంచ బ్యాంకును సైతం సందర్శించి ఆయా దేశాల్లో పాలనా విధానం వంటి అంశాల మీద అవగాహన పెంపొందించుకున్నారు.
ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగంలో వచ్చిన గణనీయమైన మార్పులను, దానికోసం సీఎం వైయస్ జగన్ చేపట్టిన సంస్కరణలు గురించి వివరించారు. రాష్ట్రంలో అమ్మఒడి, మనబడి నాడు- నేడు, విద్యాకానుక వంటి పథకాలు విద్యావ్యవస్థను ఎంతగా బలోపేతం చేసిందీ పిల్లలు అక్కడి ప్రతినిధులకు వివరించారు. అంతేకాకుండా మన ప్రభుత్వం విద్య కోసం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించి అక్కడ మేధావుల మెప్పు పొందారు.
ఇవన్నీ కూడా ఏపీ ప్రభుత్వం ముందు చూపునకు విద్యారంగం విషయంలో ప్రభుత్వం కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధకు మానవ వనరులే అసలైన పెట్టుబడి అని మనసా వాచా కర్మేణా నమ్ముతూ అవే రేపటి సమాజానికి ఏపీ భవిష్యత్తుకు కూడా అసలైన వెలుగులూ అని భావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న కృషికి ఈ కితాబులు నిజమైన తార్కాణాలు అని చెప్పాల్సి ఉంటుంది.