అనుకున్నంతా జరిగింది... '9 ఏళ్లకే అమ్మాయిలకు పెళ్లి' ఫిక్సయ్యింది!
అమ్మాయిల కనీస వివాహ వయసు విషయంలో సమాజానికి రకరకాల రూపంలో ఇంకా మహమ్మారులు పట్టి పీడిస్తూనే ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అమ్మాయిల కనీస వివాహ వయసు విషయంలో సమాజానికి రకరకాల రూపంలో ఇంకా మహమ్మారులు పట్టి పీడిస్తూనే ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లోనూ ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతున్న పరిస్థితి. ఇలా అమ్మాయిల జీవితాలను మొగ్గలోనే తుంచేస్తున్నారు. ఈ సమయంలో ఏకంగా చట్టమే రూపుదిద్దుకొంది.
అవును... అమ్మాయిల కనీస వివాహ వయసు 18 ఏళ్లు ఉండాలని చెబుతుంటారు. దీనివల్ల శారీరకంగా, మానసికంగా ఆమెకు.. సామాజికంగా దేశానికి మంచిదని అంటారు. అయితే తాజాగా... దేశంలో మతపరమైన విలువలు కాపాడటానికి అంటూ అమ్మాయిల వివాహ వయసు విషయంలో ఇరాక్ ఓ చట్టం రూపొందించిందనే విషయం వైరల్ గా మారింది.
వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సు 9 ఏళ్లకు కుదించాలనే ప్రతిపాదనలు ఇరాక్ పార్లమెంట్ లో వినిపించాయి. ఈ మేరకు ఇరాక్ న్యాయ మంత్రిత్వ శాఖ ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టిది. పర్సనల్ స్టేటస్ లా ను సవరించే ఉద్దేశ్యంతోనే దీన్ని తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు! దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
అయినప్పటికీ గత ఏడాది నవంబర్ లో ఈ బిల్లు పార్లమెంట్ లో పాసైనట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆ బిల్లు చట్టంగా మారిందని అంటున్నారు. అక్కడ షియత్ లు ఎక్కువగా అనుసరించే జాఫరీ ఇస్లామిక్ లా ప్రకారం 9 ఏళ్ల బాలికకు పెళ్లిచేయొచ్చని అంటున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు చట్టంగా మారిందనే షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.
దీంతో... ఈ చట్టంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఒక రకంగా చైల్డ్ సెక్స్ ను చట్టబద్ధం చేయడమేనని హక్కుల సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇదే సమయంలో... విడాకులు, వారసర్వ ఆస్తి, పిల్లల కస్టడీ విషయంలో మహిళలు తమ హక్కులను కోల్పోయే సవరణలు జరిగాయని మండిపడుతున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన మానవ హక్కుల కార్యకర్త, ఇరాకీ ఉమెన్స్ లీగ్ సభ్యురాలు ఇంతిసార్ అల్ల్ మయాలి... చిన్న వయసులోనే బాలికలను వివాహం చేసుకోవడం ద్వారా బాలికల హక్కులపై వినాశకర ప్రభావాలను చూపుతుందని.. పిల్లలుగా జీవించే వారి హక్కును ఉల్లంఘిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోపక్క ఈ నిర్ణయం బాలికల విద్య, ఆరోగ్యం, బాలల హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. ఇక.. యూనిసెఫ్ గణాంకాల ప్రకారం ఇరాక్ లో ఇప్పటికే అనధికారికంగా సుమారు 28 శాతం మంది బాలికలకు 18 ఏళ్ల లోపే పెళ్ళిళ్లు అవుతున్నాయి.