డేటింగ్ యాప్ లో బుక్కై రూ.4.3 కోట్లు కోల్పోయిన మహిళ కథ

ఆస్ట్రేలియాకు చెందిన 57 ఏళ్ల మహిళకు ఎదురైన ఈ అనుభవం ఇప్పుడు వైరల్ అవుతోంది.

Update: 2025-02-20 00:30 GMT

ఐదుపదులు దాటితే మనం ఏం చేస్తాం.. కృష్ణా.. రామా అనుకుంటూ ఓ మూలన పడుంటాం.. గుడులు గోపురాలు, విహారాలు చేస్తూ శేషజీవితాన్ని అలా గడిపేస్తాం.. మెజార్టీ మంది చేసేది ఇదే.. కానీ 50 ఏళ్ల వయసులోనూ ఓ మహిళా మణి తోడు కోసం తపించింది.. సహజీవనం కోసం పరితపించింది. సహజీవనం చేసే ఓ భాగస్వామి కోసం డేటింగ్ యాప్ ను ఆశ్రయించింది.. సైబర్ నేరగాళ్ల వలలో పడి ఏకంగా రూ.4.3 కోట్లు మోసపోయింది. ఆస్ట్రేలియాకు చెందిన 57 ఏళ్ల మహిళకు ఎదురైన ఈ అనుభవం ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఆస్ట్రేలియాకు చెందిన 57ఏళ్ల అన్నెట్ ఫోర్డ్ అనే మహిళ ఆన్‌లైన్‌ మోసగాళ్ల చేతిలో భారీగా నష్టపోయింది. 20ఏళ్ల క్రితం తన భర్తతో విడిపోయిన ఆమె, నిజమైన ప్రేమను వెతుక్కోవడం కోసం ‘ప్లెంటి ఆఫ్ ఫిష్’ అనే డేటింగ్‌ యాప్‌ను ఉపయోగించింది. ఈ యాప్‌లో విలియం అనే వ్యక్తి పరిచయం అవ్వడంతో, వారిద్దరూ చాటింగ్‌ చేయడం ప్రారంభించారు. కొన్నేళ్ల పాటు చాటింగ్‌, వీడియో కాల్స్‌లో మాట్లాడి, నమ్మకాన్ని పెంపొందించుకున్నాడు.

తనపై నమ్మకం కల్పించిన విలియం, మలేషియాలో తన పర్సు పోయిందని, ఆస్పత్రిలో ఉన్నానని చెప్పి అన్నెట్‌ నుంచి పలుమార్లు డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు. ఏళ్ల తరబడి ఆమెను మోసం చేస్తూ, వివిధ బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బు పంపించమని కోరాడు. చివరికి విలియం సంబంధాన్ని తెంచుకుని మాయం అయ్యాడు. మోసపోయానని గ్రహించిన అన్నెట్‌ ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తం రూ.2.6 కోట్లు విలియం తన నుంచి తీసుకున్నాడని తెలిపింది. కానీ, ఆమె ఫిర్యాదుపై ఎటువంటి స్పందన రాకపోవడంతో ఇతర మార్గాల్లో పరిష్కారం కోసం ప్రయత్నించింది.

అయితే, సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఇంతలో ఫేస్‌బుక్‌ ద్వారా నెల్సన్ అనే మరో వ్యక్తి అన్నెట్‌ను సంప్రదించాడు. తనకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ)లో స్నేహితుడు ఉన్నాడని, కేసు త్వరగా పరిష్కరించేందుకు సహాయం చేస్తానని అన్నెట్‌ను నమ్మబలికాడు. ఇందుకు 2500 డాలర్లు ఇవ్వాలని కోరాడు. మొదట నిరాకరించినా, తర్వాత అతడికి డబ్బు పంపింది. కానీ, అనంతరం ఆమె ఖాతాలో ఉన్న మొత్తం డబ్బు మాయమైనట్లు గ్రహించింది.

ఈ విధంగా రెండుసార్లు మోసపోయి అన్నెట్‌ మొత్తం రూ.4.3 కోట్లు నష్టపోయింది. ఆన్‌లైన్‌ మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తన పరిస్థితి మరెవరికి ఎదురుకాకూడదని అన్నెట్‌ కోరింది.

Tags:    

Similar News