ఏపీ ఎన్నికల ఫలితాలు...అనేక ప్రశ్నలకు సమాధానాలు !
ఏపీలో ఈసారి వచ్చే ఫలితాలు అనేక ప్రశ్నలకు సమాధానాలుగా ఉంటాయి.
ఏపీలో ఈసారి వచ్చే ఫలితాలు అనేక ప్రశ్నలకు సమాధానాలుగా ఉంటాయి. అంతే కాదు జాతీయ స్థాయిలోనూ పాఠాలూ గుణపాఠాలు నేర్చుకునేలా ఉంటాయని అంటున్నారు. ఒక విధంగా పొలిటికల్ గా ఏమి చేస్తే జనాలకు నచ్చుతుంది. ఏమి చేయకూడదు అన్నది కూడా ఒక లెసన్ మాదిరిగా అందించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఏపీలో వైసీపీ గెలిస్తే ఏమి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుందో చూద్దాం. ఎన్నికల ముందు కూటములు హడావుడిగా కట్టి భావ సారూప్యత లేని పార్టీలతో జనాలను మభ్యపెట్టాలని చూస్తే వారు ఒప్పుకోరు అన్న సందేశం దీని నుంచి తీసుకోవాల్సి ఉంటుంది.
అలాగే భారీ హామీలు ఇచ్చినా క్రెడిబిలిటీ కూడా చూసుకోవాలి అన్నది మరో లెసన్ గా చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే కులాలు ప్రాంతాలు లెక్కలు రాజకీయ గణితాలు ఎపుడూ ఒకేలా హిట్ అవవు రెండు రెళ్ళు నాలుగు ఎప్పటికీ కాదు అన్నది కూడా తెలుసుకోవచ్చు అని అంటున్నారు.
అదే విధంగా నెగిటివ్ ప్రచారం చేస్తూ పోతేనే గెలుపు యాంటీ ఇంకెంబెన్సీయే గెలిపిస్తుంది అన్నది కూడా తప్పు అన్న మరో పాఠం కూడా నేర్చుకోవచ్చు అని అంటున్నారు. ఇక అభివృద్ధి అన్న దాన్ని పక్కన పెట్టి డబ్బులు ఇస్తూ పోతూంటే గెలవవచ్చు అన్నది దేశానికి సైతం ఒక పాఠంగా రాజకీయ నేతలకు షార్ట్ కట్ మెదడ్ లో సక్సెస్ మంత్రగా కూడా తెలియచేసే అవకాశం ఉంటుంది.
అదే టీడీపీయే గెలిస్తే అపుడు పాఠాలు గుణపాఠాలు ఎలా ఉంటాయంటే అప్పులు తెచ్చి ఖజానా ఖాళీ పెట్టి పప్పు బెల్లాలు మాదిరిగా పంచుడే పంచుడు అని చేయడం వల్ల ఓట్లు పడవు అన్న నీతిని జనాలు నేర్పినట్లు అవుతుంది. అభివృద్ధితోనే గెలుపు పిలుపు ఉంటుందని కూడా అర్ధం అవుతుంది. రాజకీయాల్లో విజయాలకు షార్ట్ కట్ మెదడ్స్ ఉండవని కూడా చెప్పినట్లు అవుతుంది.
అధికార గర్వంతో ఏమి చేసినా చెల్లుతుంది అన్న దానికి జనాలు తీర్పు ఎపుడూ వ్యతిరేకం అని కూడా అర్ధం అవుతుంది. అలాగే జనాలను తక్కువ అంచనా వేయడమో గుడ్డిగా వారంతా తమ వారే అని భ్రమించడమో చేస్తే కూడా ఫలితం ఇలాగే ఉంటుందని తెలియజేయవచ్చు.
అన్నింటికీ మించి అసలైన ప్రభువులు ప్రజలే తప్ప తాము కాదని నేతలు నేర్చేందుకు వీలు ఉంటుంది. వై నాట్ అంటూ బిగ్ నంబర్ ముందేసుకుని అతితో మితిమీరిన విశ్వాసంతో స్టేట్మెంట్స్ ఇస్తే బొక్క బోర్లా అవుతుందని ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలో ఏమి చేయాలో జనాలే డిసైడ్ చేస్తారు తప్ప రాజకీయ పార్టీలు కారు అని అర్ధం అవుతుంది.
అందరినీ దూరం చేసుకుంటే శత్రువులను వీలైనంతగా పెంచుకుంటే జరిగే ఉపద్రవాలు ఎలా ఉంటాయో కూడా వైసీపీ ఓటమి చెందినట్లు అయితే కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది అని అంటున్నారు. ఈ రెండు పార్టీలలో ఒక పార్టీ గెలుస్తుంది కాబట్టి ఈ రోజుకు ఈ రెండూ ఊహాగానాలు అనుకున్నా రెండింటిలోనూ నిజాలు ఉన్నాయి. జనం తీర్పుని బట్టి ఒకటి అధికారిక నిజం అవుతుంది. రెండవది కూడా జాగ్రత్తలు నేర్పే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో అందరూ చివరికి ప్రజలకే దాసులుగా ఉండాలన్న అసలైన సత్యాన్ని మాత్రం ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేయడం ఖాయమని అంటున్నారు.