పరుగులు పెట్టిస్తున్న ఈసీ : మార్చిలోనే ఎన్నికలు..!?
ఏపీలో ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. నిదానంగా మూడు నెలలు టైం ఉంది అని అనుకోవడానికి ఏమీ లేదు.
ఏపీలో ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. నిదానంగా మూడు నెలలు టైం ఉంది అని అనుకోవడానికి ఏమీ లేదు. నిజం చెప్పాలంటే ఏపీ ఎన్నికలకు తొందరేమీ లేదు. అసెంబ్లీ గడువు చూస్తే జూన్ 16 దాకా ఉంది. అయితే కేంద్రంలోని ప్రభుత్వానికి ఎన్నికలు కూడా జత కూడడం వల్ల ఏపీ ఎన్నికలకు కూడా తొందర వస్తోంది.
ఈసారి ఎనిమిది విడతలుగా ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుపుతారు అని అంటున్నారు. అది కూడా ఏపీతోనే తొలిదశను మొదలెట్టి మొత్తం ప్రక్రియను మే మొదటి వారంలో పూర్తి చేస్తారు అని అంటున్నారు. అంటే మండు టెండలు రాకుండానే ఏపీతో సహా దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగుస్తాయన్న మాట. ఇక 2019లో ప్రధాని మోడీ ఏపీ సీఎం జగన్ మే 30న ప్రమాణం చేశారు.
ఈసారి మాత్రం దాని కంటే ముందే అంటే మే రెండవ వారంలోగా కొత్త ప్రభుత్వాలు కేంద్రంలో ఏపీలో ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దాంతోనే కేంద్ర ఎన్నికల సంఘం పలు మార్లు ఏపీ విషయంలో హడావుడి పడుతోంది అని అంటున్నారు.
ఇపుడు ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఏపీకి వస్తున్నారు. ఆయన తన బృందంతో సహా ఏపీకి వచ్చి మూడు రోజుల పాటు కీలక సమావేశాలు నిర్వహిస్తారు అని అంటున్నారు. దాంతో ఏపీలో ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగిపోతోంది.
ఇక కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన చూసుకుంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తో పాటు ఇతర కమిషనర్లు సోమవారం విజయవాడ చేరుకుంటారు. ఈ నెల 8 నుంచి 10 వరకూ సీఈసీ బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ టూర్ లో భాగంగా మంగళవారం రాష్ట్రంలోని వివిధ పార్టీలతో సీఈసీ రాజీవ్ కుమార్ బృందం భేటీ కానుంది.
అనంతరం ఓటర్ల జాబితాలో తప్పిదాలు ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించనుంది. అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధతపై జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారంగా ఉంది.
అదే విధంగా ఈ నెల 10న సీఎస్, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో సీఈసీ రాజీవ్ కుమార్ భేటీ అవుతారని అధికారులు తెలిపారు. అదేరోజు సాయంత్రం ఎన్నికల కమిషనర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడతారని చెప్పారు. సమావేశం పూర్తయ్యాక సీఈసీ బృందం ఢిల్లీకి తిరిగి వెళుతుందని పేర్కొన్నారు.
ఇలా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఉంది. దాంతో ఏపీలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన తరువాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే విషయంలో ఒక కొలిక్కి వస్తుందని అంటున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్ ప్రకటించి మార్చి మొదటి వారానికల్లా ఏపీలో ఎన్నికలు నిర్వహిస్తారు అని అంటున్నారు.
దాంతో ఏపీలో జరిగే పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను ఎన్నికలు అయిన తరువాత నిర్వహించేలా వాయిదా వేస్తారు అని కూడా వినిపిస్తోంది. దీని మీద పక్కా సమాచారం ఉండడంతోనే అధికార వైసీపీ అభ్యర్ధుల ఎంపికను చేపడుతోంది అంటున్నారు. మొత్తానికి సంక్రాంతికల్లా వైసీపీ టోటల్ అభ్యర్ధులు డిసైడ్ అవుతారు అని అంటున్నారు.