ఢిల్లీలో హైటెన్షన్: మోడీ-కేజ్రీవాల్.. మధ్యలో 'స్వాతి మంటలు'
స్వాతి చినుకులు.. గురించి తెలుసు కానీ.. స్వాతి మంటల గురించి.. తెలుసుకోవాలంటే మాత్రం.. ఢిల్లీ రాజకీయాలు చూడాల్సిందే
స్వాతి చినుకులు.. గురించి తెలుసు కానీ.. స్వాతి మంటల గురించి.. తెలుసుకోవాలంటే మాత్రం.. ఢిల్లీ రాజకీయాలు చూడాల్సిందే. ప్రధాని మోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ,ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మధ్య రాజకీయం రగులుతున్న విషయం తెలిసిందే. తనను జైలుకు పంపించడం.. ఎన్నికల వేళ ప్రచారం చేయకుండా అడ్డుకోవడంపై రగిలిపోతున్న కేజ్రీవాల్.. ప్రధానిపై విరుచుకుపడుతున్నారు. మరోవైపు.. ఈ నెల 25న ఢిల్లీలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య అంటే.. ఆప్-బీజేపీ, మోడీ-కేజ్రీవాల్ మధ్య రాజకీయ సమరం జోరుగా సాగుతోంది. ఇంతలో కేజ్రీవాల్ పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యురాలు.. స్వాతి మాలివాల్.. రేపిన రచ్చ..ఇప్పుడు మరింతగా మంటలు రాజేసింది. ఆప్ ఎంపీ అయినా.. స్వాతి మాలివాల్‌ను సీఎం కేజ్రీవాల్ పీఏ.. బిభవ్ కుమార్ దూషించి.. భౌతిక దాడి చేశారన్న ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. ఈ విషయంలో వెంటనే స్పందించిన బీజేపీ నాయకులు.. ఈ విషయాన్ని మరింత పెద్దది చేశారు.
ఇక, ఎంపీ స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేజ్రీ పీఏ.. బిభవ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అంతే.. ఈ మంటల సెగ.. ఇప్పుడు రోడ్ల మీదకు ఎక్కింది. సీఎం కేజ్రీవాల్ సహా ఆయన మంత్రి వర్గం.. ఆప్‌నా యకులు అందరూ మూకుమ్మడిగా ఢిల్లీలోని బీజేపీకార్యాలయాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. అయితే..పోలీసులు అడుగడుగునా వీరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, కేజ్రీవాల్‌మాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా.. ఎంత మంది ని అరెస్టు చేస్తారో.. చేసుకోండి.. కానీ, ముందు నన్నే అరెస్టు చేయండి అని సవాల్ రువ్వారు.
దీంతో ఢిల్లీ పోలీసులకు ఏం చేయాలో తెలియనిపరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఢిల్లీలో మెట్రో సేవలను ఆపేశారు. రోడ్డు రవాణాను కొన్ని మార్గాలకు పరిమితం చేశారు. మొత్తంగా పోలీసులు రాజధాని నగరాన్ని తమ స్వాధీనం లోకి తీసుకున్నారు. ఏ క్షణమైనా.. కేజ్రీవాల్‌ను మరోసారి అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక,ఈ సందర్బంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మోడీ.. ఆప్‌ను అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని.. వ్యాఖ్యానించారు. కానీ, తాము భయపడేది.. వెనుదిరిగేదీ లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ నివురుగప్పిన నిప్పుగా మారింది.