కడపలో ఎంపీడీవోపై దాడికి పోలీసుల షాక్ ట్రీట్ మెంట్

గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. తనకు నో చెప్పిన వారిపై దాడులకు పాల్పడే సుదర్శన్ రెడ్డి.. మారిన ప్భుత్వానికి తగినట్లుగా మారాల్సి ఉంది.

Update: 2024-12-29 06:30 GMT

ఎవరికి ప్రత్యేక అధికారాలు ఉండవు. అందుకు భిన్నంగా తమను తాము గొప్పగా విర్రవీగుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న అధికారిపై దాడికి పాల్పడిన ఉదంతాలకు చెక్ పెట్టేందుకు ఏపీలోని కూటమి సర్కారు స్పందించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. కడప జిల్లాలో ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి చేసిన సుదర్శన్ రెడ్డికి పోలీసులు దిమ్మ తిరిగే షాకిచ్చారు. ఇంట్లో నుంచి చొక్కా పట్టుకొని.. వీధుల్లో నడిపించుకుంటూ.. రీల్ లో కనిపించే సీన్లను కడప వీధుల్లో చూపించారు.

గత ప్రభుత్వంలో ఆయనకు అర్హత లేనప్పటికి కీలకమైన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పదవిని కట్టబెట్టటం.. దీనిపై నెలకొన్న వివాదంతో ఏపీ హైకోర్టులోనూ.. సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బలు తగిలాయి. గాలివీడు ఎంపీపీగా ఉన్న సుదర్శన్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేసి 2023 మేలో డీవోపీగా నియమితులు అయ్యారు. దీనిపై వివాదం నెలకొంది.

గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. తనకు నో చెప్పిన వారిపై దాడులకు పాల్పడే సుదర్శన్ రెడ్డి.. మారిన ప్భుత్వానికి తగినట్లుగా మారాల్సి ఉంది. అయినప్పటికీ అదేమీ పట్టని అతను.. తన తల్లి గాలివీడు ఎంపీపీగా ఉండటంతో.. ఆ ఆఫీసు మొత్తానికి తానే పెత్తనం చెలాయిస్తున్నారు. అదేమని అడిగినోళ్లపై దాడికి పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగా.. అతను ఎంపీడీవోపై దాడికి పాల్పడిన వైనంపై కూటమి సర్కారు సీరియస్ అయ్యింది.

అతగాడి అరెస్టు మిగిలిన అతిగాళ్లకు షాకిచ్చేలా చేసేందుకు వీలుగా పోలీసులు షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చారు. వందలాది మంది చూస్తుండగా.. ఎంపీపీ కార్యాలయం బయటకు లాక్కొచ్చిన పోలీసులు.. అతగాడు ఓవర్ చేయబోగా.. అతడికి తమదైన శైలిలో ట్రీట్ మెంట్ ఇచ్చి అరెస్టు చేశారు. ఈ దాడి ఘటనలో సుదర్శన్ రెడ్డితో పాటు మరో పదమూడు మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు వారిపైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద కేసులు పెట్టారు.

న్యాయమూరతి ఎదుట హాజరుపర్చగా వారికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు. నిందితుల్లో సుదర్శన్ రెడ్డిని ఏ1గా పేర్కొన్నారు. ఈ ఉదంతంలో సంబంధం ఉన్న మరో పది మంది కోసం పోలీసులు టీంలుగా గాలిస్తున్నాయి. మొత్తంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారికి దిమ్మ తిరిగేలా షాక్ ట్రీట్ మెంట్ లు వెంటనే ఉంటాయన్న సందేశాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.

Tags:    

Similar News