కేజ్రీవాల్‌ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపడం వీలవుతుందా?

అయితే కేజ్రీవాల్‌ అరెస్టు అయినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగుతారని ఆప్‌ ఇప్పటికే ప్రకటించింది

Update: 2024-03-24 06:07 GMT

మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎనఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ కస్టడీని మార్చి 29 వరకు కోర్టు పొడిగించింది.

అయితే కేజ్రీవాల్‌ అరెస్టు అయినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగుతారని ఆప్‌ ఇప్పటికే ప్రకటించింది. జైలు నుంచే ఆయన తమకు ఆదేశాలు ఇస్తారని ఢిల్లీ ఆర్థిక శాఖ మంత్రి ఆతిషి ప్రకటించారు. మరోవైపు కేజ్రీవాల్‌ పంపిన వీడియో సందేశాన్ని ఆయన భార్య మీడియా సాక్షిగా వెల్లడించారు. మరోవైపు బీజేపీ కేజ్రీవాల్‌ పై సెటైర్లు వేస్తోంది. మాఫియా గ్యాంగులే జైలు నుంచి తమ కార్యకలాపాలను ఆపరేట్‌ చేస్తాయని.. ఇప్పుడు ఆ కోవలో కేజ్రీవాల్‌ కూడా చేరిపోయారని కౌంటర్‌ ఇస్తోంది.

కాగా రెండేళ్ల జైలుశిక్ష పడితే తప్ప ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉండటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని న్యాయనిపుణులు చెబుతున్నారు. జైలు నుంచి పరిపాలన చేయకూడదని రాజ్యాంగంలో ఎలాంటి నిబంధనలు లేవంటున్నారు. ముఖ్యమంత్రి జైలు పాలయితే పరిపాలనకు సంబంధించి రాజ్యాంగంలో ప్రత్యేక ప్రస్తావనలేమీ లేవని పేర్కొంటున్నారు. దీంతో అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ మద్యం కుంభకోణంలో నేరస్తుడిగా తేలే వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండటానికి ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చు.

లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టయిన తర్వాత కేజ్రీవాల్‌ తొలిసారి సీఎం హోదాలో ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలోని జల మంత్రిత్వ శాఖకు నోట్‌ ద్వారా సీఎం ఆదేశాలిచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆదేశాలకు సంబంధించి పూర్తి వివరాలను ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి మీడియాకు వెల్లడించనున్నారు.

మరోవైపు ఈడీ కేసులో కోర్టు కేజ్రీవాల్‌ ను జైలుకు పంపితే అక్కడి నుంచి ఆయన ప్రభుత్వాన్ని నడిపేలా సీఎం తాత్కాలిక ఆఫీస్‌ ను ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరతామని ఆప్‌ నేత, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ తెలిపారు. ఆప్‌లో కేజ్రీవాల్‌ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని చెప్పారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపకూడదనే నిబంధన ఏదీ లేదన్నారు.

జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా కోర్టు కేజ్రీవాల్‌ ను జైలుకు తరలిస్తే అక్కడి నుంచే సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తారని భగవంత్‌ మాన్‌ తేల్చిచెప్పారు. దోషిగా తేలనంత వరకూ చట్ట ప్రకారం ఆయన జైలు నుంచి కూడా పనిచేయవచ్చన్నారు. అందుకే ఆఫీస్‌ కోసం సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుల అనుమతి కోరతాం అని తెలిపారు.

అయితే జైలు నుంచి కేజ్రీవాల్‌ పాలన సాగించడం సాధ్యమయ్యేది కాదని రాజ్యాంగ నిపుణుడు, లోక్‌ సభ మాజీ సెక్రటరీ జనరల్‌ పీడీటీ ఆచారి చెబుతున్నారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపటం కష్టమంటున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన చాలా సమావేశాలకు సీఎం నేరుగా అధ్యక్షత వహించాల్సి ఉంటుందని అంటున్నారు. అలాగే వివిధ అంశాలపైన ఫైళ్లను తనిఖీ చేయాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ రోజువారీ విధులను, పనితీరును పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా సీఎం హోదాలో కేజ్రీవాల్‌ కు ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జైలు నుంచి ఈ అధికారాలన్నింటిని ఆయన ఎలా వినియోగించుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

జైలు నుంచే సీఎంగా కొనసాగుతానని కేజ్రీవాల్‌ అంటే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ఖాయమని అంటున్నారు. సాధారణంగా సీఎంలు అరెస్టు అయితే మరొకరిని సీఎంను చేస్తారని చెబుతున్నారు. ఉదాహరణకు జార్ఖండ్‌ లో సీఎంగా ఉన్న హేమంత్‌ సోరెన్‌ ను అరెస్టు చేస్తే చంపయి సోరెన్‌ ను సీఎంను చేశారని గుర్తు చేస్తున్నారు. ఢిల్లీలో సీఎం మార్పు తప్పక పోవచ్చని అంటున్నారు.

అయితే సీఎంలు అరెస్టు అయితే.. వారు రాజీనామా చేయాలా వద్దా? ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమిటనే అంశాలపై రాజ్యాంగంలో ప్రత్యేక ప్రస్తావనలు ఏమీ లేవు అని అంటున్నారు. నేరానికి పాల్పడినవారు, ఏ కేసులో అయినా దోషులుగా తేలినవారు సీఎం పదవికి అర్హులు కారని రాజ్యాంగంలో ఉందని చెబుతున్నారు. ప్రస్తుతానికి కేజ్రీవాల్‌ పై ఉన్నవి ఆరోపణలు మాత్రమే. అవి నిరూపితమయితే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయకతప్పదు. అయితే జైలు నుంచి పాలించడం అంత సులువు కాదని అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి సీఎం సంతకం కావాలంటే ప్రతిసారీ జైలుకెళ్లాల్సి ఉంటుందని.. ఇందుకు ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ సీఎం రేసులో ఆప్‌ నేత ఆతిశి, కేజ్రీవాల్‌ సతీమణి సునీత పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News