ప్రత్యేక హోదా కోసం క్యూలో రాష్ట్రాలు....ఏపీ గొంతు విప్పాల్సిందే !

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయి అన్ని రకాలుగా కష్టాలతో కృంగిపోతోంది

Update: 2024-06-25 23:30 GMT

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయి అన్ని రకాలుగా కష్టాలతో కృంగిపోతోంది. అప్పుల కుప్పగా మారింది. అసలు దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఏపీనే. ఎక్కడైనా రాజధాని ఉన్న చోట నుంచి రాష్ట్రాన్ని విడదీసిన చరిత్ర లేదు. అది ఒక్క ఏపీ విషయంలోనే జరిగింది.

ఇలా అన్ని విధాలుగా ఏపీ అన్యాయం అయింది కాబటే హోదా ఇవ్వాల్సి ఉంది. అయితే ఆనాడు విడగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చట్టంలో ప్రత్యేక హోదాను పెట్టలేదు. అసలు విభజన చట్టంలో పెట్టిన అంశాలకే అతీ గతీ లేకుండా ఉన్న వేళ హోదా డిమాండ్ ఎవరు పట్టించుకుంటారు.

అందుకే అయిదు కాదు పదేళ్ళు హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ కూడా ఆ తరువాత నాలిక మడతేసింది. దాంతో పాటుగా ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం ఏపీకి అతి పెద్ద అన్యాయంగానే అంతా చూస్తున్నారు. వాటికంటే ఎక్కువగా ఏపీని నమ్మించి వంచించారు అన్న బాధ ఈ రోజుకీ ఉంది.

ఏపీతో అంతా ఆడుకుంటున్నారు అన్న ఆవేదన అందరిలో ఉంది. ఈ నేపధ్యంలో మరోసారి ఏపీకి హోదా కోసం డిమాండ్ చేసే చాన్స్ వచ్చింది. ఏపీకి హోదా ఇవ్వడం ధర్మం, న్యాయం బద్ధం. ఇపుడు చూస్తే కేంద్రానికి అనివార్యం కూడా. ఏపీలోని టీడీపీ జనసేన ఎంపీల మద్దతుతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది.

అలాంటిది ఇపుడు కూడా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏపీ దక్కించుకోకపోతే అంతకు మించిన దారుణం వేరొకటి ఉండదని అయిదు కోట్ల మంది ఆంధ్రులు భావిస్తున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ఎన్డీయే భాగస్వాములుగా ఉన్న టీడీపీ జనసేన ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు. ఈ సమయంలో గొంతు విప్పాలని అంతా కోరుతున్నారు.

ఇక పొరుగున ఉన్న ఒడిషా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ తన పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేస్తూ ఒడిషాకు ప్రత్యేక హోదాని కోరాలని చెప్పడం విశేషం. ఒడిషాకు ప్రత్యేక హోదా అని అడుగుతున్నారు అంటే ఏపీ ఈ విషయంలో ఇంకా ఎంత ముందు ఉండాలన్నది ఇపుడు చర్చకు వస్తోంది.

ఒడిషా అన్ని రకాలుగా వెనకబడిందని హోదా ఇస్తేనే ప్రగతిపధంలో దూసుకుని పోతుందని మాజీ సీఎం నవీన్ పట్నాయక్ తన పార్టీ ఎంపీలకు సూచించారు హోదా సాధన కోసం కేంద్రంతో పోరాడాలని పార్లమెంట్ వేదికగా ఇదే నినాదం వినిపించాలని ఆయన పేర్కొన్నారు.

ఇక బీహార్ ఎటూ ప్రత్యేక హోదాను కోరుతోంది. ఈ విషయాన్ని ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తున్న నితీష్ కుమార్ కోరారని కూడా అంటున్నారు అక్కడ అధికార ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఏకత్రాటిపైకి వచ్చి హోదా ఇవ్వాల్సిందే అని కోరుతున్నారు.

ఈ రెండు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా హోదా కోసం కేంద్రం మీద ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ సమయంలో ఏపీ నోరు విప్పి మాకే హోదా ముందు ఇవ్వాలని డిమాండ్ వినిపించాలని అంటున్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే హోదాకు ఇప్పుడు అన్ని విధాలుగా తగినది ఏపీ మాత్రమే అని అంటుననరు. ఏపీకి హోదా లేకపోతే అప్పులు సుడిగుండంలో చిక్కుని అల్లాడుతున్న రాష్ట్రం ఏ విధంగానూ ముందుకు సాగలేదని అంటున్నారు.

మరి ఈ విషయంలో టీడీపీ జనసేన ఎంపీలతో పాటు వైసీపీ ఎంపీలు కూడా కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మిగిలిన రాష్ట్రాల మాదిరిగా ఏపీలోని రాజకీయ పక్షాలు అంతా ఏకం కావాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయకత్వంలో అఖిల పక్ష బృందం వెళ్ళి ప్రధానిని కలవాలని అంతా కోరుతున్నారు. మంచి తరుణం మించిపోకుండా ఏపీకి న్యాయం జరిగేలా అంతా చూసుకోవాలని కోరుతున్నారు.

Tags:    

Similar News