కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల కాక ఓ రేంజ్‌లో సాగుతోంది. పైకి అంతాబాగానే ఉందని అనుకుంటున్నా.. అంతర్గతంగా మాత్రం నాయకులు రగిలిపోతున్నారు. పార్టీప్రభుత్వం వచ్చి 50 రోజులు అయినా.. తమను పట్టించుకోవడం లేదని.. క్షేత్రస్థాయిలో టీడీపీ కోసం పనిచేసిన, ఖర్చు చేసిన నాయకులు ఆవేదన, ఆందోళన, ఆక్రోశంతో ఉన్నారు. ప్రధానంగా రెండు విషయాలను వారు ప్రస్తావిస్తూ.. పార్టీ అధినేత తీరును పరోక్షంగా విమర్శిస్తున్నారు.
1) పార్టీ మిత్రపక్షాలకు.. కూడా నామినేటెడ్ పదవులను విరివిగా ఇవ్వాలన్న ఉద్దేశం. 2) వైసీపీ నుంచి నాయకులను తీసుకోవాలన్న రాజకీయ వ్యూహం. ఈ రెండు అంశాలు కూడా టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఇటీవల శాసన సభాపక్షం సమావేశంలో జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్.. తొలిసారి..నామినేటెడ్ పదవుల విషయాన్ని ప్రస్తావించారు. తమకు కూడా న్యాయం చేయాలని, అనేక మంది నాయకులు నామినేటెడ్ పోస్టుల కోసం.. జనసేనలో నూ వేచి ఉన్నారని చెప్పారు.
దీనికి చంద్రబాబు సాను కూలంగా స్పందించారు. ఎవరెవరికి కావాలని అనుకుంటున్నారో.. జాబితా ఇవ్వండి తప్పకుండా ఇస్తానన్నారు. దీంతో సుమారు 20 మందికి పైగా పేర్లను జనసేన రెడీ చేసింది. ఇక, బీజేపీ నుంచి కూడా అంతే సంఖ్యలో జాబితా చంద్రబాబుకు చేరిందని టీడీపీ నేతలు అంటున్నారు.న మంత్రివర్గంలో కేవలం ఒక్కస్థానం ఇచ్చిన నేపథ్యంలో తమకు నామినేటెడ్‌లో అయినా న్యాయం చేయాలని కమల నాథులు కోరుతున్నారు.
ఇక, వీరికే సుమారు 40 పదవులు పోతే.. తమకు ఒరిగేదేంటనేది టీడీపీ నేతల మాట. పైగా.. మిత్రపక్షాలు రెండూ కూడా.. కీలకమైన పదవులు కోరుతాయని అంటున్నారు. ఇక, చిల్లర మల్లర పదవులు మాత్రమే తమకు దక్కుతాయని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఈ పరిణామం చంద్రబాబుకు సెగ పెడుతోంది. ఇక, వైసీపీ నుంచి తీసుకునేవారు కూడా.. కూడా నామినేటెడ్ పదవుల కోసమే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన డొక్కా మాణిక్యం వంటివారుకూడా.. కర్చీఫ్‌లు పరిచేశారు. మరింత మంది వచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ పరిణామాలతోనే నామినేటెడ్ పదవుల విషయం టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది.