తెలంగాణలో మద్యం దుకాణాలకు పోటెత్తిన దరఖాస్తులు
తెలంగాణలో మద్యం దుకాణాలకు స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించి గత రికార్డులు బద్దలయ్యాయి.
తెలంగాణలో మద్యం దుకాణాలకు స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించి గత రికార్డులు బద్దలయ్యాయి. కొత్త రికార్డులు నమోదయ్యాయి. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం తొలిసారి లక్షకుపైగా దరఖాస్తులు అందడం విశేషం. దరఖాస్తులు సమర్పించడానికి ఆగస్టు 18 శుక్రవారం చివరిరోజు కావడంతో దరఖాస్తుదారులు పోటెత్తారు. అందులోనూ తొలి శ్రావణ శుక్రవారం కావడం, మంచి రోజు అవ్వడంతో ఔత్సాహికులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11 గంటల వరకు ఏకంగా 1.25 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. మొత్తం దరఖాస్తుల లెక్కింపులో తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. కాగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు నాలుగుసార్లు మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఇప్పుడు దరఖాస్తుల నమోదులో గత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.
2023–25 మద్యం విధానానికి సంబంధించి ఆగస్టు 14 నుంచి దరఖాస్తుల నమోదు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే మొదటి రెండు రోజులు పెద్దగా దరఖాస్తుదారులు ముందుకు రాలేదు. ఆగస్టు 14న తొలిరోజు కేవలం 125 దరఖాస్తులే అందాయి. రెండో రోజు కూడా ఇదే పరిస్థితి. అరకొరగానే దరఖాస్తులు వచ్చాయి. ఇక మూడో రోజు బుధవారం సుమారు 44 వేల మంది దరఖాస్తులు సమర్పించారు. గురువారంæ 26 వేలు దరఖాస్తులు సమర్పించారు. ఇక చివరిరోజు శుక్రవారం 30 వేల వరకు రావచ్చని అధికారులు అంచనా వేశారు. అయితే ఈ అంచనాలను బ్రేక్ చేసి దరఖాస్తుదారులు భారీ ఎత్తున తరలివచ్చారు.
దరఖాస్తుల సమర్పణకు చివరి రోజైన శుక్రవారం రాత్రి 11 గంటల వరకు ఒక్క రోజే 40 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. క్రితంసారి మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు దాదాపు 69 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈసారి ఆ రికార్డులను బద్దలు కొడుతూ వాటికంటే 60%–70% అధికంగా దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తులతో రుసుముల కింద ప్రభుత్వ ఖజానాకు రూ.2,500 కోట్లు జమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆగస్టు 21న దుకాణదారుల ఎంపిక కోసం జిల్లాలవారీగా లక్కీడ్రా నిర్వహించనున్నారు. ఎంపికైన దుకాణదారులు ఆగస్టు 23లోగా వార్షిక రుసుంలో ఆరో వంతును మొదటి వాయిదాగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ గడువును ఆగస్టు నెలాఖరు వరకు పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. లైసెన్స్ పొందిన వ్యాపారులు డిసెంబరు 1వ తేదీ నుంచి అమ్మకాలు చేసుకోవచ్చు.
కాగా రాజధాని హైదరాబాద్ పరిసరాల్లోని దుకాణాలకు భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. జిల్లాల వారీగా సాయంత్రం 6 గంటల వరకు ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం... శంషాబాద్ లో 8,409, సరూర్‌నగర్ లో 8,263, మేడ్చల్ లో 5,210, మల్కాజిగిరిలో 4,998 దరఖాస్తులు అందాయి. మొత్తం లెక్క పూర్తయితే ఈ నాలుగు జిల్లాల్లోనే 30% వరకు దరఖాస్తులు ఉంటాయని అంటున్నారు.
హైదరాబాద్ తర్వాత ఇతర జిల్లాల్లో పరిశీలిస్తే అత్యధికంగా నల్గొండలో 6,134, ఖమ్మంలో 5,906, వరంగల్ అర్బన్ లో 4,590 దరఖాస్తులు అందాయి. అత్యల్పంగా వనపర్తిలో 989, ఆసిఫాబాద్ లో 846, ఆదిలాబాద్ లో 781, నిర్మల్ లో 657 మాత్రమే వచ్చాయి.