ఈ ఎన్నికలు ఆ ఇద్దరి ఓటర్ల మధ్య వార్!?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి గడువు ఈ రోజు సాయంత్రంతో ముగుస్తుంది

Update: 2024-05-11 05:22 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి గడువు ఈ రోజు సాయంత్రంతో ముగుస్తుంది. రేపు ఒక్కరోజు ఆగితే సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైపోతుంది. దీతో... ఉన్న ఈ కొన్ని గంటలను సద్వినియోగం చేసుకోవాలని ఆయా పార్టీల నేతలు, అధినేతలూ ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తున్నారు. ఈ నేపథ్యంలో జంటనగరాల నుంచి భారీగా ప్రజానిక గ్రామాలకు బయలుదేరి వెళ్లారు.

పైగా చాలా మంది పరిశీలకు ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నారు. పోలింగ్ రోజును చాలా మంది హాలిడేగా చూస్తుంటారని.. అందుకే ఏనాడూ భారీ స్థాయిలో పోలింగ్ జరగడం లేదని చెబుతుంటారు. అయితే అనూహ్యంగా ఈసారి మాత్రం రొటీన్ కి భిన్నంగా అన్నట్లుగా భారీస్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు.

జనాల్లో మార్పు వచ్చిందని.. ఓటు విలువ చాలా మంది తెలుసుకున్నారని.. పోలింగ్ తేదీ అంతే కాలెండర్ లో ఎర్ర అక్షరాలతో ఉండే సెలవు రోజు కాదని భావించారని చెబుతున్నారు. ఈ సమయంలో ఈసారి ఎన్నికలు ప్రధానంగా రెండు రకాల ఓటర్ల మధ్య జరుగుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీకి సమయం ఆసన్నమైన వేళ ఒక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఈసారి ఎన్నికలు ప్రధానంగా రెండు రకాల ఓటర్ల మధ్య జరిగే అవకాశం ఉందని అంటున్నారు. వారిలో ఒకరు ఓటుకు నోటు తీసుకునేవారు, వారి అభిప్రాయాన్ని నోటు వెయిట్ ని బట్టి మార్చుకునేవారు కాగా... మరొకరు ఓటు కోసం ఎంతదూరం నుంచైనా వచ్చి తన అభిప్రాయం మేరకు ఓటు వేసేవారు.

అవును... వాస్తవానికి చాలా మందికి సొంత అభిప్రాయం అంటూ ఉండదని.. నోటు బరువుని బట్టి తమ తమ అభిప్రాయాలు మార్చేసుకుంటారని అంటుంటారు. ఒకరు 1000 ఇచ్చారు, మరొకరు 1500 ఇచ్చారని.. ఒకటి ఎంపీ స్థానానికి, మరొకటి అసెంబ్లీ గుద్దే జనాలు చాలా మందే ఉన్నారని చెబుతుంటారు. చాలా చోట్ల ఊహించని స్థాయిలో ఈ కారణంతోనే క్రాస్ ఓటింగ్ జరుగుతుంటుందని చెబుతున్నారు.

ఇటీవల నేతలు కూడా.. అవతలి వారు ఓటుకు నోటు ఇస్తే తీసుకోండి.. కానీ.. ఓటు మాత్రం ఆలోచించి వేయండి, మీ భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తునూ దృష్టిలో పెట్టుకుని ఓటు వేయండి అనే సరికొత్త ప్రచారానికి తెరలేపడానికి ఇదే అసలు కారణం అని అంటున్నారు.

ఇక మరోపక్క... ఓటుకు నోటుతో ఏమాత్రం సంబంధం లేకుండా వేలకు వేలు ఖర్చు పెట్టుకుని బస్సులు, ట్రైన్లు పట్టుకుని, సొంత వాహనాలు వేసుకుని తమ రాష్ట్రంలో ప్రజల సమస్యలను అర్ధం చేసుకునే నేతకు ఓటు వేయాలని.. అది తమ బాధ్యత అని పోలింగ్ తేదీ నాటికి ఊరికి వచ్చేవారు చెబుతుంటారు. ఈ సమయంలో ఈ ఇద్దరి మధ్యే పోటీ అని చెబుతున్నారు.

మరోపక్క ఏ మాత్రం అవకాశం ఉన్నా.. డబ్బు తీసుకోవడం, తీసుకోకపోవడం అనే సంగతి కాసేపు పక్కనపెడితే... అందరూ ఓటు వేయాలని.. కాకపోతే తమ తమ అభిప్రాయాన్ని నోటు కారణంగా మార్చుకోకుండా సరైన నాయకుడిని ఎన్నుకోవాలని.. అంతరాత్మ సూచన మేరకు ఓటు వేయాలని పలువురు సూచిస్తున్నారు. నోటు మత్తులోనో, నాటు మత్తులోనో కాకుండా ఆలోచించి ఓటు వేయాలని అంటున్నారు.

Tags:    

Similar News