ఆ ఘాటు విమర్శలు...పవన్ ని చుట్టుముడుతున్నాయా ?

అప్పటి వైసీపీ ప్రభుత్వం మీద ఆయన సంచలన వ్యాఖ్యలే చేశారు. ఒక దశలో తీవ్ర విమర్శలు కూడా ఆయన నోటింట వచ్చాయి

Update: 2024-06-29 01:30 GMT

జనసేనాని గా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలలో చాలా విమర్శలు చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం మీద ఆయన సంచలన వ్యాఖ్యలే చేశారు. ఒక దశలో తీవ్ర విమర్శలు కూడా ఆయన నోటింట వచ్చాయి. అవి వివాదాస్పదం అయ్యాయి కూడా.

అందులో ప్రముఖమైనది ఏపీలో 30 వేలకు పైగా మహిళలు యువతులు మిస్సింగ్ అన్నది ఇది అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. వీరంతా కనబడడం లేదని పవన్ చెప్పుకొచ్చారు. ఏపీలోనే అతి పెద్ద మిస్సింగ్ కేసులు చోటుచేసుకున్నాయని ఆయన అన్నారు. విమెన్ ట్రాఫికింగ్ అని కూడా ఆయన కామెంట్స్ చేశారు.

ఇదంతా తనకు కేంద్ర నిఘా సంస్థలతో పాటు ఉన్నత స్థాయి వర్గాల నుంచి చాలా విశ్వసనీయమైన సమాచారంగా వచ్చిందని పవన్ చెప్పారు. గత ఏడాది వారాహి యాత్ర గోదావరి జిల్లాలలో జోరుగా సాగే సమయంలో పవన్ చేసిన ఈ కామెంట్స్ అధికార వైసీపీని ఒక కుదుపు కుదిపాయి.

కేంద్ర ప్రభుత్వంలో పవన్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నందువల్ల ఆయన చెప్పినది నిజం అని నమ్మిన వారూ ఉన్నారు. అయితే అలాంటిది ఏమీ లేదని నాటి వైసీపీ ప్రభుత్వం కొట్టి పారేసింది. మంత్రులు వరసబెట్టి మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ ని విమర్శించారు. అయితే ఈ విమర్శలకు జనసేన కట్టుబడి ఉన్నట్లుగానే తరువాత రోజులలో చేసిన ప్రకటనలు తెలియచేశాయి.

మొత్తానికి విపక్షంలో ఉన్నపుడు అనేక రకాలైన ఆరోపణలు వస్తూంటాయి కానీ కొన్ని తీవ్రమైన ఆరోపణలు మాత్రం అటు ప్రజలకూ ఇటు రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వారికీ గుర్తుండిపోతాయి. ఈ నేపధ్యంలో పవన్ ఇపుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన చేతిలో సర్వాధికారాలు ఉన్నాయి.

దాంతో గతంలో పవన్ చేసిన ముప్పై వేల మంది మహిళల మిస్సింగ్ కేసుని బయటకు తీయమని సోషల్ మీడియా వేదికగా పోస్టింగులు పెడుతున్న జనాలు ఉన్నారు. అలాగే ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏపాల్ లాంటి వారు ఇప్పటికి అనేక సార్లు ఇదే విషయం ప్రస్తావించారు.

పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి మిస్సింగ్ కేసులను ఆయన చేదించాలని కోరారు. ఆ విధంగా చేయడం ద్వారా ఏపీలో ముప్పై వేల మంది మహిళలు, యువతులకు సంబంధించి వారి కుటుంబాలలో వెలుగులు నింపాలని కోరుతున్నారు. నిజంగా ఈ కేసులు చూడాల్సింది హోం శాఖ. పవన్ డిప్యూటీ సీఎం కూటమి ప్రభుత్వంలో ఆయన కీలకం కాబట్టి ఆయనే చొరవ తీసుకుంటే ఈ భారీ మిస్సింగ్ కేసుల వ్యవహారం వెలుగు చూస్తుందని అంతా అభిప్రాయపడుతున్నారు.

అదే విధంగా విమెన్ ట్రాఫికింగ్ ఏపీలో పెద్ద ఎత్తున గత అయిదేళ్ళుగా సాగింది అని జనసేన ఆనాడు చేసిన ఆరోపణల మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ విషయంలో కనుక పవన్ చొరవ చూపిస్తే కచ్చితంగా ఆయన ఆనాడు చేసిన ఆరోపణలకు విలువ ఉంటుందని అంటున్నారు. అంతే కాకుండా ఏపీలో మిస్సింగ్ కేసులు కూడా ఒక కొలిక్కి వస్తాయని అంటున్నారు.

పవన్ అయితే తనకు అప్పగించిన శాఖల పట్లనే పూర్తిగా ఫోకస్ పెడుతున్నారు. ఆయన వాటి లోతుల్లోకి వెళ్తున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన జోక్యం చేసుకోవడం లేదు. ఆ శాఖకు మంత్రి ఉన్నారు కాబట్టి ఆమె ఆ బాధ్యతలను చూస్తారు అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం కాబట్టి పవన్ తాను స్వయంగా చేసిన ఆరోపణల నిగ్గు తీసి అసలు నిజాలు జనాల ముందు ఉంచాల్సిన బాధ్యత ఉందని అంటున్నారు. మరి దీని మీద పవన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News