వాలంటీర్లు కోరేదేంటి... కూటమి ఇచ్చేదేంటి ?

ఇపుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయినా వాలంటీర్లను ఏమి చేయాలో అర్ధం కావడంలేదు.

Update: 2024-08-12 22:30 GMT

వాలంటీర్లు ఇది ఒక వ్యవస్థగా రూపు దాల్చలేదు. ఆది నుంచి వివాదాలే. ఇది ప్రభుత్వం పెట్టిన ఒక ఆర్గనైజేషన్ నా అంటే కాదు, అలాగని ప్రైవేట్ దా అంటే అదీ కాదు. అలా ఏమీ కాకుండా చేసిన పుణ్యం గత వైసీపీ ప్రభుత్వం కట్టుకుంది. వాలంటీర్లను కేవలం సేవకులు అంటూ వారికి సేవా రత్న అంటూ ఏటా నగదు బహుమతులు బిరుదులు ఇచ్చారు కానీ ఆ వ్యవస్థకు ఒక అర్థం చెప్పలేకపోయారు.

ఇపుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయినా వాలంటీర్లను ఏమి చేయాలో అర్ధం కావడంలేదు. వాలంటీర్లను కొనసాగిస్తామని కూటమి నేతలు ఎన్నికల సభలలో చేసిన ప్రచారం ఇపుడు ముందు పెట్టి వాలంటీర్లను విధులలోకి తీసుకోవాలని కోరుతున్నారు.

అంతే కాదు గత రెండు నెలలుగా బకాయి ఉన్న జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు. మొత్తం రెండున్నర లక్షలకు పైగా ఉన్న వాలంటీర్లను విధులలోకి తీసుకుని నెలకు పది వేల దాకా గౌరవ వేతనం ఇవ్వాలని స్టేట్ వైడ్ వాలంటీర్ల అసోసియేషన్ కోరుతోంది. ఈ మేరకు కూటమి మంత్రులు అందరినీ కలసి వినతులు చేస్తున్నారు.

అయితే వాలంటీర్లను అన్యాయం చేయమని ప్రభుత్వం చెబుతోంది కానీ వారిని పూర్వం పద్ధతిలో కొనసాగించాలని ప్రభుత్వానికి అయితే లేదు అని అంటున్నారు. పైగా పది వేల రూపాయలు వంతున నెలకు చెల్లిస్తూ రెండున్నర లక్షల మందిని పోషించడం అంటే ఏడాదికి వేల కోట్లు ఖర్చు అని కూడా ఆలోచిస్తున్నారు. ఇంతకీ వాలంటీర్లు చేసే పౌర సేవలు ప్రత్యేకంగా ఏమి ఉన్నాయో అవి సచివాలయ సిబ్బందితో కూడా చేయించుకోవచ్చు.

మరి గత ప్రభుత్వం వారిని ఎందుకు కొనసాగించింది అంటే తమ రాజకీయం కోసం వాడుకోవడానికి అని ఒక వాదన ఉంది. దాంతోనే కూటమి సర్కార్ అలా చేయకూడదని భావిస్తోంది. పైగా ప్రతీ యాభై ఇళ్ళకు వాలంటీర్లను పెట్టి ఎందుకు ఖర్చు భరించాలని కూడా ఉంది. ఈ విషయం అయితే స్పష్టంగా చెప్పలేకపోతున్నా వాలంటీర్లు అంటే ఒక అవ్యవస్థ అన్నది మాత్రం అంటున్న నేపథ్యం ఉంది.

మరో వైపు ప్రజలు కూడా ఈ వ్యవస్థ కొనసాగించాలని ఏమీ అనడం లేదు. వృద్ధులకు పెన్షన్లు సక్రమంగా గత రెండు నెలలుగా ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా చెల్లిస్తూ వచ్చింది ఇక మీదట అదే విధానం కొనసాగుతుంది. మరి వాలంటీర్లను ఎలా సంతృప్తి పరచడం అన్నది పెద్ద ప్రశ్న. వారు రెండున్నర లక్షల మంది ఉన్నారు. వారి వెనక నలుగురు కుటుంబ సభ్యులు అనుకున్నా పది లక్షల మంది అవుతారు. ఇది బిగ్ నంబర్ గానే ఉంది.

దాంతో మంత్రులు కూడా ఏమీ చెప్పలేక తలో మాటా చెబుతున్నారు. తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర అయితే వాలంటీర్ల సేవలను తాము సక్రమంగా ఉపయోగించుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలా కాకుండా వారికి సరైన ఉపాధి శిక్షణ ఇప్పిస్తామని అంటున్నారు.

వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇప్పిస్తామని ఆ విధంగా వారికి జీవితంలో సక్రమంగా స్థిరపడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అంటే వాలంటీర్లకు ఇదివరకూ మాదిరిగా ఇంటింటికీ తిరిగి పౌర సేవలు అందించే డ్యూటీ అయితే ఇవ్వరన్న మాట. అంతే కాదు వారికి శిక్షణ అంటే ముందు అక్కడ వారు తగిన తర్ఫీదు పొందాలన్న మాట. ఆ మీదట వారికి ప్రభుత్వ రంగంలో కాకపోయినా ప్రైవేట్ రంగంలో అయినా ఉపాధి అందేలా మార్గం ఏర్పడుతుందని భావిస్తున్నారు అని అంటున్నారు.

మరి ఇది వాలంటీర్లకు నచ్చుతుందో లేదో చూడాలి. పైగా ఇపుడు శిక్షణ అని వారిని ఏ వేతనం లేకుండా కొన్నాళ్ళ పాటు ఉంచుతామంటే ఎంతమంది ముందుకు వస్తారో చూడాలి. ఏది ఏమైనా వాలంటీర్ల విషయంలో తొందరలోనే ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. అది వారికి నచ్చితే ఓకే లేకపోతే వాలంటీర్లు వారికి నచ్చిన జీవితం చూసుకోవడమే. ప్రభుత్వం తాము ఏమి చేయాలనుకుంటుందో చేస్తుంది తప్ప వారు డిమాండ్ చేసినట్లుగా చేయలేదు కదా అన్నది కూడా మరో మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News