ఏపీలో మంత్రులు ఉన్నారా ?

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన కూడా ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారు అని అంటున్నారు.

Update: 2024-09-19 20:30 GMT

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి వంద రోజులు అయింది. చంద్రబాబు తో పాటు ఇరవై నాలుగు మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఇందులో చంద్రబాబు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ నారా లోకేష్ అలాగే మరో ఇద్దరు ముగ్గురు తప్పిస్తే మంత్రులు ఎవరు అన్నది జనాలకు తెలియడం లేదని అంటున్నారు.

ఈసారి చంద్రబాబు కొత్త ప్రయోగం చేశారు. చాలా మంది కొత్తవారిని మంత్రులుగా చేశారు. దాంతో వారంతా తమ పనితీరుతో జనంలో ఇంకా రిజిస్టర్ కాలేదు. వంద రోజుల పాలన పూర్తి అయిన సందర్భంగా చూస్తే ఏపీలో మంత్రులు ఉన్నారా అన్న చర్చ ముందుకు వస్తోంది. అదే విధంగా ఏపీలో మంత్రులు పనిచేస్తున్నారా అన్నది కూడా మరో ప్రశ్నగా ఉంది.

చాలా మంది మంత్రులు జనాలకు తెలియదు అని అంటున్నారు. ఎందుకంటే వారి శాఖలు ఏమిటో వారు ఏమిటో కూడా ప్రజలకు తెలియదన్నది ఒక విధంగా ఆశ్చర్యం అయినా అదే నిజం అంటున్నారు. ఇక ఏపీలో మంత్రుల లిస్ట్ చూస్తే హోం మంత్రి వంగలపూడి అనిత, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తప్పించి ఎవరి పేర్లూ కూడా వినిపించడం లేదు అని అంటున్నారు.

జనసేన నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. అందులో పవన్ ఎటూ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తరువాత నాదెండ్ల మనోహర్ కీలకమైన పౌర సరఫరాల శాఖకు మంత్రిగా ఉన్నారు. పర్యాటక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ ఉన్నారు. మరి నాదెండ్ల దుర్గేష్ ల వాయిస్ కూడా పెద్దగా ఈ వంద రోజుల పాలనలో ఎక్కడా వినిపించలేదని అంటున్నారు. దాని కంటే ముందు వారికి పవర్స్ ఏమీ లేవు అన్న చర్చ కూడా సాగుతోంది.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన కూడా ఎక్కువ సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ జాయింట్ మీటింగ్ ఉంటే తప్పించి పెద్దగా కనిపించడం లేదు అని అంటున్నారు. మరో వైపు బీజేపీ నుంచి ఒక మంత్రికి చాన్స్ ఇచ్చారు. ఆయనే సత్యకుమార్. కానీ ఆ పార్టీ నుంచి ఎవరు మంత్రి అన్నది గూగుల్ లోనే సెర్చ్ చేయాలని అంటున్నారు.

ఎందుకు ఇదంతా అంటే మంత్రులలో అత్యధిక శాతం కొత్తవారు. పైగా వారికి శాఖల మీద పట్టు దొరకలేదు, అవగాహన కూడా సంపాదించాలి అని అంటున్నారు. దాంతోనే మంత్రుల పనితీరు మీద చంద్రబాబు ప్రొగ్రెస్ రిపోర్టుని తయారు చేస్తున్నారు అని అంటున్నారు.

మరి పనితీరు మార్చుకోవాలని మార్కులు తక్కువ వచ్చిన వారికి సూచిస్తారా లేక ఇంకా ఏమైనా వేరే నిర్ణయం తీసుకుంటారా అన్నది తెలియదు కానీ మంత్రుల పనితీరు మీద కూటమి పెద్దలలో సైతం కొంత అసంతృప్తి ఉందని అంటున్నారు. నిజానికి టీడీపీ ప్రభుత్వం అంటే ఎంతో అనుభవం కలిగిన మంత్రులు ఎపుడూ కేబినెట్ లో కనిపిస్తూ ఉంటారు.

అలాగే జనాలకు దశాబ్దాలుగా తెలిసిన వారు కూడా ఉంటారు. కానీ ఈసారి అతి కీలకమైన పోర్టు ఫోలియోలలో కూడా కొత్త వారికి చాన్స్ ఇచ్చారు. ఏపీలో కీలకంగా వ్యవహరించాల్సిన ఈ మంత్రులు ఎంతవరకూ తమ బాధ్యతలను నెరవేర్చారు అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. దాంతోనే కూటమి ప్రభుత్వం లో ఒకరిద్దరే ఎలివేట్ అవుతున్నారు తప్ప మిగిలిన మంత్రులేరీ అన్నది పెద్ద ప్రశ్నగా ముందుకు వస్తోంది.

Tags:    

Similar News