ఏపీలో పెరిగిన మహిళల ఓటింగ్... తెరపైకి ఆసక్తికర విశ్లేషణ!
అంటే పురుషుల ఓట్లు కీలకం కాదని కాదు కానీ.. మహిళల ఆలోచన కాస్త సున్నితంగా ఉంటుందని, ప్రలోభాలకు లొంగే బలహీనతా తక్కువగా ఉంటుందని చెబుతుంటారు.
ఆంధ్రప్రదేశ్ లో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చిన సంగతి తెలిసిందే. సుమారు సోమవారం అర్ధరాత్రి 2 గంటలవరకూ కూడా పోలింగ్ నడిచిందని ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా చెబుతున్న పరిస్థితి! ఈ ఎన్నికల పోలింగ్ లో భారీ ఎత్తున మహిళా ఓటర్లు తరలివచ్చి ఓటేయడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. వీరి ఓటు ఎవరిబలం అనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... ఏ ఎన్నికల్లో అయినా మహిళల ఓట్లు అత్యంత కీలకం అని చెబుతుంటారు. అంటే పురుషుల ఓట్లు కీలకం కాదని కాదు కానీ.. మహిళల ఆలోచన కాస్త సున్నితంగా ఉంటుందని, ప్రలోభాలకు లొంగే బలహీనతా తక్కువగా ఉంటుందని చెబుతుంటారు. దీంతో... ఏపీలో పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు క్యూ కట్టడం ఇటు అధికార వైసీపీకి బలంగా మారిందా.. లేక, కూటమికి మద్దతుగా మారబోతోందా అనేది ఆసక్తిగా మారింది.
ఏపీలో గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తమ సంక్షేమ పథకాలన్నింటినీ దాదాపుగా మహిళా కేంద్రంగా మార్చేసింది. డీబీటీలు, ఇంటి పట్టాలతోపాటు.. అమలు చేసిన పథకాలన్నీ గరిష్టంగా మహిళల పేరు మీదకు మార్చేసింది! దీంతో ఐదేళ్ల పాటు పథకాల డబ్బులన్నీ మహిళల ఖాతాల్లో చేరడం, వారికి జగన్ పై కృతజ్ఞతా భావం ఏర్పడిందని చెబుతున్నారు. దీంతో... కులమతాలకు అతీతంగా మహిళల గుండెల్లో జగన్ కు ప్రత్యేక స్ధానం కల్పించేలా చేసిందని అంటున్నారు.
మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన ఎన్డీయే కూటమి... అప్పటివరకూ వైసీపీకి అనుకూలంగా మారిన మహిళా ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునే లక్ష్యంతోనే సూపర్ సిక్స్ పథకాలను రూపొందించింది! ముఖ్యంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఇప్పటికే జగన్ అమలులోకి తెచ్చిన అమ్మఒడి పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ ఇస్తమని చెప్పడంతో పాటు ఏటా మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితం వంటి పథకాలు తెచ్చింది. దీంతో... వీటికి కూడా ఓవర్గం మహిళా లోకం ఆకర్షితులు అయ్యి ఉండొచ్చని చెబుతున్నారు.
ఈ విధంగా మహిళా ఓటర్లు ఆకర్షించడంలో వైసీపీ, కూటమి.. పోటాపోటీగా వ్యవహరించాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే... పోలింగ్ రోజు మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు వేయడానికి తరలిరావడం జరిగిందని అంటున్నారు. మరి వీరంతా ఇప్పటివరకూ జగన్ చేసిన, రేపు చేయబోతున్నట్లు చెబుతున్న పథకాలకు ఆకర్షితులై ఇలా పోటెత్తారా.. లేక, సూపర్ సిక్స్ ని నమ్మి వచ్చారా అనేది తెలియాలంటే జూన్ 4వరకూ వేచి చూడాలి!