వైసీపీని పంచేసుకుంటున్నారా ?
ఉమ్మడి ప్రత్యర్థిగా వైసీపీని కూటమిలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు పంచేసుకుంటున్నాయని అంటున్నారు.
ఏపీలో రాజకీయం చిత్రంగా సాగుతోంది. అధికారంలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి. విపక్షంలో వైసీపీ ఉంది. ఉమ్మడి ప్రత్యర్థిగా వైసీపీని కూటమిలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు పంచేసుకుంటున్నాయని అంటున్నారు. ఒక వ్యూహం ప్రకారమే వైసీపీని బలహేనం చేసే ఎత్తుగడ సాగుతోంది.
గ్రౌండ్ లెవెల్ లో నాయకులు ఇష్టపడితే టీడీపీలోకి చేరికలు జోరు అందుకుంటున్నాయి. అలా కాదు కూడదు అంటే పక్కన పెడుతున్నారు. లేకపోతే ఆల్టర్నేషన్ గా కూటమిలోని మిగిలిన పార్టీలను చూపిస్తున్నారు. విశాఖ జిల్లా విషయానికి వస్తే అంగబలం అర్ధం బలం విశేషంగా ఉన్న విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ టీడీపీలో చేరాలని చూశారు.
అయితే టీడీపీ తమ్ముళ్లు వ్యతిరేకించారు అన్న ప్రచారం సాగింది. దాంతో బీజేపీ ఆడారి కుటుంబాన్ని సాదరంగా ఆహ్వానించి అక్కున చేర్చుకుంది. అలా ఆడారి కూటమిలో భాగం అయిపోయారు. ఇదే విధంగా జనసేనలో చేరేందుకు కూడా నేతలు చూస్తున్నారు.
తాజాగా చూస్తే గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన గంజి చిరంజీవి టీడీపీకి చెందిన నాయకుడే. 2014లో పోటీ చేసి కేవలం 12 ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. 2019లో అక్కడ నుంచి నారా లోకేష్ పోటీ చేశారు. దాంతో చిరంజీవికి టికెట్ దక్కలేదు. 2024లో కూడా మరోసారి లోకేష్ పోటీకి సిద్ధపడడంతో చిరంజీవి వైసీపీలో చేరారు. అయితే ఎన్నికల ముందు ఆయనకు టికెట్ దక్కలేదు. మహిళా అభయ్ర్ధిని అక్కడ నుంచి వైసీపీ తరఫున పోటీకి పెట్టారు. దాంతో గంజి చిరంజీవి జనసేనలోకి చేరిపోయారు.
అదే విధంగా ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ ఆ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరీ జనసేనలో చేరారు. ఆయన కూడా టీడీపీకి చెందిన వారే. ఆయన 2024 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. అయితే ఆయనకు టికెట్ దక్కలేదు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే ఇపుడు ఆ పదవి వద్దు అని ఆయన జనసేన గూటికి వచ్చారు. ఆయనకు టీడీపీలో చాన్స్ దక్కలేదని అందుకే జనసేనను ఎంచుకున్నారు అని అంటున్నారు.
ఈ విధంగా చూస్తే ఒక పద్ధతి ప్రకారం మూడు పార్టీల మధ్యనే వైసీపీ నాయకుల చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఒక పార్టీలో చేరితే అదంతా ఆ పార్టీ కోరి చేయిస్తోంది అన్న అపవాదు వస్తుంది. అందుకే మూడు పార్టీలలోనూ నేతలు సర్దుకునేలా వ్యూహరచన చేస్తున్నారు అని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లోనూ కూటమిలో ఈ మూడు పార్టీలు కలసి పోటీ చేస్తాయి కాబట్టి ఎందులో నాయకులు ఉన్నా ఇబ్బంది లేదన్నట్లుగా ఈ వ్యూహం ఉందని అంటున్నారు. అంతే కాదు వైసీపీని ఏపీలో నిర్వీర్యం చేస్తే విపక్షంలో భారీ ఎత్తున పొలిటికల్ వ్యాక్యుం ఉంటుందని అపుడు అందులోకి ఎమర్జ్ కావచ్చు అన్నది కూడా జనసేన బీజేపీ ఎత్తుగడగా ఉన్నాయి.
అయితే ప్రస్తుతానికి వైసీపీతోనే మూడు పార్టీలకు రాజకీయ వైరం ఉన్నందువల్ల ఆ పార్టీని ఎలిమినేట్ చేసేందుకు చూస్తున్నాయని అంటున్నారు. ఏపీలోనూ కేంద్రంలోనూ మూడు పార్టీలే అధికారంలో ఉన్నాయి. దాంతో పాటు మరో నాలుగున్నరేళ్ల దాకా విపక్షంలో ఉంటూ కేసులను ఎదుర్కొంటూ రాజకీయ పోరాటం చేయడం బహు కష్టంగా మారుతోంది. దాంతో కూటమి పార్టీల ట్రాప్ లో వైసీపీ నేతలు సులువుగానే చిక్కుతున్నారు అని అంటున్నారు. మరి వైసీపీ ఈ ముప్పేట దాడిని ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది.