ఏపీలో ఎలక్షన్స్... ప్రజలకుఎవరూ నచ్చడంలేదా?

దీంతో... పోటీ చేస్తున్న ఏ ఒక్క అభ్యర్థీ నచ్చకపోయినా, ఓటు వేయడంపై ఆసక్తి లేకపోయినా గతంలో ఇంట్లోనే ఉండేవారు

Update: 2024-04-10 06:09 GMT

ఎన్నికల సమయంలో ఎన్నో ఆసక్తికర అంశాలపై చర్చ జరుగుతుండే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధానంగా గతకొంతకాలంగా "నోటా"పైనా విపరీతమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏ అభ్యర్థీ నచ్చని పక్షంలో వారి అభిప్రాయాన్ని స్వేచ్ఛగా తెలియజేసే హక్కు ఒకప్పుడు ఉండేది కాదనేది తెలిసిన విషయమే. అయితే.. ఆ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ.. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఈ ఆప్షన్ తెరపైకి వచ్చింది.

దీంతో... పోటీ చేస్తున్న ఏ ఒక్క అభ్యర్థీ నచ్చకపోయినా, ఓటు వేయడంపై ఆసక్తి లేకపోయినా గతంలో ఇంట్లోనే ఉండేవారు. అయితే... నోటా వచ్చిన తర్వాత.. తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం వచ్చింది! దీంతో... పనిగట్టుకుని మరీ పోలింగ్ బూత్ కి వెళ్లి తమకు ఏ అభ్యర్థీ నచ్చలేదని చెప్పేవారి సంఖ్య ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఇందులో భాగంగా ప్రధానంగా ఏపీలో కూడా నోటా ను ఎంచుకున్నవారి సంఖ్య ఆసక్తికరంగా మారింది!

అవును... 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సుమారు 1.08 శాతం మంది నోటాకు ఓటు వేయగా.. 2019లో వీరి సంఖ్య స్వల్పంగా తగ్గి 1.06 శాతంకు చేరుకుంది. అలా అని ఇదేమీ చిన్న విషయం కాదు సుమా... 1.06 - 1.08 శాతం అంటే సుమారు 65 లక్షల మంది! అంటే... దేశవ్యాప్తంగా వారి వారి నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏ ఒక్క అభ్యర్థీ నచ్చని వారు అరకోటిపైనే ఉన్నారన్నమాట!

ఆ సంగతి అలా ఉంటే... రాష్ట్రాల వారీగా నోటా ఆప్షన్ ను ఎంచుకునే వారి విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో... బీహార్ లో అత్యధికంగా 2 శాతం ఉండగా... ఆ తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ లో 1.28 శాతం ఉండటం గమనార్హం. ఇలా దేశ సగటుకు కంటే ఎక్కువగా ఏపీ వంటి రాష్ట్రాల్లో ఓటర్లు నోటాను ఎంచుకోవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... గత ఎన్నికల్లో కీలక నేతలు పోటీ చేసిన కొన్ని నియోజకవర్గాల్లో కూడా నోటాకు వెయ్యికి మించి ఓట్లు రావడం. ఇందులో అత్యధికంగా టీడీపీ అధినేత చంద్రబాబు పోటీచేసిన కుప్పంలో 2160 ఓట్లు నోటాకు పడగా.. పులివెందులలో 2905, గాజువాకలో 1764, భీమవరంలో 1492, మంగళగిరిలో 1119 ఓట్లు నోటాకు పడ్డాయి!

Tags:    

Similar News