ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్... వీడియో వైరల్!
ఏపీలో మందుబాబులకు కొత్త ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రాష్ట్రంలో నాన్ బ్రాండెడ్ లిక్కర్ కు తెరపడింది
ఏపీలో మందుబాబులకు కొత్త ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రాష్ట్రంలో నాన్ బ్రాండెడ్ లిక్కర్ కు తెరపడింది. ఇదే సమయంలో.. తిరిగి ఏపీలో బ్రాండెడ్ లిక్కర్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా దేశంలో పాపులర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న కింగ్ ఫిషర్ బీర్ ను కంటైనర్లలో తీసుకొచి గోడౌన్ లలో నిల్వ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ నేత షేర్ చేశారు.
అవును... ఏపీలో ఇకపై బ్రాండెడ్ మద్యం దొరకబోతుందని చెబుతున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం విక్రయాలు ప్రారంభం కాబోతున్నాయని. ఈ మేరకు కింగ్ ఫిషర్ బీర్లతో వచ్చిన కంటైనర్ వీడియోను టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి పోస్ట్ చేశారు. "ఇట్స్ బ్యాక్ ఆల్ ఓవర్ ఏపీ కింగ్ ది ఫిషర్ చీర్స్" (ఏపీకి మళ్లీ తిరిగి వచ్చేసింది.. కింగ్ ది ఫిషర్ చీర్స్) అని ట్వీట్ చేశారు.
దీంతో.. ఈ ట్వీట్ కింద కామెంట్లు హోరెత్తిపోతున్నాయి. నెటిజన్లు క్రియేటివిటీకి పని చెబుతూ... ఆసక్తికరమైన కామెంట్లు పెడుతున్నారు. మరోపక్క మొన్నటివరకూ తెలంగాణలో టాప్ బ్రాండ్ లిక్కర్, కింగ్ ఫిషర్ బీర్లు దొరికితే... ఏపీలో మాత్రం చిత్రవిచిత్రమైన బ్రాండ్స్ కి చెందిన లిక్కర్, బీర్లు దొరికేవి. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
మరోవైపు ఏపీలో మద్యం పాలసీపై కూడా చర్చ మొదలైందని తెలుస్తుంది. కొత్త ప్రభుత్వం రాగానే ఇప్పటివరకూ ఉన్న వైసీపీ ప్రభుత్వ మద్యం పాలసీని రద్దు చేసి, కొత్త మద్యం పాలసీని ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే... ఇప్పటిలాగానే రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడుపుతూ... పర్మిట్ రూంలు, బార్లకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.