హైదరాబాద్ లో దారుణం: కారుతో పోలీసును గుద్దేసి పరార్
సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసిన వాహనాల తనిఖీని నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ మహానగరంలో షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తనిఖీల కోసం పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది రోడ్ల మీద విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వేగంగా దూసుకెళుతున్న కారు ఒకటి.. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ను ఢీ కొనటమే కాదు.. ఆగకుండా పరారైన ఉదంతం షాకింగ్ గా మారింది. ఈ ఉదంతంలో గాయాల బారిన పడ్డ పోలీసులు చికిత్స పొందుతున్నాడు. మరోవైపు.. ఢీ కొట్టిన వ్యక్తిని పోలీసులు పట్టుకోలేకపోవటం విమర్శలకు తావిస్తోంది.
సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసిన వాహనాల తనిఖీని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడకు ఒక కారు వేగంగా దూసుకొచ్చింది. కానిస్టేబుల్ మహేశ్.. సదరు కారును ఆపే ప్రయత్నం చేశారు. అందుకు.. ఆ కారు డ్రైవర్ కారును ఆపలేదు సరికదా.. కానిస్టేబుల్ మీదకు కారును పోనిచ్చాడు. అక్కడితో ఆగకుండా పోలీసును ఢీ కొట్టి..వెళ్లిపోయాడు. ఈ ఘటనలో కిందపడిన పోలీసులు గాయపడ్డాడు.
అక్కడున్న వారు వెంటనే సదరు కానిస్టేబుల్ ను తీసుకొని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పోలీసు కానిస్టేబుుల్ పరిస్థితి నిలకడగా ఉందని.. ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్నారు. ఈ మొత్తంఘటన దగ్గర్లోని సీసీ కెమేరాలో నమోదైంది. ర్యాష్ డ్రైవింగ్ తో విధి నిర్వహణలో ఉన్న పోలీసును ఢీ కొట్టి వెళ్లిపోయిన కారు డ్రైవర్ ను పట్టుకునే విషయంలో పోలీసులు విఫలమైనట్లుగా చెబుతున్నారు. ఈ ఘటనకుసంబంధించిన సీసీ ఫుటేజ్ ఉన్న తర్వాత కూడా.. నిందితుడ్ని పట్టుకునేందుకు ఎందుకింత ఆలస్యమవుతుందన్నది ఇప్పుడు చర్చగా మారింది. పోలీసుల తీరుపైన విమర్శలు వస్తున్నాయి.