ఏపీలో ‘సోషల్’ అరెస్టుల పరంపర.. తాజాగా ఎవరంటే?
ఒకటి తర్వాత ఒకరి చొప్పున అరెస్టు చేసి.. రిమాండ్ కు పంపుతున్న తీరు ఇప్పుడు కలకలం రేపుతోంది.
ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరెస్టులు రాజకీయ సంచలనానికి తెర తీస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంతనే ప్రతీకార చర్యలు ఉంటాయని.. పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతాయని.. నేరపూరిత వాతావరణంతో పాటు.. హింసాత్మక ఘటనలకు ఏపీ కేరాఫ్ అడ్రస్ గా మారుతుందన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే.. అంచనాలకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తీరుపై తెలుగుదేశం పార్టీ నేతలు.. కార్యకర్తల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. గత ప్రభుత్వం వ్యవహరించిన దానికి ప్రతిగా ప్రతీకారం తీర్చుకోవాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపించాయి.
అయినప్పటికీ.. చంద్రబాబు ప్రభుత్వం పెద్దగా రియాక్టు కాలేదు. దీంతో.. కొత్త ప్రభుత్వం కొలువు తీరినంతనే.. పెద్ద ఎత్తున హింసాత్మక చర్యలు చూడాలనుకున్న వారికి నిరాశకు గురి చేసింది. కొందరు నేతలు ఒత్తిడి తీసుకొచ్చినా.. చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి వేళలో మొదటి నెలలోనే పెద్ద ఎత్తున హత్యలు జరిగినట్లుగా వైసీపీ చేసిన ప్రచారంతో కూటమి సర్కారు ఉలిక్కిపడింది. వైసీపీ వర్గాలు చేపట్టిన ప్రచారంలో నిజమెంత? అన్న విషయాన్ని తేల్చుకోవటానికే నాలుగైదు రోజులు పట్టింది.
అప్పటికే వైసీపీ వర్గాలు చేపట్టిన ప్రతీకార హత్యల పరంపర ప్రచారంలో నిజం లేదన్న విషయాన్ని చెప్పేందుకు.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి. అప్పటికి ప్రచారం ఆగలేదు. దీంతో.. తమ్ముళ్లను అలెర్టు చేసి.. వైసీపీ చేస్తున్న ప్రచారానికి తగిన ఆధారాలు ఇవ్వాలన్న ప్రతి సవాలు తర్వాత కానీ.. సదరు ప్రచారానికి చెక్ పడింది.
అలా మొదలైన తప్పుడు ప్రచారానికి సరైన రీతిలో చెక్ పెట్టే విషయంలో కూటమి సర్కారు ఫెయిల్ అయ్యిందన్న మాట మిత్రపక్షాల నేతల నుంచి వచ్చిందంటే.. ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్నది అర్థమయ్యే పరిస్థితి. అయినప్పటికీ సంయమనాన్ని పాటించిన చంద్రబాబు సర్కారు.. తొందరపాటు చర్యలకు అవకాశం ఇవ్వలేదు. ఆచితూచి అన్నట్లుగా స్పందించారే తప్పించి.. దూకుడు ప్రదర్శించలేదు.
తమపై తప్పుడు ప్రచారాలు చేసే వారి విషయంలో చంద్రబాబు స్పందన అంతకంతకూ తీసికట్టుగా మారిందని.. ప్రత్యర్థులు చెలరేగిపోయే అవకాశాన్ని ఇస్తుందని తమ్ముళ్లు ఫిర్యాదులు చేసినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వచ్చింది లేదు. అయితే.. ఇదంతా వేచి చూసే ధోరణిగా.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు చంద్రబాబుకు ఇష్టం లేదన్న విషయాన్ని కూటమి నేతలు గుర్తించలేదు.
తెగింపు ఎక్కువగా ఉండే రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బ తీసేందుకు.. వారు తప్పుల మీద తప్పులు చేసే వరకు ఓపిగ్గా వెయిట్ చేయటానికి మించిన మంచి వ్యూహం లేదన్న విషయాన్ని వైసీపీ నేతలు అర్థం చేసుకున్నది లేదు. దీంతో.. తమ ప్రభుత్వంలో ఏ రీతిలో అయితే సోషల్ మీడియాలో చెలరేగిపోయారో.. అదే తీరును కూటమి ప్రభుత్వంలోనూ ప్రదర్శించారు. ఈ తీరుపై ప్రజల్లో చర్చ జరిగే వరకు వెయిట్ చేసి చూసిన చంద్రబాబు.. ఒక మోతాదు దాటిన తర్వాత తన విశ్వరూపాన్ని చూపించే పని మొదలు పెట్టారు.
ఇందులో భాగంగా వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించి చురుగ్గా ఉండే వారిని మ్యాప్ చేసిన కూటమి ప్రభుత్వం.. ఒకటి తర్వాత ఒకరి చొప్పున అరెస్టు చేసి.. రిమాండ్ కు పంపుతున్న తీరు ఇప్పుడు కలకలం రేపుతోంది. దీనిపై వైసీపీ అధినాయకత్వం మొదలు అధికార ప్రతినిధుల వరకు మండిపడుతున్నారు. భావస్వేచ్ఛను దెబ్బ తీస్తున్నారని.. ప్రతీకార చర్యలకు తెర తీస్తున్నట్లుగా ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై కూటమి వర్గాల వాదన వేరుగా ఉంది. భావస్వేచ్ఛ పేరుతో బూతులు తిట్టటం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించటమే కాదు.. ఇప్పటివరకు వెయిట్ చేయటమే ఎక్కువని.. ఇప్పటికి చర్యలు తీసుకోకుంటే అర్థం లేదంటున్నారు.
మొన్న బోరుగడ్డ అనిల్.. తాజాగా అశోక్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఒకరి తర్వాత ఒకరిని రిమాండ్ కు తరలిస్తున్నారు. అయితే.. ఈ సందర్భంగా వైసీపీ అండ్ కోలో మాత్రమే అలజడి తప్పించి.. ప్రజల్లో ఎలాంటి సానుభూతి వ్యక్తం కాకపోవటాన్ని వైసీపీ వర్గాలు గుర్తించాల్సిన అవసరం ఉందంటున్నారు. అధికారంలోకి వచ్చినంతనే ప్రతీకార చర్యలు ఉంటాయన్న అంచనాలకు ఫెయిల్ అయ్యేలా చేసిన చంద్రబాబు.. ప్రత్యర్థులు తమకు తాముగా చెలరేగిపోయేలా చేసి.. వారికి వారుగా వచ్చి ఉచ్చులో చిక్కుకునేలా చేశారంటున్నారు. చంద్రబాబును తక్కువగా అంచనా వేసిన వైసీపీ వ్యూహకర్తలు ఇప్పుడు భయాందోళనలకు గురవుతున్నారు.
తెగువ.. తెగింపు మాత్రమే కాదు.. వాటికి మించిన బుద్ధికుశలత అవసరమన్న విషయాన్ని గుర్తించి.. అందుకు తగ్గట్లు తమను తాము సిద్ధం చేసుకోకుంటే సమస్యలు తప్పవు. మరీ.. విషయాన్ని ఇప్పటికైనా వైసీపీ అధినాయకత్వం గుర్తించిందా? అన్నది ప్రశ్న. ప్రత్యర్థుల్ని దెబ్బ తీయటానికి అవసరమైన తెలివి.. ప్రత్యర్థులు తమను దెబ్బ తీయకుండా ఉండేందుకు కూడా అదే తెలివి అవసరమన్న విషయాన్ని తెలుసుకుంటే సరి.