ఏటీఎం కార్డు లేకుండానే ఇలా క్యాష్‌ తీసుకోవచ్చు!

అయితే ఇలా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకునే వెసులుబాటు ఇప్పటివరకు లేదు. ఏటీఎం కార్డు ఉండాల్సిందే

Update: 2023-09-07 08:39 GMT

ఇప్పటికే దేశం డిజిటల్‌ బాటలో నడుస్తోంది. గ్రామాల్లో చిన్న చిన్న కొట్ల నుంచి నగరాల్లో మల్టీ కాంప్లెక్సుల వరకు అంతా ఫోన్‌ పే, గూగుల్‌ పే, అమెజాన్‌ పే, పేటీఎం వంటివి అందుబాటులోకి వచ్చేశాయి. వీటికి సంబంధించిన క్యూఆర్‌ కోడ్‌ ను స్కాన్‌ చేసి పొందిన సేవలు, తీసుకున్న వస్తువులకు నగదు చెల్లించేయొచ్చు.

అయితే ఇలా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకునే వెసులుబాటు ఇప్పటివరకు లేదు. ఏటీఎం కార్డు ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఏటీఎంల్లోనూ క్యూఆర్‌ కోడ్‌ ను ఫోన్‌ తో స్కాన్‌ చేసి డబ్బులు తీసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు తమ వద్ద ఏటీఎం కార్డు/డెబిట్‌ కార్డు లేకపోయినా ఫోన్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ ను స్కాన్‌ చేసి ఏటీఎంల నుంచి నగదు పొందొచ్చు.

ఇందుకు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తొలి అడుగు పడింది. జపాన్‌ దేశానికి చెందిన హిటాచీ పేమెంట్‌ సర్వీసెస్‌ దేశంలో తొలి యూపీఐ–ఏటీఎంను అందుబాటులోకి తెచ్చింది. 'హిటాచీ మనీస్పాట్‌ ఏటీఎం' పేరిట దీనిని ముంబైలో ఏర్పాటు చేసింది. సెప్టెంబరు 5న ఆ నగరంలో జరిగిన 'గ్లోబల్‌ ఫిన్‌ టెక్‌ ఫెస్ట్‌ 2023'లో దీన్ని హిటాచీ పేమెంట్‌ సర్వీసెస్‌ ఆవిష్కరించింది.

కాగా ఈ యూపీఐ-ఏటీఎంను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)తో కలిసి ఏర్పాటు చేసినట్టు హిటాచీ పేమెంట్స్‌ సర్వీసెస్‌ వెల్లడించింది. క్రమంగా ఈ యూపీఐ-ఏటీఎంలను ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు తెలిపింది. ఇకపై ఫోన్‌ లోని యూపీఐ యాప్‌ ల సాయంతో క్యూఆర్‌ కోడ్‌ ను స్కాన్‌ చేసి ఏటీఎంలలో డబ్బులు తీసుకోవచ్చు.

యూపీఐ- ఏటీఎంను చాలా సులువుగా ఉపయోగించవచ్చని చెబుతున్నారు. మోసాల నేపథ్యంలో సురక్షితంగా దీన్ని తీర్చిదిద్దారు.

యూపీఐ-ఏటీఎంలో డబ్బులు తీసుకోవాలంటే...

– ఏటీఎంలో స్క్రీన్‌ పై కనిపించే 'యూపీఐ కార్డ్‌ లెస్‌ క్యాష్‌' ఆప్షన్‌ పై క్లిక్‌ చేయాలి.

– ఆ తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్‌ చేయాలి.

– మీరు నగదును ఎంటర్‌ చేయగానే వెంటనే ఒక క్యూఆర్‌ కోడ్‌ కనిపిస్తుంది.

– ఫోన్‌ లో ఉన్న యూపీఐ ఆధారిత యాప్‌ (ఫోన్‌ పే, గూగుల్‌ పే, అమెజాన్‌ పే, పేటీఎం, తదితరాలు)తో దాన్ని స్కాన్‌ చేయాలి.

– ఆ తర్వాత మీ లావాదేవీని ధ్రువీకరిస్తూ యూపీఐ పిన్‌ ను యాప్‌ లో ఎంటర్‌ చేయాలి.

– పిన్‌ సరిగా ఉంటే ఏటీఎం మెషీన్‌ నుంచి మీరు ఎంటర్‌ చేసిన నగదు బయటకు వస్తుంది.

– ఆ తర్వాత మీ లావాదేవీ విజయవంతమైనట్లు యాప్‌ లోనూ ఒక మెసేజ్‌ ఉంది.

కాగా ఇప్పటికే ఎస్‌బీఐ వంటి కొన్ని బ్యాంకులు కార్డు లేకుండా ఏటీఎంల్లో డబ్బులు తీసుకునే చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. అయితే ఇందులో మొబైల్‌ ఫోన్‌ ఆధారంగా లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుంది. ఏటీఎంలో కార్డ్‌ లెస్‌ ట్రాన్షాక్షన్‌ ఎంచుకుని.. మొబైల్‌ నంబర్‌ కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం రిస్కుతో కూడుకున్న వ్యవహారం. మన ఫోన్‌ పొరపాటున పోయి ఎవరి చేతులోనైనా పడితే వారు మోసాలకు వాడుకునే అవకాశం ఉంటుంది.

కానీ యూపీఐ- ఏటీఎంలో మోసాలకు ఆస్కారం లేదు. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి స్వయంగా మీరు మీ పిన్‌ నెంబర్‌ ను ఎంటర్‌ చేస్తేనే డబ్బులు ఏటీఎం నుంచి బయటకు వస్తాయి. కాబట్టి మన నగదుకు రక్షణ ఉంటుంది.

Tags:    

Similar News