అమ్మో.. జనవరి 26! తెలంగాణ సర్కారులో దడ

26 జనవరి. ఈ డేట్‌ గుర్తొస్తేనే ఉలిక్కిపడుతున్నారు తెలంగాణ సర్కారోళ్లు. రాజ్యాంగం అమలైన రోజైన జనవరి 26 నుంచి పలు కీలక పథకాలను అమలు చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Update: 2025-01-22 14:30 GMT

ఒకటో తారీకు వస్తుందంటే వేతన జీవులు ఎంతో భయపడుతుంటారు. జీతాలు అందుతాయా? లేదా? అనే టెన్షనుతోపాటు నెలవారీ ఖర్చులు, పిల్లల చదువులకు అయ్యే ఖర్చులు, ఈఎంఐలు, అప్పులు, వడ్డీలు ఒకటేంటి వేతన జీవుల వెతలన్నీ ఒకటో తారీకుతో ముడిపడివుంటాయి. ఇదేవిధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక తేదీ గడబిడ చేస్తోంది. అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాలకు నిధులు విడుదల చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఇందుకోసం జనవరి 26న ముహూర్తంగా పెట్టుకుంది. మరో నాలుగు రోజుల్లో వచ్చే ఈ ముహూర్త సమయానికి ఖజానాలో రూ.20 వేల కోట్లు ఉండాలని అంటున్నారు. దీంతో ఆ మొత్తం నిధుల సేకరణకు ప్రభుత్వం అపసోపాలు పడుతోందని చెబుతున్నారు.

26 జనవరి. ఈ డేట్‌ గుర్తొస్తేనే ఉలిక్కిపడుతున్నారు తెలంగాణ సర్కారోళ్లు. రాజ్యాంగం అమలైన రోజైన జనవరి 26 నుంచి పలు కీలక పథకాలను అమలు చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు భరోసా, ఇందిరమ్మ రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూడు పథకాలకు వేల కోట్ల రూపాయలు అవసరం ఉండగా, ప్రభుత్వ ఖజానాలో మాత్రం అంత డబ్బు లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన గ్యారెంటీల అమలుతో పాటు ఉద్యోగుల జీతాలు-పెన్షన్లు, రోటీన్‌గా జరిగి అభివృద్ది సంక్షేమ పథకాలకే నిధులు అరకొరగా ఉంటున్నాయి. పైగా గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు వడ్డీలు, నెలవారి వాయిదాలు చెల్లించే సరికే కాంగ్రెస్ సర్కార్‌కు తలప్రాణం తోకకు వస్తోందని సమాచారం.

రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఏడాదికి 12 వేల రూపాయలను ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగా భూములన్నింటికీ కాకుండా వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు. ఈ విధంగా చూసినా రాష్ట్రంలో దాదాపు కోటి 40 లక్షల ఎకరాల సాగు భూములు ఉన్నట్లు అధికారిక సమాచారం. అంటే రైతు భరోసా మొదటి విడత జనవరి 26 ప్రారంభిస్తే ఎకరానికి 6 వేల రూపాయల చొప్పున దాదాపు కోటీ 40 లక్షల ఎకరాలకు దాదాపు 8,400 కోట్ల రూపాయలు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక భూమిలేని వ్యవసాయ రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయల చొప్పున 26వ తేదీ నుంచే పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇలాంటి కుటుంబాలు దాదాపు 1.16 కోట్ల కుటుంబాలు ఉన్నాయని ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేలో తేలింది. వీరిలో నిరుపేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ కార్డును ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో మొత్తం 53 లక్షల మందికి ఉపాధి హామీ గుర్తింపు కార్డులున్నాయి. వారిలో 32 లక్షల మంది మాత్రమే రోజూ కూలీ పనులకు వెళ్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ కార్డుదారుల్లో దాదాపు 22 లక్షల మందికి భూమి లేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరికి రైతు భరోసా క్రింద మొదటి విడతలో 6వేల చొప్పున ఆర్ధిక సాయం చేస్తే 13 వందల 20 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి.

ఇదే సమయంలో రైతు కూలీలను అర్హులుగా గుర్తించే విషయంలో ప్రభుత్వం డైలమాలో ఉందని చెబుతున్నారు. ఉపాధి హామీ కూలీల్లో సగం మందిని తప్పిస్తే వ్యతిరేకత వస్తుందని, దాని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందని భయం ప్రభుత్వాన్ని వెంటాడుతోందంటున్నారు. ప్రస్తుతం ఉపాధి హామీ కూలీలుగా ఉన్న రైతు కూలీలు 46 లక్షల మందికి ఏడాదికి 12 వేల చొప్పున చెల్లిస్తే 5 వేల 200 కోట్లు అవసరమవుతాయి. అంటే మొదటి విడతలో 6 వేల చొప్పున ఇచ్చి 2 వేల 600 కోట్లు కావాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తంలో నిధులను చెల్లించే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదంటున్నారు అధికారులు.

ఇక జనవరి నెలాఖరు నుంచి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇల్లులేని నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయం చేయాల్సివుంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం దాదాపు 84 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక్కో ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షల ఆర్ధిక సాయంలో భాగంగా మొదటి విడతలో లక్ష రూపాయల చొప్పున చెల్లించినా, కనీసం 5 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. అంటే రైతు భరోసాకు 8 వేల 400 కోట్లు, రైతు కూలీలకు 1,320 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు 5 వేల కోట్లు ఈ మొత్తం కలిపి దాదాపు 15 వేల కోట్ల రూపాయలు తక్షణం అవసరం అవుతాయి. ఇక జవనరి 26 తర్వాత నాలుగు రోజులకే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు మరో 4 వేల 500 కోట్లు కావాలి. అంటే తెలంగాణ సర్కార్‌కు ప్రస్తుతం దాదాపు 20 వేల కోట్ల రూపాయలు అవసరం.

ఈ 20 వేల కోట్ల రూపాయలే కాకుండా రోటీన్‌గా జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కూడా డబ్బులు సమకూర్చాల్సివుంది. అందుకే జనవరి 26 తేదీని తలచుకుని ప్రభుత్వం కంగారు పడుతోందంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఖాజానా నింపుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఏడాది కాలంగా నానుతూ వస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను జనవరి 26న ప్రారంభించకపోతే ఇటు ప్రజల్లో నమ్మకం కోల్పోవడంతో పాటు, ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతామని రేవంత్ సర్కార్ ఆందోళన చెందుతోందనే విశ్లేషణలు ఉన్నాయి. అందుకే ఎలాగైనా ఖజానాకు 20 వేల కోట్ల రూపాయలను జమచేసి మాటిచ్చినట్లు ఆయా పథకాలను అమలు చేసి తీరాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను సమీకరించి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందా లేదా తెలియాలంటే మరో నాలుగు రోజులు వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News