వృద్ధాప్యంలో ఉన్న పేరెంట్స్‌ ను నిర్లక్ష్యం చేస్తున్నారా... ఇదొకసారి చదవండి!

ఇదే సమయంలో వృద్ధాప్యం అనేది ఎవరి జీవితంలోనైనా అత్యంత సున్నితమైన దశ అని.. ఆ సమయంలో వృద్ధ తల్లిదండ్రులు మీ నుంచి సంరక్షణను కోరుకునేటప్పుడు, మంచి ఆరోగ్యాన్ని, ఉన్నత జీవన ప్రమాణాలను, వారికి అవసరమైన ప్రేమ గౌరవాలను అందించడానికి కట్టుబడి ఉండాలంటూ ఆయన అప్పీల్ చేస్తున్నారు.

Update: 2023-11-04 11:30 GMT

అనాదాశ్రమాల్లో వృద్ధ తల్లితండ్రుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుందని వార్తలు వింటుంటాం. ఇదే సమయంలో తల్లితండ్రులను రోడ్లపైన వదిలిపెట్టే పుత్రరత్నాలనూ చూస్తుంటాం! తల్లిని ఇంటికి పిలిచి నాలుగు రోజులు చూసుకునే కూతుళ్లు, తండ్రిని పెద్దవయసులో అక్కున చేర్చుకునే కొడుకుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని అంటున్నారు పోలీసులు.

అవును... తల్లితండ్రులను అశ్రద్ధ చేయడం, ఆస్తులు రాయాలని బలవంతం పెట్టడం, రాయలేదని వేధించడం, రాసిన తర్వాత నిర్లక్ష్యం చేయడం, మానసికంగా వేధించడం... సమస్య ఏదైనా శిక్ష తప్పదని అంటున్నారు పోలీసులు. ఈ మధ్యకాలంలో ఈ టైపు కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుందని.. ఫలితంగా ఇదో పెద్ద సమస్యగా పరిణమిస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఫలితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

తల్లితండ్రులు, వృద్ధులు, వయో వృద్ధులను.. వారి కుటుంబాలు, పిల్లలు చూసుకోకపోవడం, వారిని మానసికంగా వేధించడం చేయడం మొదలైనటువంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇటీవల బాగా పెరిగిపోతోంది. అయితే... ఇలాంటి విషయాలపై గతంలోనే చట్టాలు తయారయ్యాయి. అందులో భాగంగా... తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం - 2007 కింద తల్లితండ్రుల, వృద్ధుల సంరక్షణ, రక్షణపై ఆయా కుటుంబ సభ్యులు కచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

అలాకానిపక్షంలో తల్లితండ్రులు ఫిర్యాదు చేయవచ్చు. ఈ సమయంలో ఆ తల్లితండ్రులు, వృద్ధులు చేసిన ఆరోపణలపై ప్రాథమిక ధృవీకరణ చేయడానికి, అవసరమైన చర్య తీసుకోవాలని అభ్యర్థనతో ఆర్డీవో అధ్యక్షతన ఉన్న ట్రిబ్యునల్ ఒక నివేదికను పంపడం, ట్రిబ్యునల్‌ ను ఆశ్రయించేలా ఫిర్యాదుదారుని మార్గనిర్దేశం చేయడం చేస్తారు. దీనిపై ట్రిబ్యునల్ పక్కాగా విచారణ చేపడుతుంది.

ఈ క్రమంలో సదరు పిల్లలు ఆ తల్లితండ్రులను, సీనియర్ సిటిజన్లను కావాలనే ఇబ్బందిపెడుతున్నారు, పథకం ప్రకారమే నిర్లక్ష్యం చేస్తున్నారు వంటి విషయాలు నిరూపణ అయితే మాత్రం... తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం - 2007 ప్రకారం మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 5 వేల జరిమానా విధిస్తారు.

ఇక ఈ తరహా ఫిర్యాదులు ఇటీవల కాలంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఇటీవల నగరంలో పోలీస్ కమిషనర్ కి స్పందన కార్యక్రమంలో ఎక్కువగా వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణను వారి పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నారు అనే అంశంపైనే ఫిర్యాదులు ఎక్కువగా పునరావృతం అయ్యాయట. దీంతో సున్నితమైన వ్యవహారంపై కమిషనర్ చాలా అవేదన చెందారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ తరహా కేసులను నగర పోలీసు కమీషనర్ స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించారని తెలుస్తుంది. ఇదే సమయంలో వృద్ధాప్యం అనేది ఎవరి జీవితంలోనైనా అత్యంత సున్నితమైన దశ అని.. ఆ సమయంలో వృద్ధ తల్లిదండ్రులు మీ నుంచి సంరక్షణను కోరుకునేటప్పుడు, మంచి ఆరోగ్యాన్ని, ఉన్నత జీవన ప్రమాణాలను, వారికి అవసరమైన ప్రేమ గౌరవాలను అందించడానికి కట్టుబడి ఉండాలంటూ ఆయన అప్పీల్ చేస్తున్నారు.

ఇదే సమయంలో... వృద్ధ తల్లిదండ్రులను వారి కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేసినా.. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టినా.. చట్టప్రకారం తగు చర్యలు తీసుకోబడతాయని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ఇబ్బందులకు గురైతే సిటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ వాట్సప్ నంబర్ 94933 36633 కు, లేదా పోలీసు హెల్ప్ లైన్ 112 లేదా నేషనల్ సీనియర్ సిటిజన్స్ హెల్ప్ లైన్ నంబర్ 14567 కు తెలియజేయాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News