కోట్లతో పరార్... లక్ష రూపాయలతో లాక్!
వివరాల్లోకి వెళ్తే... తూర్పుగోదావరి జిల్లాలో ఒక యువకుడు రాజమండ్రిలో ఏటీఎంలలో నగదు పెట్టే ప్రైవేటు ఏజెన్సీలో పనిచేసేవాడు.
కష్టపడి సంపాదించింది ఎక్కడికీ పోదు.. కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలబడదు అని అంటారు! అయినప్పటికీ ఇప్పుడు రెండో బ్యాచ్ టైమే బాగుందనేవారూ లేకపోలేదు. ఆ సంగతి అలా ఉంటే... కోట్ల రూపాయలు కాజేసి, లక్ష రూపాయలతో పోలీసులకు దొరికిపోయి, ఆ లక్షతో తీగ లాగితే డొంకంతా కదిలి కటకటాల పాలయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడు ఓ వ్యక్తి! రాజమండ్రిలో తెరపైకి వచ్చిన ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అవును... అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడదీ సుఖపడినట్లు చరిత్రలో లేదు అనే మాట ఇతగాడికి సరిగ్గా సరిపోతుందేమో అనే సంఘటన తాజాగా తెరపైకి వచ్చింది. కష్టపడకుండానే లగ్జరీ లైఫ్ కోరుకున్న ఓ యువకుడు ఏటీఎంలలో పెట్టాల్సిన సుమారు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలను కొట్టేశాడు. అయితే 'గాచ్చారం గతి తప్పితే..' అన్నట్లుగా ఒక లక్ష రూపాయల కారణంగా పోలీసులకు చిక్కేశాడు!
వివరాల్లోకి వెళ్తే... తూర్పుగోదావరి జిల్లాలో ఒక యువకుడు రాజమండ్రిలో ఏటీఎంలలో నగదు పెట్టే ప్రైవేటు ఏజెన్సీలో పనిచేసేవాడు. ఈ క్రమంలో శుక్రవారం తను పనిచేసే ఏజెన్సీ ఇచ్చిన చెక్కు ద్వారా బ్యాంకు నుంచి రూ.3,32,50,000 (మూడు కోట్ల ముప్పై లక్షల ఏభైవేల రూపాయలు) తీసుకున్నాడు. అనంతరం ఇతర టీంకి వర్క్ అసైన్ చేసేశాడు.
ఇందులో భాగంగా... టీంలోని ఇతర సభ్యులకు రూ.1.12 కోట్లు ఇచ్చిన ఏటీఎంలలో పెట్టేందుకు వెళ్లమని చెప్పిన అతడు.. అప్పటికే ఏర్పాటు చేసుకున్న అద్దే కారులో రూ. 2,20,50,000 (రెండు కోట్ల ఇరవై లక్షల ఏభైవేల రూపాయలు) తీసుకుని పరారయ్యాడు. ఈ సమయంలో అప్పటికే సిటీ అవుట్ కట్స్ లో అద్దెకు తీసుకున్న ఫ్లాట్ లో కొంతడబ్బు పెట్టి.. ఎవరూ గుర్తుపట్టకుండా గుండు కొట్టించుకుని, మీసాలు, గెడ్డం తీయించేసి.. అక్కడ నుంచి కోనసీమ జిల్లా కొత్తపేటకు చేరుకున్నాడు.
అనంతరం కారు యజమానికి కొంత సొమ్ము ఇచ్చేసి, బైక్ తీసుకుని తెలిసినవారి ఇంటికి వెళ్లాడు. అక్కడ వారికి రూ.9 లక్షలు ఇచ్చి, ఓ లక్ష రూపాయలు జేబులో పెట్టుకుని మండపేట వైపు వెళ్తున్నాడు! ఈ సమయంలో బైక్ పై వెళ్తున్న అతడిని పోలీసులు తనిఖీ చేయగా.. అతడి వద్ద లక్ష రూపాయలు లభించాయి. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేయగా.. చోరీ వ్యవహారం తెరపైకి వచ్చింది.
పెద్ద వ్యాపారం చేయాలి.. లగ్జరీగా బ్రతకాలి అని ఆశించి ఇలా చోరీ చేసినట్లు నిందితుడు విచారణలో తెలిపినట్లు ఎస్పీ వెల్లడించారు.