మజ్లిస్ రూటు సపరేటు.. మేనిఫెస్టో ఉండదంతే

రాజకీయ పార్టీ అన్నంతనే విధి విధానాలు.. తమ చేతికి అధికారం వస్తే.. తామేం చేస్తామో భారీగా చెబుతుంటాయి

Update: 2023-10-20 04:21 GMT

రాజకీయ పార్టీ అన్నంతనే విధి విధానాలు.. తమ చేతికి అధికారం వస్తే.. తామేం చేస్తామో భారీగా చెబుతుంటాయి. దేశంలోని రాజకీయ పార్టీలకు భిన్నంగా వ్యవహరించే ధోరణి మజ్లిస్ లో కనిపిస్తుంది. సాధారణంగా ఎన్నికల బరిలోకి దిగే ఏ రాజకీయ పార్టీ అయినా తాము ప్రజలకు ఏమేం చేస్తామో పెద్ద ఎత్తున చెప్పుకుంటారు. ఇందులో భాగంగా మేనిఫెస్టోను విడుదల చేస్తుంటారు. కానీ.. మజ్లిస్ రూటు సపరేటు.

అసలు మేనిఫెస్టో అన్న మాటే లేకుండా ఎన్నికల బరిలోకి దిగే రాజకీయ పార్టీగా మజ్లిస్ ను చెప్పాలి. సుదీర్ఘ కాలంగా వివిధ ఎన్నికల్లో పోటీ చేయటమే కాదు.. కొన్ని నియోజకవర్గంలో ఆ పార్టీ తప్పించి.. మరే పార్టీ గెలవలేని రీతిలో తన సత్తా చాటే మజ్లిస్ ప్రత్యేకత ఏమంటే.. ఇప్పటివరకు ఆ పార్టీ మేనిఫెస్టోనే విడుదల చేయలేదు. హైదరాబాద్ మహానగరంలోని ఏడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ తప్పించి మరే పార్టీ గెలవదన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి.

తాజాగా తెలంగాణ.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న మజ్లిస్.. ఎలాంటి మేనిఫెస్టో లేకుండానే దిగటం గమనార్హం. ప్రాంతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న ఈ పార్టీ మిగిలినరాజకీయ పక్షాలకు భిన్నంగా ఎలాంటి మేనిఫెస్టోనే విడుదల చేయదు. హైదరాబాద్ మహానగరంలోని పాత బస్తీ కేంద్రంగా ఎన్నికల బరిలోకి దిగే ఆ పార్టీ.. తర్వాతి కాలంలో మైనార్టీ ఓటు బ్యాంకు లక్ష్యంగా తన అభ్యర్థుల్నిబరిలోకి దింపుతుంటుంది.

తెలంగాణలోని హైదరాబాద్ తర్వాత మహారాష్ట్రతో పాటు.. బిహార్ అసెంబ్లీలోనూ ఆ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే విధంగా కర్ణాటక.. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల్లోనూ ఆ పార్టీకి ప్రాతినిధ్యం ఉండటం గమనార్హం. పార్లమెంటులో ఆ పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. వారిలో ఒకరు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. హైదరాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో ఎంపీగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు ఇంతీయాజ్ జలీల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

96 ఏళ్ల క్రితం నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్ లో 1927లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ గా మొదలైన ఈ ధార్మిక సంస్థ క్రమంగా రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. మీ పార్టీకి మేనిఫెస్టోనే ఉండదే?అని ప్రశ్నిస్తే.. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ మాట్లాడుతూ.. ప్రజల్ని మభ్య పెట్టటానికే మేనిఫెస్టో గా వ్యాఖ్యానించటం గమనార్హం. తాము హామీలు ఇవ్వమని.. పని చేసి గుర్తింపు తెచ్చుకుంటామని చెబుతుంటారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నప్పుడు ఇక మేనిఫెస్టోతో అవసరం ఏమిటి? అనిప్రశ్నించే ధోరణి చూస్తే.. మజ్లిసా మజాకానా? అనుకోకుండా ఉండలేం.

Tags:    

Similar News