లోక్‌సభలో 'జై పాలస్తీనా' నినాదం: ఒవైసీ దడదడ!
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. లోక్‌సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. లోక్‌సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన సభలో ఎంపీగా ప్రకారం చేశారు. ఈ సమయంలో ఆయన ప్రమాణ పత్రం చదివిన తర్వాత.. చివర్లో.. `జై పాలస్తీనా`, `జై తెలంగాణ` నినాదాలు చేయడంతో లోక్‌సభ సభ్యులు ఉలిక్కిపడ్డారు. దీనిపై పెద్దరగడే చోటు చేసుకుంది. బీజేపీ సభ్యులు ఒక్కసారిగా తమ తమ స్థానాల్లో నుంచి లేచి నిలబడి.. అసదుద్దీన్ వ్యాఖ్యలను ఖండించడంతోపాటు సభకు, దేశానికి కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే..బీజేపీ సభ్యుల వాదనలను ఒవైసీ పట్టించుకోకుండా.. తనస్థానంలోకి వెళ్లి కూర్చున్నారు.
అయితే.. పార్లమెంటు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒవైసీ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. జై పాలస్తీనా అనడం సరైందేనని అన్నారు. ఇలా అంటే.. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఎందుకు రావాలని ప్రశ్నించారు. ``నాకు నచ్చిన విషయాన్ని ప్రస్తావించా. దీనిలో దేశానికి వచ్చిన భంగం ఏంటి? ఎవరో అభ్యంతరం చెప్పారని నేను మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి అభ్యంతరాలు వారికి ఉంటాయి. వారి ఇష్టం. నాకు నచ్చింది`` అని సమర్థించుకున్నారు. ఇదేసమయంలో మహాత్మా గాంధీ కూడా..పాలస్తీనా పై సానుకూలంగానే వ్యవహరించారని.. కావాలంటే ఇప్పుడు అభ్యంతరం చెబుతున్నవారు.. చరిత్ర తెలుసుకోవాలన్నారు. కాగా, అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతా వెల్లడించారు.
పాద నమస్కారాలు!
పార్లమెంటు సంప్రదాయాలకు విరుద్ధంగా కొందరు వ్యవహరించడం కూడా.. తాజా సభలో కలకలం రేపింది. ప్రమాణం చేసిన సభ్యులు.. ప్రొటెం స్పీకర్‌కు గౌరవం ప్రకారం నమస్కరిస్తారు. అయితే.. తాజాగా మహారాష్ట్రకు చెందిన సుప్రియా సూలే, తమిళనాడుకు చెందిన కనిమొళి వంటి వారు ప్రమాణ స్వీకారం అనంతరం ప్రొటెం స్పీకర్ స్థానం వద్దకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించారు. దీనిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. సభ సంప్రదాయాల ప్రకారమే సభ్యులు నడుచుకోవాలని గట్టిగానే హెచ్చరించారు. వీటిని కూడా వీడియో రికార్డుల నుంచి తొలగించాలని ఆదేశిస్తున్నట్టు తెలిపారు.