ఎలక్షన్ సీజన్... హైదరాబాద్ లో దొరికిన గోల్డ్, క్యాష్ చూశారా?

అవును... తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన మరుక్షణం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినట్లు అయింది

Update: 2023-10-10 04:07 GMT

ఎన్నికల సీజన్ వచ్చేసిందని చెప్పడానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం, పార్టీలు అభ్యర్థులను ఫైనల్ చేసుకునే పనిలో ఉండటమే కాదు సుమా... కిలోల కొద్దీ బంగారం, వెండీ.. గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు దొరకడం కూడా ఒక సంకేతమే అని చెప్పినా అతిశయోక్తి కాదు! ఈ నేపథ్యంలో అలా ఎన్నికల నగరా మోగిందో లేదో ఇలా హైదరబాద్ లో కిలోల కొద్దీ బంగారం దొరికింది.

అవును... తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన మరుక్షణం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినట్లు అయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ పరిధిలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా పలు ప్రాంతాల్లో డబ్బు, బంగారం, వెండి స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు. వీటికి సంబంధించిన సరైన ధృవీకరణ పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు.

తాజాగా పోలీసులు స్వాదీనం చేసుకున్న నగదు, బంగారం, వెండి వివరాలు ఇలా ఉన్నాయి. ఇందులో... నిజాం కాలేజ్ పరిసరాల్లో చేసిన తనిఖీల్లో గేట్‌ నంబర్‌ 1 వద్ద.. 7 కిలోల బంగారం, 300 కిలోల వెండి సీజ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో చందానగర్ పీస్ పరిధిలో సుమారు 5.65 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు.

బంగారం, వెండి విషయాల సంగతి అలా ఉంటే... తొలిరోజు తనికీల్లో నగదు కూడా భారీ మొత్తంలో దొరికింది. ఇందులో భాగంగా... ఫిలింనగర్ పరిధిలోని షేక్‌ పేట నారాయణమ్మ కాలేజీ మెయిన్ రోడ్డు వద్ద ఓ కారులో రూ.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు నలుగురుని అదుపులోకి తీసుకున్నారని సమాచారం.

ఇక మంగళహాట్‌ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో రూ.15 లక్షలు, ఎల్బీనగర్‌ పరిధిలోని వనస్థలిపురం ఆటోనగర్ వద్ద రూ.4 లక్షలు, షాద్‌ నగర్‌ పరిధిలో రాయికల్ టోల్ ప్లాజా వద్ద రూ 11.5 లక్షలు పట్టుబడ్డాయని తెలుస్తుంది. ఇలా బంగారం, వెండీ, నగదు లిస్ట్ ఇలా ఉంటే... వీటితో పాటు మరికొన్ని తాయిళాలను పోలీసులు సీజ్ చేశారు.

ఇందులో భాగంగా... శేరిలింగంపల్లి గోపన్‌ పల్లి తండాలో ఓటర్లకు సిద్ధంగా ఉంచినట్లు చెబుతున్న 87 కుక్కర్‌ లను పోలీసులు సీజ్‌ చేశారు. ప్రగతినగర్‌, మధురానగర్‌, బోరబండ ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ చేసిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా పత్రాలు చూపించని బంగారం, వెండీ, నగదు తోపాటు అక్రమ మద్యాన్ని పోలీసులు సీజ్ చేస్తున్నారు.

ఒకవేళ రూ.50వేల కంటే ఎక్కువ నగదు తరలించాల్సి వస్తే...?

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో... తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినట్లయ్యింది. ఈ క్రమంలో ప్రలోభాలపై ఎన్నికల సంఘం నిఘా మొదలయ్యింది. ఈ నేపథ్యంలో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తనిఖీల్లో సరైన పత్రాలు చూపించకుంటే వాటిని సీజ్‌ చేస్తారనే విషయం గుర్తుంచుకోవాలి.

నాలుగు రాష్ట్రాల సరిహద్దులున్న తెలంగాణలో దాదాపు 148 చెక్‌ పోస్టులు పెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. కేవలం నగదు మాత్రమే కాకుండా బంగారం, ఇతర ఆభరణాలు భారీస్థాయిలో తీసుకెళ్లినా ఇబ్బందేనని స్పష్టం చేస్తున్నారు. భారీ మొత్తంలో నగదు లభ్యమైతే ఐటీ, జీఎస్టీ అధికారులు కూడా రంగంలోకి దిగుతారని చెబుతున్నారు. వాటికి సంబంధించి కచ్చితమైన ఆధారాలు చూపిస్తేనే తిరిగి ఇస్తారు.

ఉదాహరణకు హాస్పటల్ బిల్లుల కోసం ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్లాల్సి వస్తే... ఆ సమయంలో పేషెంట్ తాలూకు రిపోర్టులు, ఆసుపత్రి రశీదులు నగదుతోపాటూ దగ్గర ఉంచుకోవాలి. ఇక మరేదైనా అవసరాల కోసం బ్యాంకు నుంచి నగదు డ్రా చేస్తే.. బ్యాంక్ బుక్.. లేదా, ఏటీఎం స్లిప్ వంటివి తప్పనిసరిగా తమవద్ద పెట్టుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News