'నాడు ఐటీ - నేడు ఏఐ'... బిల్ గేట్స్ తో చంద్రబాబు, లోకేష్ భేటీ!
ఈ సమయంలో వైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ ఐటీ దిగ్గజం బిల్ గేట్స్ తో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు దావోస్ ప్రొమెనేడ్ మైక్రోసాఫ్ట్ కేఫ్ లో భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన కొనసాగుతోంది. ప్రపంచ ఆర్ధిక సదస్సులో భాగంగా మూడోరోజు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో, సంస్థల అధినేతలతో ఆయన సమావేశం అవుతున్నారు. ఈ సమయంలో వైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ ఐటీ దిగ్గజం బిల్ గేట్స్ తో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు దావోస్ ప్రొమెనేడ్ మైక్రోసాఫ్ట్ కేఫ్ లో భేటీ అయ్యారు.
అవును... దావోస్ పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో తాను సీఎంగా ఉన్నప్పుడు తమపై నమ్మకంతో మైక్రోసాఫ్ట్ ఐటీ సెంటర్ ను హైదరాబాద్ లో నెలకొల్పారని.. దీంతో భాగ్యనగర రూపురేఖలు మారిపోయాయనే విషయాన్ని బిల్ గేట్స్ కు బాబు గుర్తు చేశారని అంటున్నారు.
ఇదే సమయంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, ఈ సమయంలో రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి సహాయ సహకారాలను అందించాలని మంత్రి లోకేష్ కోరినట్లు తెలుస్తోంది. అదే విధంగా... ఏపీలో ఏర్పాటు చేయబోతోన్న వరల్డ్ క్లాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్శిటీ సలహామండలిలో భాగస్వామ్యం వహించాలని బిల్ గేట్స్ ను ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ కోరారు.
ఈ సమయంలో తమ అమూల్యమైన సలహాలు మా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి దోహదం చేస్తాయని చెప్పిన లోకేష్.. ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్ ను ఏర్పాటు చేయడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరుపున ఏపీ సర్కార్ తో భాగస్వామ్యం వహించాలని బిల్ గేట్స్ ను కోరారు. ఈ సందర్భంగా... దక్షిణ భారత దేశంలో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఏపీనే గేట్ వేగా నిలపాలని అడిగారు.
అదేవిధంగా... ఏపీలోని ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎకోసిస్టం ను నడపడానికి ఆఫ్రికాలో హెల్త్ డ్యాష్ బోర్డ్ ల తరహాలో సామాజిక వ్యవస్థాపకతలో ఫౌండేషన్ తరుపున నైపుణ్య సహకారాన్ని అందించాలని.. మీ సహకారంతో స్థానికంగా ఉత్పత్తులపై ప్రపంచ ఆవిష్కరణలను అమలు చేసేలా ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని లోకేష్ విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా విజనరీ లీడర్ చంద్రబాబును చాలాకాలం తర్వాత కలవడం తనకు చాలా ఆనందంగా ఉందని.. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బిల్ గేట్స్ చెప్పారని తెలుస్తోంది. ఏది ఏమైనా... దావోస్ పర్యటనలో చంద్రబాబు నేతృత్వంలో, లోకేష్ దూకుడుతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే చర్చ జరుగుతుంది.
ఈ విషయాలపై ఎక్స్ వేదికగా స్పందించిన చంద్రబాబు... బిల్ గేట్స్ తో ప్రత్యేకంగా భేటీ అయిన ఫోటోను షేర్ చేస్తూ.. "నాడు 1995 లో ఐటీ, నేడు 2025లో ఏఐ".. బిల్ గేట్స్ తో చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కనెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు.