ఆళ్లగడ్డ బరిలో అవంతిక!

కాగా రాయలసీమలో కీలకమైన కర్నూలు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

Update: 2024-01-21 00:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపొందడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్‌ అభ్యర్థుల స్థానాల్లో మార్పులుచేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఐదో విడత ప్రకటన ఒకటి రెండు రోజుల్లో ఉంటుందంటున్నారు. ఇప్పటివరకు నాలుగు విడతల్లో మొత్తం 68 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో 58 అసెంబ్లీ స్థానాలు, 10 లోక్‌ సభా స్థానాలు ఉన్నాయి.

కాగా రాయలసీమలో కీలకమైన కర్నూలు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014, 2019 ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను వైసీపీనే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ ఫలితాలను రిపీట్‌ చేయాలని కృతనిశ్చయంతో ఆ పార్టీ ఉంది.

ఈ క్రమంలో కీలకమైన ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్‌ రెడ్డి స్థానంలో ఆయన సోదరి అవంతికను బరిలో దింపొచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అవంతిక హైదరాబాద్‌ లో నివాసం ఉంటున్నారు. ఆళ్లగడ్డ నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ మహిళకు చాన్సు ఇస్తుండటంతో వైసీపీ కూడా మహిళకు చాన్సు ఇవ్వాలనే అభిప్రాయంతో జగన్‌ ఉన్నారని టాక్‌.

2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి వైసీపీకి చెందిన గంగుల బిజేంద్రనాథ్‌ రెడ్డి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున భూమా అఖిలప్రియ పోటీ చేశారు. ఆళ్లగడ్డ సీటు కోసం వచ్చే ఎన్నికల్లో టీడీపీ సీనియర్‌ నేత ఏవీ సుబ్బారెడ్డి, ఆయన కుమార్తె ఏవీ జశ్వంతి పోటీ పడుతున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు.. భూమా అఖిలప్రియకే సీటు ఇవ్వవచ్చని అంటున్నారు.

కొద్దిరోజుల క్రితం ఆళ్లగడ్డలో చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో భూమా అఖిలప్రియ అంతా తానై వ్యవహరించారు. ఏవీ సుబ్బారెడ్డి తదితరులను ఆ సమావేశానికి రానీయలేదు.

ఈ నేపథ్యంలో భూమా అఖిలప్రియపై మరో మహిళను పోటీ చేయిస్తే ఫలితం ఉంటుందని జగన్‌ భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్‌ రెడ్డి స్థానంలో ఆయన సోదరి అవంతికను బరిలో దింపడానికి నిర్ణయించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అవంతికను వెంటబెట్టుకుని బిజేంద్రనాథ్‌ రెడ్డి ఇటీవల జగన్‌ ను కలిశారు.

అవంతిక సైతం హైదరాబాద్‌ నుంచి ఆళ్లగడ్డకు మకాం మార్చారు. ఆళ్లగడ్డలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించి మహిళలకు బహుమతులు అందజేశారు. వైసీపీ కార్యక్రమాల్లోనూ ఆమె కనిపిస్తున్నారు. దీంతో ఆళ్లగడ్డ నుంచి వైసీపీ అభ్యర్థిగా అవంతిక పోటీ చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News