కేరళ గవర్నర్‌పై దాడి.. సిగ్గుపడాల్సింది ఎవరు?
కేరళలో సంచలన ఘటన చోటు చేసుకుంది. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌పై దాడి జరిగింది. అయితే.. ఈ దాడి నుంచి ఆయనను భద్రతా బలగాలు తృటిలో రక్షించడంతో ఆయన బ్రతికిపోయారు.
కేరళలో సంచలన ఘటన చోటు చేసుకుంది. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌పై దాడి జరిగింది. అయితే.. ఈ దాడి నుంచి ఆయనను భద్రతా బలగాలు తృటిలో రక్షించడంతో ఆయన బ్రతికిపోయారు. రాజ్‌భవన్ నుంచి తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్తుండ గా.. అధికార సీపీఎం పార్టీకి చెందిన ఎస్ ఎఫ్ ఐ విద్యార్థులు ఒక్కసారిగా గవర్నర్ కాన్వాయ్‌పై మెరుపు దాడికి దిగాయి. గవర్నర్ కాన్వాయ్‌లో ఆయన కారును లక్ష్యంగా చేసుకుని విద్యార్థులు దూసుకువచ్చారు. అయితే.. భద్రతా సిబ్బంది హుటాహుటిన స్పందించడంతో గవర్నర్ ఆరిఫ్‌కు పెను ప్రమాదం తప్పినట్టయింది.
అయితే.. ఈ విషయం రాష్ట్రంలోనూ.. కేంద్రంలోనూ తీవ్ర అలజడి రేపింది. గవర్నర్ కారుపై దాడిని బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టలూ ముక్తకంఠంతో ఖండించాయి. ఇక, దీనికి దారి తీసిన పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి విజయన్‌ను తాను ప్రశ్నిస్తున్నందుకే.. ఇలా కుట్రపన్ని..తనపై దాడి చేయించారని గవర్నర్ మీడియా ముందు చెప్పుకొచ్చారు. తన ప్రాణాలకు హాని ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించాల్సి ఉందని గవర్నర్ వ్యాఖ్యానించారు.
ఇక, కేంద్ర మంత్రులు కూడా ఈ ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఎస్ ఐఎఫ్ విద్యార్థులు హమాస్ ఉగ్రవాదులకన్నా ఘోరంగా తయారయ్యారని ఆరోపించారు. శాంతి భద్రతలు క్షీణించాయని, గవర్నర్‌పై ఇప్పటికి మూడు సార్లు దాడులు జరిగాయన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై ఎవరైనా ఇలా దాడి చేస్తే.. పోలీసులు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఇదిలావుంటే, దాడికి ఘటనకు సంబంధించి 17 మంది విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే.. దీనికి కారణంగా.. కేరళ యూనివర్సిటీకి గవర్నర్ ఆర్ ఎస్ ఎస్ నేపథ్యం ఉన్నవారిని నామినేట్ చేయడమేనని పేర్కొనడం గమనార్హం.
ఎవరిది తప్పు!
దేశవ్యాప్తంగా బీజేపీయేతర ప్రభుత్వాలు గవర్నర్లతో తీవ్ర సంకటాన్ని అనుభవిస్తున్నాయని సుప్రీంకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్, పంజాబ్, తెలంగాణ(ఇప్పుడు ప్రభుత్వం మారింది) సహా అనేక రాష్ట్రాల్లో గవర్నర్‌లు హద్దులు మీరి వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యతలకన్నా.. కేంద్రం చేతిలో కీలు బొమ్మలుగా ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని కూడా సుప్రీం కోర్టు తప్పుబట్టింది.
ఇక, కేరళ విషయానికి వస్తే.. అత్యంత కీలకమైన 9 బిల్లులను గవర్నర్ ఆరిఫ్ ఆమోదం తెలపకుండా తొక్కి పెట్టారు. ఇది సీఎం విజయన్ సర్కారుకు, గవర్నర్‌కు మధ్య గ్యాప్ పెంచేసింది. పైగా ఆర్ ఎస్ ఎస్ నేపథ్యం ఉన్నవారిని కేరళ యూనివరర్సిటీకి ఆయన నామినేట్ చేయడం కూడా.. మరింత వివాదంగా మారింది. ఇది.. ఏకంగా భౌతిక దాడులకు దారి తీసింది. ఏదేమైనా బీజేపీయేతర రాష్ట్రాల్లో(ఏపీ తప్ప) కేంద్రం గవర్నర్‌లను వినియోగించి పెత్తనం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.